వాణిజ్య యుద్ధం ట్రంప్‌నకు చైనా హెచ్చరిక! మన వైఖరేమిటి?

అమెరికా వాంఛిస్తున్న మాదిరి యుద్ధమే కోరుకుంటే అది సుంకాల పోరు, వాణిజ్య పోరు లేదా మరేదైనా యుద్ధాన్ని కోరుకుంటే కడవరకు పోరాడేందుకు తాము సిద్ధమని చైనా ప్రకటించింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఎక్స్‌ పోస్టులో సవాలు విసిరింది. రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత తొలిసారి అమెరికా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మంగళవారం నాడు ప్రసంగించిన ట్రంప్‌ ఏప్రిల్‌ రెండవ తేదీ నుంచి చైనా, భారత్‌లపై ప్రతి సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పాడు. తాను విధించే సుంకాలు మరోసారి అమెరికాను ధనవంతురాలిగా, గొప్పదానిగా చేస్తాయని చెప్పుకున్నాడు. మోటారు వాహనాలపై భారత్‌ వంద శాతానికి మించి పన్నులు విధిస్తున్నదని, అమెరికా వేస్తున్నదాని కంటే రెట్టింపు చైనా పన్నులున్నాయని, తాము మిలిటరీ సాయం చేస్తున్నప్పటికీ దక్షిణ కొరియా నాలుగు రెట్లు ఎక్కువగా సుంకాలు విధిస్తున్నదని ట్రంప్‌ ఆరోపించాడు. దశాబ్దాల తరబడి ఇతర దేశాలు తమ మీద పన్నులు విధిస్తున్నాయని ఇప్పుడు తమ వంతు వచ్చిందన్నాడు. లేడిపిల్ల కన్నీళ్లను చూసి వేటగాడి మనసు మారుతుందా? మారదు గనుకనే అమీతుమీ తేల్చుకొనేందుకు చైనా నిర్ణయించింది.

మరి మన దేశం! ట్రంప్‌ ప్రకటించిన మేరకు నిజంగానే సుంకాలు అమల్లోకి వస్తే ఏటా మన దేశానికి 700 బిలియన్‌ డాలర్లు నష్టమని సిటీ పరిశోధన సంస్థ విశ్లేషకులు ప్రకటించారు. 2030 నాటికి ఉభయ దేశాల వాణిజ్య లావాదేవీలను 500 బిలియన్‌ డాలర్లకు పెంచాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు ఒక అవగాహనకు వచ్చారు. ఆ మేరకు అక్టోబరులో ఒప్పందం కుదరవచ్చని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని దెబ్బతీసే విధంగా ట్రంప్‌ సుంకాల ప్రకటన వెలువడ నుందని ఉప్పందిందేమో మార్చి ఎనిమిదవ తేదీవరకు ఉన్న కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని మన వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ ఆకస్మికంగా వాషింగ్టన్‌ బయలుదేరి వెళ్లారు. అక్కడి వాణిజ్య మంత్రితో మాట్లాడారు. అయినప్పటికీ ఆ తరువాతే ట్రంప్‌ ప్రకటన వెలువడింది. వెళ్లటం తప్పని కాదు, ఉన్న కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని అంత ఆకస్మికంగా పరుగు పెట్టాల్సిన అవసరం ఏమిటన్నదే ప్రశ్న. అమెరికాలో సూపర్‌ అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న ఎలన్‌మస్క్‌ మన దేశంలో తన కార్లను అమ్ముకోవాలంటే దిగుమతి పన్ను తగ్గించాల్సిందే అని ఒత్తిడి తెస్తున్నాడు. అతగాడి కోసమే ట్రంప్‌ పన్నుల ప్రకటన అన్నది స్పష్టం. తగ్గిస్తే మన దేశంలోని టాటా, ఎంజి, మహింద్రలకు కోపం, లేకపోతే ట్రంప్‌కు ఆగ్రహం. ఎవరిని వదులుకోవాలన్నది ఇప్పుడు నరేంద్ర మోడీ ముందున్న ప్రశ్న. ఒకవేళ ఒత్తిడికి లొంగి కార్ల మీద పన్ను తగ్గించిన తరువాత మిగతావాటి సంగతేమిటని మెడపట్టుకు కూర్చుంటే..!

తమపై వాణిజ్య యుద్ధం ప్రారంభించిన అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ మీద తగ్గేదేలే అంటున్నాయి దేశాలు. కెనడా, మెక్సికోలపై పన్ను విధింపులో ట్రంప్‌ పునరాలోచన చేయవచ్చన్న సూచనలు అమెరికా వాణిజ్య మంత్రి నుంచి వెలువడినప్పటికీ అది జరగలేదు. పన్ను పోరు ఎటువైపు దారితీస్తుందో, దాని పర్యవసానాలు ఏమిటో చర్చగా మారాయి. చైనా, కెనడా ప్రతి పన్ను ప్రకటన చేయగా మెక్సికో ఏక్షణంలోనైనా పోరులో పాల్గొనవచ్చని వార్త. చైనా మీద రెండు సార్లుగా పది శాతం చొప్పున పన్ను విధించగా మిగతా రెండు దేశాల మీద 25 శాతం ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. సంవత్సరాల తరబడి మేమంటే నవ్వులాటగా మారింది, మా తడాఖా చూపుతాం అన్నాడు ట్రంప్‌. అక్రమంగా వలస వచ్చే వారిని కెనడా, మెక్సికో నిలువరించాయని, ఫెంటానిల్‌ రవాణాను నిలిపేందుకు మరింతగా చేయాల్సి ఉందని అంతకు ముందు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్‌నిక్‌ అన్నాడు.

ట్రంప్‌ ప్రకటన వెలువడగానే ఈ నెల పది నుంచి అమల్లోకి వచ్చే విధంగా మంగళవారం నాడు పలు వస్తువులపై పది నుంచి 15 శాతం మేరకు చైనా అదనంగా ప్రతి పన్ను ప్రకటించింది. వాటిలో కోడి, పంది, గొడ్డు మాంసం, పలు వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. తైవాన్‌కు ఆయుధాలను విక్రయించే 15 సంస్థలపై ఆంక్షలను విధించింది. మరో పదింటిని నమ్మకూడని వాటి జాబితాలో చేర్చింది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడోవ్‌ కూడా ట్రంప్‌ ప్రకటన వెలువడగానే అదే రోజు అర్ధరాత్రి నుంచి 155 బిలియన్‌ డాలర్ల విలువగల అమెరికా వస్తువులపై 25 శాతం ప్రతి పన్ను విధించినట్లు ప్రకటించాడు. అమెరికా వెనక్కు తగ్గేంతవరకు అవి కొనసాగుతాయన్నాడు. అమెరికాలోని 30 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌, చమురు సరఫరాలపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దశలవారీగా ఇతర వస్తువులు, పది కోట్ల డాలర్ల ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ ఒప్పందంపై ఆంక్షలు ప్రకటించే దిశగా కెనడా ఉంది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్‌ విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్‌ పన్నులను ఎదుర్కొనేందుకు తమ దగ్గర నాలుగు పథకాలు ఉన్నాయని, సహనం పాటిస్తున్నట్లు, ఆదివారం నాడు మెక్సికో సిటీలో జరిపే ఒక బహిరంగ సభలో వెల్లడిస్తామని చెప్పారు. అమెరికాతో ఎంతో అనుభవం ఉందని, వారి చర్య కొంత మేరకు యుద్ధం తప్ప మరొకటి కాదని పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌ అన్నాడు.

తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంతో 2018 నుంచి అమెరికా దిగుమతులపై ఆధారపడటాన్ని చైనా క్రమంగా తగ్గిస్తున్నది. స్వంతంగా ఉత్పత్తి లేదా ఇతర దేశాల నుంచి తెచ్చు కుంటున్నది. అంతకు ముందుతో పోలిస్తే 2023లో 20 శాతం తగ్గితే 2024లో 14 శాతం తగ్గించి 29.25 బిలియన్‌ డాలర్ల మేర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. అయినప్పటికీ అమెరికా రైతాంగానికి చైనా అతి పెద్ద మార్కెట్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నది. అక్కడ పండే సోయాలో 2016లో 40 శాతం చైనాకు ఎగుమతి చేయగా గతేడాది 21 శాతానికి తగ్గాయి. మొక్కజొన్నల దిగుమతి 260 కోట్ల డాలర్ల నుంచి 2024లో 56 కోట్ల డాలర్లకు పడిపోయింది. కోళ్ల దాణాకు ఉపయోగించే వీటిని దేశీయంగా ఉత్పత్తి పెంచటం, కొంత మేరకు బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నది. అమెరికాలో కోడి కాళ్లు, పంది చెవులు, పందితలను తినరు, వాటిని 2021లో 411 కోట్ల డాలర్ల మేర దిగుమతి చేసుకోగా గతేడాది 254 కోట్లకు తగ్గించింది. జొన్నల దిగుమతి పెరిగింది. అమెరికా 2023లో మొత్తం 3.1 లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులు, వ్యవసాయ పంటలు ఆహారాన్ని దిగుమతి చేసుకోగా, ఇప్పుడు కూడా అంతే మొత్తం దిగుమతి చేసుకుంటే ట్రంప్‌ విధించిన పన్నుల భారం 43 శాతం మీద పడనుందని అంచనా. ఆ మేరకు అమెరికా వినియోగదారులపై దాదాపు ప్రతి రోజువారీ వస్తువుపై అదనపు భారం మోపినట్లే. అమెరికాలోని ఆటో పరిశ్రమ తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సగానికి పైగా ఇంజన్లు, విడిభాగాలు కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వాటి మీద 25 శాతం పన్నులు అంటే ఒక్కో కారు ధర పన్నెండు వేల డాలర్లు పెరిగే అవకాశం ఉందని అంచనా. కాస్త బాధ ఉన్నప్పటికీ అమెరికాను అగ్రభాగాన నిలిపేందుకు ఆ మాత్రం మూల్యం చెల్లించాల్సిందే అని ట్రంప్‌ అన్నాడు.

గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు చూస్తే మన ఉక్కు దిగుమతులు రికార్డులను బద్దలు కొడితే ఎగుమతులు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ప్రపంచంలో ముడి ఇనుము ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న మన దేశం అంతిమంగా తయారైన ఉక్కు ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే దేశంగా నరేంద్ర మోడీ ఏలుబడిలో మారింది. దక్షిణ కొరియా, చైనా, జపాన్‌ నుంచి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. మన మొత్తం దిగుమతుల్లో 78 శాతం ఈ దేశాల నుంచే జరుగుతున్నాయి. దిగుమతులు పెరగటంతో 15 నుంచి 25 శాతం వరకు దిగుమతి పన్ను విధింపు గురించి ఆలోచిస్తున్నట్లు ఉక్కుశాఖా మంత్రి కుమారస్వామి గత నెలలో చెప్పారు. మన దేశంలో తయారైన ఉక్కు ఎగుమతులు ఎక్కువగా ఇటలీ, బెల్జియం, నేపాల్‌, స్పెయిన్లకు జరుగుతుండగా గణనీయంగా పడిపోయాయి.

అమెరికా పన్ను విధింపునకు కట్టుబడి ఉంటే పీఠమెక్కి రెండు నెలలు కూడా గడవక ముందే తాను రాజునని ప్రకటించుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ తనకు లొంగరు అనుకున్నవారి మీద ఎడాపెడా కొరడా ఝళిపిస్తున్నాడు. సుంకాలు, ప్రతి సుంకాలు విధిస్తూ బస్తీ మే సవాల్‌ అంటున్నాడు. తల వంచేట్లు చేసేందుకు బెదిరింపులా, బేరమాడేందుకు వేస్తున్న పాచికలా చివరకు ఏం జరుగుతుంది, ఎలా ముగుస్తుందన్నది ఎవరూ చెప్పలేరు. ప్రతి దేశానికి బలం-బలహీనతలు ఉన్నాయి, దానికి అమెరికా మినహాయింపు కాదు గనుక ట్రంపు కూడా వెనక్కు తగ్గినా ఆశ్చర్యం లేదు. జి7 కూటమిలో ఉండటమే గాక అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకోవాలన్న సంకల్పాన్ని ట్రంప్‌ వెలిబుచ్చాడు. ప్రతి సుంకాలు విధిస్తే మరింతగా పెంచుతామంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు. తోటి దేశాధినేత అని కూడా చూడకుండా సుంకాల విషయాన్ని ”కెనడా గవర్నర్‌ జస్టిన్‌ ట్రుడోవ్‌కు” వివరించండని కూడా దానిలో సలహా ఇచ్చాడు. అమెరికాలో రాష్ట్ర పాలకులను గవర్నర్‌ అంటారు గనుక కెనడా తమ మరొక రాష్ట్రమని చెప్పటమే అది. ట్రంప్‌ టిప్‌టాప్‌గా ఉన్నప్పటికీ అతగాడి చర్యలు పిచ్చివాడి పనిగా ఉన్నాయంటూ ఒక పత్రిక చేసిన వ్యాఖ్యను ట్రుడోవ్‌ ఉటంకించాడు. అత్యంత సన్నిహితం, భాగస్వామిగా ఉన్న కెనడా మీద వాణిజ్య యుద్ధం ప్రకటించి అదే సమయంలో హంతక పుతిన్‌ను సంతుష్టీకరించేందుకు పూనుకోవటం మతి ఉండి చేస్తున్న పనులేనా అన్నట్లుగా విరుచుకుపడ్డాడు. నిజంగా వాణిజ్య పోరు జరిగితే చివరి వరకు కెనడా నిలుస్తుందా లేదా అన్నది వేరే అంశం.

చివరికి కెనడాలో అత్యధిక జనాభా గల ఒంటారియో రాష్ట్ర ప్రధాని డగ్‌ ఫోర్డ్‌ కూడా ట్రంప్‌ను దుయ్యబట్టాడు. మేమిచ్చే విద్యుత్‌, ఇంథనం మీద ఆధారపడుతూ మమ్మల్ని బాధిస్తారా మేం తలుచుకుంటే న్యూయార్క్‌ నగరంలో పదిహేను లక్షల మందికి విద్యుత్‌ నిలిచిపోతుంది జాగ్రత్త అన్నాడు. కమ్యూనిస్టు చైనీయుల సంగతి వదిలేద్దాం, కెనడియన్లే అలా స్పందిస్తే మన సంగతేమిటి? తాను ప్రపంచమంతా తిరిగి పోయిన భారత ప్రతిష్టను తిరిగి తెచ్చానని ఆత్మగౌరవాన్ని నిలిపానని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ నోటి నుంచి ట్రంప్‌ సుంకాల ప్రకటన మీద ఎలాంటి స్పందన లేదు. ఆత్మగౌరవమా, లొంగుబాటా ఏమనుకోవాలి? ఫిబ్రవరి రెండవ వారంలో మోడీ అమెరికా పర్యటన జరపటానికి ముందే నమస్కార బాణం వేసినట్లుగా కొన్ని రకాల మోటారు సైకిళ్ల మీద 50 శాతం పన్నును 30కి, విస్కీ మీద 150 నుంచి 100 శాతానికి, అలాగే మరికొన్నింటి మీద పన్నులు తగ్గించి ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు చూశారు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదనుకోవాలా? ఏదైనా 140 కోట్ల మంది జనానికి ఏదో ఒకటి చెప్పాలా వద్దా! మౌనానికి అర్ధం ఏమిటి?

ఎం. కోటేశ్వరరావు

➡️