తన నానీల ద్వారా పల్లె హృదయాలను పట్టుకొని, వ్యవసాయ నానీలను పాఠకులకు అందించిన వారిలో ముఖ్యులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య. వీరు తన రచనలలో కుటుంబ వ్యవస్థ, పల్లె మట్టి పరిమళాన్ని, రైతు, రైతు కూలీల జీవితాల్ని ఆవిష్కరించారు. సాహిత్యం పట్ల మక్కువతో 1997లో మినీ కవితా సంపుటి ‘లోయలో మనిషి’ని వెలువరించారు. అదే సంవత్సరంలో ఆచార్య ఎన్. గోపి రూపొందించిన నానీల ప్రక్రియ పట్ల ఆకర్షితులై 2001లో ‘తొలకరి చినుకులు’ నానీల సంపుటాన్ని రచించారు. పల్లెటూరి రైతు కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వీరు రైతు కూలీల శ్రమైక జీవితాలను, వారి సాధక బాధలను, బంధాలు అనుబంధాల గురించి తన సాహిత్యంలో ఆవిష్కరించారు. వీరు చీట్ అను కథానికను, రంగుల ప్రపంచంలో అమ్మ, ఆశకు ఆవలి వైపు, కథాకేళి, ఇంతే సంగతులు కథలను రచించారు. తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల, చేను చెక్కిన శిల్పాలు మరియు నాగలికి నమస్కారం వంటి నానీల కవితా సంపుటాలను రచించారు. చల్లకవ్వం, తదేక గీతం వంటి వచన కవితా సంకలనాలను, మట్టి పొరల్లోంచి అను వచన కవితా సంపుటిని, లోయలో మనిషి అను మినీ కవితా సంకలనాలను రచించారు. తన తల్లిదండ్రుల గుర్తుగా 2007 నుండి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో చిన్న కథల పోటీలను నిర్వహించి సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కవిగా, రచయితగా సాహిత్యాన్ని సృజించారు. రచయితల సంఘం అధ్యక్షులుగా పలు సాహిత్య కార్యక్రమాలను నిర్వహించిన సోమేపల్లి వెంకట సుబ్బయ్య 2023 డిసెంబర్ 14వ తేదీన అనారోగ్యంతో మరణించారు.
– అనిల్ కుమార్ దారివేముల,
వార్డు వెల్ఫేర్ సెక్రెటరీ, గుంటూరు.