విదేశీ దిగుమతులు – నష్టాల్లో కోకో రైతులు

మన రాష్ట్రంలో 75 వేల ఎకరాలలో కోకో తోటల సాగు ఉంది. ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్‌ పామ్‌ తోటల్లో కోకో అంతర పంటగా ఉంది. మన దేశ అవసరాలకు తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తి లేదు. 80 శాతం కోకో ను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. కోకో ను చాక్లెట్లు, కేకులు, వివిధ ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నారు.
కోకో గింజలను కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో మోండలీజ్‌ (క్యాడ్బరీ) ప్రధాన కొనుగోలు కంపెనీగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రకారం ధర ఇస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. గత సంవత్సరం కంపెనీలు పోటీ పడి అంతర్జాతీయ మార్కెట్‌ ధరకు అనుగుణంగా కిలో గింజలను రూ.1040 వరకు కొనుగోలు చేశారు. గత సంవత్సరం రైతుకు కిలో కోకో గింజలకు సరాసరి ధర రూ.749 వచ్చింది. రాష్ట్రంలో 1992 నుండి కోకో తోటల సాగు ఉన్నా ఈ విధంగా ధర వచ్చిన సందర్భాలు లేవు. ఎన్నో కష్టనష్టాలకోర్చి రైతులు కోకో గింజలు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సంవత్సరం కంపెనీలు సిండికేట్‌గా మారి అంతర్జాతీయ ధర ఇవ్వడం లేదు. పైగా అన్‌సీజన్‌ (వర్షాకాలపు) గింజలు కొనుగోలు చేయడం లేదు. సీజన్‌ కోకో గింజలు ధర రోజురోజుకీ తగ్గించి వేస్తున్నారు. కంపెనీలు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది. కంపెనీలను ఏమీ చేయలేం అన్నట్లుగా ఉద్యాన శాఖ అధికారులు మాట్లాడుతున్నారు.
కంపెనీలు రైతులను ఇబ్బందులు పెట్టే ధోరణితోనే ఉన్నాయి. పాత గింజల కొనుగోలుపై కంపెనీలు స్పష్టత ఇవ్వడం లేదు. కంపెనీలు మాత్రం అన్‌సీజన్‌ గింజలు కొనలేమని, నాణ్యత లేదని బుకాయిస్తూ రోజురోజుకీ ధర తగ్గించి వేస్తున్నాయి. అధికారులు, ప్రభుత్వం కూడా కంపెనీలు కొనాలని గట్టిగా చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ చెప్పినా కంపెనీలు మాత్రం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇంతక ముందు లేని గ్రేడింగ్‌ విధానాన్ని ముందుకు తీసుకువచ్చారు. నాణ్యతా ప్రమాణాలు గురించి మాట్లాడుతున్నారు. కంపెనీలు కొత్త గింజలు కొంటామని పాత గింజలు కొనలేమని చెప్పడం అన్యాయం. కొత్త గింజలు రూ.650 నుండి రూ.600కు ఇప్పుడు రూ.550కు, రూ.500కు ధర తగ్గించారు. ఈ ధర మరింత తగ్గిస్తామని కంపెనీలు రైతులను బెదిరిస్తున్నాయి. అన్‌సీజన్‌ గింజలను రూ.200 నుండి రూ.240కు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ కొనుగోలు కూడా నామ మాత్రమే. అక్కడక్కడ కొనుగోలు చేసినా చాలా తక్కువ ధర ఇస్తున్నాయి. రైతులు గత్యంతరం లేక అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల ఎరువులు, పురుగు మందులు ధరలు పెరిగాయి. కోకో గింజల ధర పెరిగిన తర్వాత కౌలు రేట్లు పెరిగాయి. ప్రస్తుతం ఎకరా కోకో తోటలకు రూ. లక్ష నుండి రూ.లక్ష 50 వేల వరకు కౌలు ఉంది. ఎకరాకు ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు రూ. 60 వేల వరకు ఖర్చు అవుతున్నాయి. కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం తగినంతగా జోక్యం చేసుకోకపోతే కోకో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతారు.
ఎగుమతులు దిగుమతులు విధానం వలన కోకో రైతులు నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం వైపు నుండి తగిన జోక్యం లేదు. విదేశీ కోకో గింజల దిగుమతుల నిలుపుదలకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా దేశీయంగా రైతు నష్టపోవాల్సి వస్తోంది. ధర గురించి అడిగితే అధికారులు సప్లై-డిమాండ్‌ సూత్రం చెబుతున్నారు. 80 శాతం కోకోను దిగుమతి చేసుకుంటున్న మనదేశంలో సప్లై ఉన్నట్లా లేనట్లా? డిమాండ్‌ ఉన్నది గానీ సప్లై లేదు. మరి ఈ పరిస్థితుల్లో కోకో రైతుకు మెరుగైన ధర రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు రావడం లేదో సమాధానం లేదు. గత సంవత్సరం ఘనాలో పంట దెబ్బతిని దిగుబడులు లేవు కాబట్టి అంతర్జాతీయంగా కోకోకు డిమాండ్‌ పెరిగింది. ఈ సంవత్సరం ఆఫ్రికన్‌ దేశాల్లో దిగుబడులు పెరిగాయి కాబట్టి ధర తగ్గిందని చెప్తున్నారు. అయినా ప్రస్తుతం కిలో కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్‌ ధర రూ.700 వరకు ఉంది. ఈ ధర రైతుకు రావడం లేదు. పైగా కంపెనీలు రైతుల నుండి గింజలు కొనుగోలు చేయడం లేదు. తమ దగ్గరున్న కోకో గింజలను వెంటనే కొనుగోలు చేయకపోతే కోకో రైతులు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఇప్పటికే రైతుల ఆత్మహత్యలలో మన రాష్ట్రం దేశంలో మూడవ స్థానంలో ఉంది. కోకో రైతులను ఈ సంక్షోభం నుండి బయటపడేలా ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టకపోతే కోకో గింజల కొనుగోలు సమస్య మరింత తీవ్రమవుతుంది. సీజన్‌ గింజలు రైతు చేతికి వస్తున్నాయి. రైతు వద్ద మరింత నిల్వలు పెరిగితే కంపెనీలు కొనుగోలు చేయకపోతే మరింత నష్టపోతారు.
ధరల స్థిరీకరణ నిధి పథకం గురించి ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్నాయి. ఆచరణలో అమలు లేదు. ప్రస్తుతం కంపెనీలు ఇస్తున్న ధర వల్ల రైతులు నష్టపోతున్నారు కాబట్టి వ్యత్యాసపు ధరను ప్రభుత్వాలు చెల్లించాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. విదేశీ కోకో గింజల దిగుమతుల నిలుపుదలకు కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తేవాలి. రాష్ట్రంలో ఎక్కడా కోకో ప్రాసెసింగ్‌ యూనిట్లు లేవు. వీటిని ఏర్పాటుచేసి రైతుకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వాలు శాశ్వత చర్యలు చేపట్టాలి.
రాష్ట్రంలో కొబ్బరి పంటలోనే కాకుండా ఆయిల్‌ పామ్‌ అంతర పంటగా కోకోని అభివృద్ధి చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉన్న కోకో పంట సాగు విస్తీర్ణం పెంచడమే కాకుండా మంచి దిగుబడి, ధర వచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. కోకో కు బోర్డు ఏర్పాటు చేసి వేలం ద్వారా కోకో గింజలు కొనుగోలు చేసే విధంగానైనా రైతులతో సంప్రదించి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ పరిస్థితుల్లో తమ సమస్యల పరిష్కారం కోసం కోకో రైతులు సంఘటితం కావడం తప్ప మరో మార్గం లేదు.


– వ్యాసకర్త : కె. శ్రీనివాస్‌, ఎ.పి కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్‌:94900 98574

➡️