అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసిన ప్రసంగం, ప్రకటనలు ప్రపంచానికి పెనుముప్పును కలగజేసేవి కావడంతో తీవ్ర ఆందోళన కలుగుతోంది. వలసదారులను నియంత్రించేందుకు జన్మత్ణ పౌరసత్వం రద్దు, వీసా వ్యవస్థను కఠినతరం చేయడం, ఇంధన కంపెనీలకు విశృంఖల స్వేచ్ఛ కల్పించడం వంటి ట్రంప్ చర్యలు నేరుగా ఆ దేశంపై ప్రభావం చూపుతాయి. కానీ, విదేశీ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ చేస్తున్న బెదిరింపులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) నుంచి, వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వస్తుందన్న ప్రకటనలు ప్రపంచ వ్యాపితంగా తీవ్ర ప్రభావం చూపుతాయి. భవిష్యత్తరాలకు అరిష్టదాయకంగా పరిణమించనున్నాయి. కోవిడ్-19 మహమ్మారిని అదుపు చేయడంలో డబ్ల్యుహెచ్‌ఓ విఫలమైందనీ, చైనా పట్ల పక్షపాతిగా వ్యవహరించిందని ఆరోపిస్తూ రానున్న 12 నెలల్లో ఆ సంస్థకు చెల్లిస్తున్న మొత్తాలను పూర్తిగా నిలిపివేస్తామన్నారు. డబ్ల్యుహెచ్‌ఓ నుండి వైదొలగే నిర్ణయం అసలు ఊహించనిది కాకపోయినా తొలిరోజునే అంతటి దుర్మార్గంగా ప్రకటిస్తారని అనుకోలేం. ఆయన అధ్యక్షునిగా ఉన్నపుడు డబ్ల్యుహెచ్‌ఓ ను ‘పూర్తిగా చైనా యాజమాన్యంలోని.. దాని నియంత్రణలోని సంస్థ’ వంటి తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి డోనాల్డ్ ట్రంప్. ఆ సంస్థకు నిధుల విడుదల నిలుపుదల చేస్తూ 2020 సంవత్సరంలో ప్రయత్నించినా పదవీకాలం ముగుస్తున్న దశలో అది ఆచరణకు రాలేదు కనుక ప్రపంచ మానవాళికి ఊరట కలిగింది. తాజాగా ట్రంప్ చేసిన ప్రకటన అమలులోకి వస్తే డబ్ల్యుహెచ్‌ఓ కు సమకూరే నిధుల్లో 18 శాతం మొత్తాలు ఆగిపోతాయి. ఆ సంస్థ ఆరోగ్య కార్యకలాపాలకు ముఖ్యంగా ఎయిడ్స్, టిబి వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు, ప్రమాదకరమైన అంటువ్యాధుల అదుపునకు చేపడుతున్న చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. అంతేగాక ప్రాణ రక్షక ఔషధాలు ప్రపంచవ్యాప్తంగా హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ అందుబాటున ఉండేలా చూడడం, విశ్వమంతటా ఆరోగ్య వ్యవస్థలు పటిష్టంగా నిర్వహింపజేయడంలో డబ్ల్యుహెచ్‌ఓ నిర్వహిస్తున్న పాత్ర బలహీనపడే ప్రమాదం ఏర్పడుతుంది.
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా ఇలా బయటకు రావడం ఇది రెండోసారి. ప్రమాణ స్వీకార సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగంలో స్వచ్ఛ ఇంధనం చాలా ఖరీదుతో కూడుకున్నది, పనికిమాలినదని అనడమేగాక శిలాజ ఇంధనాలను తవ్వి తీసి, ఉపయోగించేందుకు రెట్టించిన పట్టుదలతో కృషి చేస్తామని చెప్పడం బాధ్యతారహితం. అంతేగాక ఎనర్జీ ఎమర్జెన్సీని తాను డిక్లేర్ చేస్తానన్నారు. ‘ఈ భూ మండలంపై ఏ తయారీరంగ దేశానికి లేనంత చమురు సంపద మనం కలిగి ఉన్నాం. వాటిని మనం ఉపయోగించుకుందాం’ అని చెప్పడం తెంపరితనమే! మానవాళికి పెను ముప్పుగా పరిణమిస్తున్న భూగోళం వేడెక్కడం సంబంధిత సంక్షోభాలను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజం 2015 డిసెంబరులో పారిస్‌లో ఒక ఒప్పందానికి వచ్చినా అనేక తర్జన భర్జనల అనంతరం 2016 సెప్టెంబరులో అమెరికా అందులో చేరింది. ప్రపంచంలో అత్యధిక స్థాయిలో హరిత వాయువులను విడుదలజేసే అతి పెద్ద కాలుష్యకారి అమెరికా. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి రాగానే పారిస్ ఒప్పందానికి చెల్లు చీటీ ఇచ్చారు. 2021లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ పారిస్ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరేందుకు ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తొలి సంతకం చేశారు. ట్రంప్ రెండో సారి శ్వేత సౌధంలోకి అడుగిడిన వెంటనే చేసిన పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రపంచ ప్రజల ప్రయోజనాల కన్నా కార్పొరేట్ ప్రయోజనాలే తనకు ముఖ్యమని చాటుకున్నారు.
ప్రపంచంలో ప్రతిఒక్కరూ క్షేమంగా ఉంటేనే ఏ ఒక్కరైనా క్షేమంగా ఉండగలరన్న నగసత్యాన్ని కోవిడ్-19 మనందరికీ తెలియజెప్పింది. ఈ కఠోర వాస్తవాన్ని గుర్తెరిగి ట్రంప్ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని డబ్ల్యుహెచ్‌ఓ లో అమెరికా ఎప్పటిమాదిరిగా భాగస్వామిగా కొనసాగి యథావిధిగా నిధులు విడుదల చేయాలని ప్రపంచమంతటి నుంచీ ఒత్తిడి తేవాలి. అలాగే పర్యావరణ పరిరక్షణ కూడా ఏ ఒక్క దేశానికి మాత్రమే సంబంధించినది కాదు కనుక ప్యారిస్ ఒప్పందంలో అమెరికా కొనసాగాలనీ ప్రజాభిప్రాయం ద్వారా ట్రంప్‌ను ప్రభావితం చేయాలి. అందుకోసం అన్ని వైపులా కృషి జరగాలి.
