ప్రపంచ కార్మికవర్గ శ్వాస కామ్రేడ్‌ లెనిన్‌

profile of lenin history imporatance of protest sitaram yechury article

ఓల్గా నది సమీపంలోని సింబిర్క్స్‌ పట్టణంలో 1870 ఏప్రిల్‌ 22న జన్మించిన లెనిన్‌ 54 ఏళ్ళు మాత్రమే జీవించి 1924 జనవరి 21న అస్తమించాడు. అతి తక్కువ జీవిత కాలంలో ఆయన చేసిన కృషి ప్రపంచ పీడితుల విముక్తి మార్గానికి నిత్య సూర్యోదయంగా, కష్టజీవుల ఉద్యమాలకు ఉఛ్వాస నిఛ్వాసాలుగా వెలుగొందుతుంది. విప్లవోద్యమానికి ఎదురైన ప్రతి క్లిష్ట సమయంలో సరైన మార్గాన్ని చూపిన గొప్ప అన్వేషి కామ్రేడ్‌ లెనిన్‌. మానవాళి సకల కష్టాలకు, కన్నీళ్ళకు మూలమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకవైపు పోరాడుతూనే, మరోవైపు విప్లవ పార్టీ నిర్మాణం కోసం అంతర్గత విరోధులతో ఏక కాలంలో పోరాడి విజయం సాధించిన నిజమైన సవ్యసాచి లెనిన్‌. దోపిడిదారుల పాలనా తీరును, వారు అనుభవిస్తున్న భోగభాగ్యాల మూలాలను కారల్‌మార్క్స్‌ శాస్త్రీయంగా సిద్ధాంతీకరిస్తే, దోపిడిదారుల పెట్టుబడి రాజ్యాంగ యంత్రాంగం అండతో తిమింగలం లాగా మారిన సామ్రాజ్యవాదాన్ని, మత వ్యవస్థలను ఎదిరించి సోషలిజాన్ని సాధించాడు. కార్మికుల చైతన్యాన్ని తక్కువ చేసి మాట్లాడేవారికి, ఆర్థిక పోరాటాలే కీలకమని భావించేవారికి, పరిస్థితుల సాకుతో పనులు వాయిదా వేసేవారికి, చిన్న విజయాలను చూసి గర్విస్టులుగా మారే వారికి, మార్క్సిజానికి వక్రభాష్యాలు చెబుతూ కార్యకర్తల్లో గందరగోళాలు సృష్టించే స్వపక్ష ద్రోహులకు, పార్టీ నిర్మాణ సూత్రాలను ధిక్కరిస్తూ పార్టీ కంటే అతీతులమని భావించే అహంకారులకు ఆయన ఆచరణ ద్వారా, రచనల ద్వారా చెంప చెళ్లుమనిపించాడు. కమ్యూనిస్టులు ప్రజల మధ్య ఏమి చేయాలో, ఎలా చేయాలో నేర్పిన గొప్ప మార్గదర్శి లెనిన్‌.

లెనిన్‌ అసలు పేరు వ్లదిమీర్‌ ఇల్యిచ్‌ ఉల్యనోవ్‌. తండ్రి ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి, విద్యావంతురాలు. వీరి అరుగురు పిల్లల్లో లెనిన్‌ మూడవ సంతానం. తల్లి నుండి పుస్తకాలను అధ్యయనం చేయడం, అన్న నుండి ప్రజల కోసం పని చేయడం బాల్యంలోనే నేర్చుకున్నాడు. అన్న అలెక్సాండ్ర్‌ ద్వారా మొట్టమొదటిసారి మార్క్సిస్టు సాహిత్యానికి పరిచయం అయ్యాడు. లెనిన్‌కు 16 సంవత్సరాల వయసులో తండ్రి హఠాత్తుగా చనిపోగా, ఆ మరుసటి సంవత్సరం అన్న అలెక్సాండ్ర్‌ను జార్‌ చక్రవర్తి ప్రభుత్వం ఉరితీసింది. ఆహ్లాదంగా సాగుతున్న లెనిన్‌ జీవితంలో ఈ మరణాలు అల్లకల్లోలాలను సృష్టించాయి. కజాన్‌ యూనివర్శిటీలో లా విద్యార్థిగా చేరాడు. అక్కడున్న అభ్యుదయ విద్యార్థులతో కలిసి రహస్య సమావేశాల్లో పాల్గొన్నాడు. ప్రభుత్వ నియంతృత్వ చర్యలను ప్రతిఘటించడంతో యూనివర్శిటీ బహిష్కరణతోపాటు అరెస్టు అయ్యాడు. జైలు నుండి విడుదల చేసిన ప్రభుత్వం సంవత్సరం రోజులు ఒక మారుమూల గ్రామంలో ప్రవాసీగా నిర్బంధించింది. దీనికి ఆయన బెంబేలెత్తలేదు, సమయాన్ని వృధా చేయలేదు. ”నా జీవితంలో ఆ సంవత్సరం చదివినంతగా ఎప్పుడూ చదవలేదు” అని ఆయన ఆ తర్వాత రాసుకున్నాడు. చిన్న చిన్న ఆటంకాలనే పెద్దవిగా చూపి పార్టీ పనులు వాయిదా వేసేవారు లెనిన్‌ చేసిన ఈ కృషిని గమనంలో ఉంచుకోవాలి.

మార్క్స్‌, ఎంగెల్స్‌ రచించిన అనేక గ్రంథాలను చదవడంతో పాటు, ”కమ్యూనిస్టు ప్రణాళిక”ను రష్యా భాషలోకి అనువదించాడు. ఈ క్రమంలో తన అన్న అనుసరించిన నర్నోద్నిక్కుల మార్గం సరైంది కాదని, దీనివల్ల కార్మికుల, ప్రజల బాధలు తీరవని నిర్ధారణకు వచ్చాడు. మధ్యలో ఆగిపోయిన యూనివర్శిటీ కోర్సును పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు. అది ఎక్కువ కాలం కొనసాగలేదు. తన విప్లవ కార్యాచరణను నాటి రష్యా రాజధాని సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో కొనసాగించేందుకు 1893లో అక్కడకు వెళ్లాడు. అక్కడ జరుగుతున్న కార్మికుల పోరాటాల్లో పాల్గొంటూ, నాయకులతో పరిచయాలు పెంచుకుని కార్మిక వర్గానికి విప్లవ రాజకీయ పార్టీ అవసరమని వారి ముందు ప్రతిపాదన పెట్టాడు. ఈ ప్రతిపాదనకు నర్నోద్నిక్కులు అడ్డుతగిలారు. పీటర్స్‌బర్గ్‌ వెళ్లిన సంవత్సరానికే (1894లో) ”ప్రజల మిత్రులు ఎవరు? వాళ్ళు సోషల్‌ డెమోక్రాట్లతో ఎలా పోరాడతారు?” అనే పుస్తకాన్ని రాశాడు. కొత్త రంగాల్లోకి, ప్రాంతాల్లోకి వెళ్లి పని చేయాలంటే నాకు అక్కడ ఎవరూ పరిచయం లేరని వాదించేవారు యువ కార్యకర్తగా లెనిన్‌ చేసిన ఈ కృషి సదా గుర్తించుకోవాలి.
మార్క్సిజం సారాన్ని కార్మికులకు ముఖ్యంగా చురుకుగా వున్న కార్మికులకు సులభంగా, క్లుప్తంగా చర్చల ద్వారా, సంఘటనల ద్వారా వివరించడం కోసం స్టడీ సర్కిళ్లు నిర్వహించాడు. ఈ క్రమంలోనే కృపస్కయా అనే కార్మిక నాయకురాలితో పరిచయమై ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. మార్క్సిజాన్ని, కార్మికవర్గ సమస్యలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి కరపత్రాలు, పుస్తకాలను మార్గాలుగా ఎంచుకున్నాడు. ‘కార్మికవర్గ విముక్తి పోరాట సమితి’ పేరుతో ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ కమిటీ ఆధ్వర్యంలో పీటర్స్‌బర్గ్‌ లో 30 వేల మంది జౌళి కార్మికులు 1896లో చరిత్ర ప్రసిద్ధికెక్కిన సమ్మె చేశారు. ‘కార్మికుల లక్ష్యం’ అనే పేరుతో వార్తా పత్రిక నడుపుతున్నాడని లెనిన్‌ను అరెస్టు చేసి 14 నెలలు ఒంటరిగా నిర్బంధించారు. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని శత్రవులు భావించగా అందుకు భిన్నంగా రాటుదేలిన విప్లవకారుడిగా తయారయ్యాడు. రష్యా ప్రభుత్వం లెనిన్‌ను వెంటాడటం తీవ్రం చేసి 1897లో మరలా అరెస్టు చేసి మూడు సంవత్సరాలు సైబీరియా ప్రవాసం (మన దేశంలో అండమాన్‌ జైలు లాంటిది) శిక్ష వేశారు. అది ఒక మారు మూల గ్రామం. అందుబాటులో వున్న పరిమిత అవకాశాలతోనే ముప్పైకి పైగా రచనలు చేశాడు. ఇందులో ప్రఖ్యాతమైన ‘రష్యన్‌ సోషల్‌ డెమోక్రాట్లు-కర్తవ్యాలు’ ఒకటి. అలాగే ‘రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి’ గ్రంథం మార్క్స్‌ రాసిన ‘పెట్టుబడి’ గ్రంథానికి కొనసాగింపుగా నిలిచింది. ఈ కాలంలో జరిగిన సమ్మెల వల్ల కార్మికులకు కొంత వేతనాలు పెరగడంతో కార్మిక నాయకుల్లో ఆర్థికవాదం పెరిగింది. దీని ప్రమాదాన్ని లెనిన్‌ వేగంగా గుర్తించి కార్మికుల్లో వర్గ చైతన్యం పెంచడానికి కార్మిక పత్రిక ఉండాలని, అందుకు పార్టీని సన్నద్ధం చేశాడు. పోలీసు నిర్బంధం వల్ల విదేశాల నుండి ఈ పత్రికను నడపాలని నిర్ణయించాడు. అందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేశాడు. లెనిన్‌ను విప్లవ కృషిని పసిగట్టిన రష్యా ప్రభుత్వం ఆయనను హత్య చేయడానికి ప్రణాళిక వేసింది. ఈ స్థితిలో లెనిన్‌ను జర్మనీకి పంపి కాపాడుకోవాలని పార్టీ నిర్ణయించడంతో ఐదు సంవత్సరాలు రహస్య జీవితం గడిపాడు. ఈ సమయంలోనే ‘ఇస్క్రా’ పత్రికను ప్రచురించి, కార్మిక పత్రికను ‘ఆందోళనకారుడుగా, గొప్ప ప్రచారకుడుగా, నిర్మాణ దక్షుడుగా’ తీర్చిదిద్దాడు.

1902లో ఆయన రాసిన ‘ఏం చేయాలి?’ పుస్తకంలో ”విప్లవ సిద్ధాంతం లేకుండా విప్లవ ఉద్యమం ఉండదు.. విప్లవ పార్టీ లేకుండా విప్లవాన్ని నడపడం సాధ్యం కాదని” లెనిన్‌ నిర్ధారించాడు. బూర్జువా సమాజంలో బూర్జువా భావజాలంగానీ, కార్మికవర్గ భావజాలంగానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటుందని మధ్యే మార్గం అనేది వుండజాలదని చెప్పాడు. తటస్థత ముసుగు వేసుకుని పాలక పార్టీల వంత పాడే కుహనా మేధావులను ఆయన ఆనాడే ఎండగట్టారు. విప్లవానికి వృత్తి విప్లవకారుల ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచ విప్లవోద్యమానికి మార్గదర్శిగా నిలిచాడు లెనిన్‌. పార్టీలో నిర్మాణ సూత్రాల విషయంలో వచ్చిన విబేధాలపై 1904లో ‘ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి’ పుస్తకంలో ”అధికారం కోసం చేసే పోరాటంలో కార్మిక వర్గానికి నిర్మాణం తప్ప మరొక ఆయుధం లేదు” అని నొక్కి చెప్పాడు. బూర్జువా ప్రజాతంత్ర విప్లవ ప్రాధాన్యతను వివరిస్తూ 1905లో ”ప్రజాతంత్ర విప్లవంలో సోషల్‌ డెమోక్రాట్ల రెండు ఎత్తుగడలు” అనే గ్రంథం రాశాడు. ఈ కృషి అంతా పోలీసులకు చిక్కకుండా, విదేశాలలో రహస్యంగా వుంటూ చేశాడని గుర్తించుకోవాలి. 1905లో బోల్షివిక్కులకు, మెన్షివిక్కులకు మధ్య భూ సమస్యపై జరుగుతున్న చర్చల పరిష్కారంగా ”వ్యవసాయిక సమస్య” అనే పుస్తకాన్ని రాశాడు.

లెనిన్‌పై ప్రభుత్వ నిఘా పెరగడంతో 1907లో మరోసారి రహస్య జీవితానికి వెళ్లాడు. ఈసారి ఆయన దాదాపు పదేళ్ళు అంటే విప్లవం వచ్చిన 1917 వరకు ప్రవాసంలో గడిపాడు. జాతుల ప్రత్యేకతల గురించి వాటికి విడిపోయే హక్కు గురించి ‘జాతుల సమస్య’ అనే పుస్తకంలో వివరించాడు. కార్మికవర్గ విప్లవ తక్షణ కర్తవ్యాలను ‘ఏప్రిల్‌ థీసిస్‌’లో వివరించాడు. సమస్త భూమిని జాతీయం చేయాలని ”సర్వాధికారాలు సోవియట్లకు” వుండాలని ప్రతిపాదించాడు. కమ్యూనిస్టుల మద్దతుతో ఏర్పడిన బూర్జువా తాత్కాలిక ప్రభుత్వం కార్మిక, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా లెనిన్‌ మీద, పార్టీ నాయకత్వం మీద పెద్ద ఎత్తున నిందా ప్రచారం చేయడమే కాక ఆయనను హత్య చేయాలని నిర్ణయించింది. ఈ సమయంలో పార్టీ ఆదేశంతో పెట్రోగ్రాడ్‌లోని ఓ కార్మికుడి ఇంట్లో గడ్డి కోసే కూలిగా మారు వేషంలో జీవించారు (నీలం నోట్‌బుక్‌ పుస్తకం). ఇక్కడే ప్రసిద్ధమైన ”రాజ్యం విప్లవం” గ్రంథాన్ని రచించి ‘అతి కొద్దిమందిగా వున్న పెట్టుబడిదారులు అత్యధిక మంది ప్రజలను అణచివేసే బూర్జువా నియంతృత్వ స్థానంలో అత్యధిక మంది కోసం అతి కొద్దిమందిని నియంత్రించే కార్మికవర్గ నియంతృత్వ వ్యవస్థ ఏర్పడాల”న్నాడు.

1917 అక్టోబర్‌లో కార్మికవర్గం చేసిన తిరుగుబాటుకు రైతుల, ప్రజల, సైనికుల మద్దతును పొంది విప్లవాన్ని జయప్రదం చేసి ప్రథమ సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించాడు. నూతన ప్రభుత్వ సారధిగా ఒకవైపు ప్రపంచ యుద్ధం, మరోవైపు దేశంలో ఆహార సంక్షోభ సమస్యలను ఎదుర్కొన్నాడు. నిర్దిష్ట పరిస్థితులను అంచనా వేసి దూరదృష్టితో జర్మనీతో శాంతి ఒప్పందం కోసం పార్టీ చేసిన నిర్ణయం ట్రాట్స్కీ ద్రోహం వల్ల విఫలమైంది. ఆ క్లిష్ట సమయంలో బాల్య దశలో వున్న సోషలిస్టు రాజ్య రక్షణ కోసం ఆయన ఎనలేని కృషి చేశాడు. స్త్రీలు, యువకుల భవిష్యత్‌ పట్ల లెనిన్‌ ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. ప్రతి వంటగత్తె రాజకీయవేత్త కావాలని వాంఛించాడు. కమ్యూనిస్టు సమాజ నిర్మాణానికి కమ్యూనిస్టు నీతి, విలువలే ఆధారాలని, వాటిని కాపాడుకోవాలని యువతకు ఉద్భోదించాడు. నూతన కార్మిక వ్యవస్థను సహించలేని సామ్రాజ్యవాదులు పార్టీ విద్రోహులతో కలిసి…లెనిన్‌ను, ఆయన అనుచరులను హత్య చేయడానికి చేసిన కుట్రలో భాగంగా 1918 ఆగస్టు 30న కస్లావ్‌ అనే మహిళ లెనిన్‌ను అతి సమీపం నుండి పిస్టల్‌తో కాల్చింది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. దేశం ద్రిగ్భాంతి చెందింది. చావుబతుకుల మధ్య పోరాడి లెనిన్‌ కోలుకున్నప్పటికీ 1923లో ఆయన ఆరోగ్యం క్షీణించి, 1924 జనవరి 21వ తేదీన లెనిన్‌ తుది శ్వాస విడిచి ప్రపంచ కార్మిక విముక్తి శ్వాసలో కలిశాడు.

(జనవరి 21 లెనిన్‌ శత వర్ధంతి ముగింపు సందర్భంగా)

– వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్‌

➡️