దేశ రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 27 సంవత్సరాలుగా అక్కడి అధికారానికి దూరంగా వుండిపోయిన బిజెపి అత్యధిక మెజార్టితో ప్రభుత్వంలోకి రాబోతున్నది. 1998 కి ముందు దీర్ఘకాలం పాటు బిజెపి పట్టులో వుండి 1998-2013 మధ్య కాంగ్రెస్ హ్యాట్రిక్‌లు చూసి ఆ పైన (శాసనసభ వరకూ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కంచుకోటగా కనిపించిన ఢిల్లీ ఆ పార్టీ చేజారిపోయింది. ఎలాగైనా ఉనికి కాపాడుకోవాలని పాకులాడిన కాంగ్రెస్ ఖాతానే తెరవలేకపోయింది. ఒక దశలో జాతీయ ప్రత్యామ్నాయంగా ప్రచారమై తర్వాత సిబిఐ, ఇడి కేసులలో వరుసగా సవాళ్లనెదుర్కొని పదవిని కూడా వదులుకున్న అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోయారు. ఆయన సన్నిహితులైన ముఖ్య నాయకులు కూడా ఓటమి చవిచూశారు. 2014, 2019 ఎన్నికలలో లోక్‌సభ స్థానాలు మొత్తం తెచ్చుకుని కూడా 2015, 2020 శాసనసభ ఎన్నికలలో బోల్తాపడిన బిజెపి ఈ సారి మాత్రం 2024 నాటి ఫలితాలనే కొనసాగించగలిగింది. లోక్‌సభలో స్వంతంగా మెజార్టి తెచ్చుకోలేక చతికిల పడిన ప్రధాని మోడీ నాయకత్వంలో ఢిల్లీని కైవసం చేసుకోవడంతో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చినట్టు హడావుడి చేస్తున్నారు. విడివిడిగా తలపడిన ఆప్ 43 శాతం పైన, కాంగ్రెస్ ఆరు శాతంపైన ఓట్లు తెచ్చుకుని కూడా తమలో తామే ఓట్లు చీల్చుకుని బిజెపి నెత్తిన పాలు పోశాయి.
మొండిపట్టుతో ఓటమి
శాసనసభ ఎన్నికల ప్రకటనకు ముందు నుంచి కాంగ్రెస్, ఆప్‌లు కలిస పోటీ చేస్తాయా లేదా అన్నదే కీలకాంశంగా చర్చ జరిగింది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఇటీవల హర్యానా శాసనసభ ఎన్నికల్లో ఆప్‌కు కనీస స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. తర్వాత మహారాష్ట్రలోనూ అంతే జరిగింది. తాను బలంగా వున్న చోట్ల ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోకుండా తను లేని చోట మాత్రం ఇతరులు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకోవడం ‘ఇండియా’ వేదికలో భాగస్వాములు ఆమోదించడం లేదు. ఢిల్లీ వరకైతే ఆప్, కాంగ్రెస్ రెండూ ఒంటరిగానే వెళతామని గతంలోనే ప్రకటించాయి. ఆప్ కూడా అదే కోరుకుంది. లిక్కర్ స్కాంలో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ బెయిలు మీద బయిటకు రాగానే తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఎందుకంటే అంతకు ముందు జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికల్లో ఆప్‌కు కనీస స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. తర్వాత మహారాష్ట్రలోనూ అంతే జరిగింది. ఫలితాలలో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత కూడా కాంగ్రెస్ కలసి పోటీ చేయకపోవడం నష్టం కలిగించిందని ఒప్పుకోవడం లేదు. పైగా ఇందుకు బాధ్యత తమది కాదన్నట్టే మాట్లాడుతున్నది. ఫలితాలు వస్తుండగానే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేస్తూ మీరు పోట్లాడుకుంటూ వుండండి. వారు గెలుస్తూ వుంటారని హెచ్చరించారు. నిజానికి కాశ్మీర్ ఎన్నికలలో కూడా నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఎంలతో కలసి పోటీ చేసిన కాంగ్రెస్ వ్యవహరించిన తీరు, సాధించిన ఫలితాలు ప్రతికూలంగా వున్నాయి. ఉత్తరాది చివర ఉమర్ ఆ విధంగా వ్యాఖ్యానిస్తే తెలంగాణలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా అదే తరహాలో రాహుల్ గాంధీ వల్లనే బిజెపి గెలవగలిగిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నిజానికి తెలంగాణలోనూ కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల పరస్పర పోటీలో బిజెపి లబ్ధి పొందుతున్నదని దేశమంతటికీ తెలుసు. ఇక నేరుగా ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందన చూస్తే తమ పాలనలో చేసిన పనులు చెప్పుకుని, విజయం సాధించిన బిజెపికి శుభాకాంక్షలు చెప్పడం తప్ప ఓటమిపై ఆత్మ విమర్శ, పరిశీలన కనిపించవు.
కేసులతో వేధింపులు
ఆప్ ఓటమికి దారి తీసిన తప్పిదాలు, పాలనలో పొరబాట్లు చాలా వున్నాయి. లిక్కర్ స్కాం వంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వడం కూడా సమర్థనీయం కాదు. లౌకికతత్వం కోసం పోరాడటంలోనూ. బిజెపి వ్యతిరేకులను కలుపుకొని పోవడంలోనూ ఆప్ పెద్ద ఆసక్తి చూపింది లేదు. వ్యక్తిగతంగా కేజ్రీవాల్ కూడా తనే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో మతపరమైన క్రతువులలోనూ పాల్గొని అత్యుత్సాహం ప్రదర్శించారు. రాజకీయ విధానాల పరంగా స్థిరత్వం లేకపోవడం నిజమే అయినా రాజ్యాంగ రీత్యా ఢిల్లీ ప్రత్యేక పరిస్థితిని ఆసరా చేసుకుని లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ వేధించిన తీరు మాత్రం సరి కాదు. ఆప్ నాయకత్వం కూడా ఒక దశలో మోడీ పట్ల మెతకదనం, కాశ్మీర్ 370 రద్దుకు మద్దతు వంటి పనులు చేసినా వీటన్నిటి తర్వాత కళ్లు తెరవక తప్పలేదు. ఇండియా వేదికలో భాగస్వామి కావడం వివిధ రాష్ట్రాలు సందర్శించి మద్దతు కోరడం అందులో భాగమే. కానీ ఢిల్లీకి వచ్చేసరికి కాంగ్రెస్, ఆప్ తీవ్ర ప్రత్యర్థులుగానే వ్యవహరించాయి. ఉభయ పార్టీలూ తమ దారిలో తాము నడిచాయి. అందువల్లనే ఈ పరాజయం అనివార్యమైంది. పొలిటికల్ స్టార్టప్‌లా కొన్ని ప్రయోగాలతో దేశాన్ని ఆకర్షించిన ఆప్ పదేళ్ల తర్వాత పరాజయం కొనితెచ్చుకుంది. కేసుల ఒత్తిడి కారణంగా కేజ్రీవాల్ వైదొలగి అతిషిని ముఖ్యమంత్రిని చేసినా ఆయనను మళ్లీ పదవిలో కూర్చోబెట్టడమే తన లక్ష్యమని ఆమె ప్రకటించారు. ఆయన కూర్చున్న కుర్చీలో కూర్చోబోనంటూ అతి వినయం ప్రదర్శించడం ఒక విధంగా తమిళనాడులో పన్నీర్ సెల్వన్ జయలలిత పట్ల వ్యవహరించిన తీరును గుర్తు చేసింది. ఎన్నికల్లో చివరకు ఆమె గెలవగా కేజ్రీవాల్ మాత్రం ఓడిపోయారు. అవినీతిపై పోరాటంలో ఒకప్పుడు ఆయనకు మార్గదర్శిగా వుండిన అన్నా హజారే వెంటనే రంగంలోకి వచ్చి ఏకపక్షంగా శాపనార్థాలు పెట్టడంలో సమతుల్యత లోపించింది. అంటే ఇతర రాజ్యాంగ ప్రజాస్వామిక కోణాలు ఆయన పట్టించుకోలేదని చెప్పాలి.
ద్వంద్వ ప్రమాణాలు
తమాషా ఏమంటే లిక్కర్ స్కాంతో సంబంధం వున్న మాగుంట శ్రీనివాసరెడ్డి టిడిపి ఎంపీగా ఎన్డీఎలోనే వున్నారు. ఢిల్లీలో మొదలైన ఈ స్కాంలోనే బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి, కెసిఆర్ కుమార్తె కవితను అరెస్టు చేసి చాలా కాలం జైలులో నిర్బంధించారు. ఆరోపణలను విచారించ వలసిందే గానీ తమతో వుంటే ఒకలా లేకపోతే మరోలా ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఎలా చెల్లుతుంది? ఢిల్లీ బిజెపి నాయకులు ముఖ్యమంత్రి అతిషితో సహా అనేక మంది నాయకులపై చవకబారు వ్యాఖ్యలతో వివాదాలు రగిలించారు. బంగ్లా శరణార్థులు రోహింగ్యాల రాకను ప్రధాన సమస్యగా మతపరమైన అంశాలను ముందుకు తెచ్చారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి ప్రచారం ఆపేయాలని నిబంధనలున్నా ప్రధాని మోడీ త్రివేణీ సంగమంలో మహాకుంభ స్నానం చేసి మతపరమైన సంకేతాలు పంపించారు. ప్రతిపక్షాల వాగ్దానాలను రేవడీ (తాయిలం)గా అపహాస్యం చేసే మోడీ స్వయంగా ఢిల్లీ వాసులకు ఆపద మొక్కుల్లాంటి వరాల వాన కురిపించారు. ఏకంగా మూడు ఎన్నికల ప్రణాళికలు ప్రకటిస్తూ కొత్త కొత్త వాగ్దానాలు గుప్పించారు. సరిగ్గా బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపు 12 లక్షలకు పెంచడం కూడా ఢిల్లీ ఎన్నికల కోణంలోనేనన్న అభిప్రాయం నెలకొన్నది. తాము వస్తే ఆప్ పథకాలను రద్దు చేస్తామన్నది ప్రచారం మాత్రమేనని అన్నీ యథాతథంగా కొనసాగిస్తామని ప్రచారం చేసింది. ఈ సామదానబేధ దండోపాయాలతో పాటు ప్రతిపక్షాల ఓట్ల చీలిక కూడా తోడై బిజెపి పెద్ద విజయమే సాధించగలిగింది.
ఢిల్లీ కీలక ప్రాధాన్యత
కేంద్రంలో తమ అధికారం సంపూర్ణంగా చలాయించడానికి ఢిల్లీ పగ్గాలు చేతిలో పట్టుకోవడం తప్పనిసరి అని బిజెపి భావన. అందుకే స్వయంగా మోడీనే ప్రచార బాధ్యత మీద వేసుకోవడంతో పాటు ఎనిమిది నెలలుగా ఇందుకు తీవ్ర కసరత్తు చేశారు. ఆప్‌ను ఇక సహించం, మార్పు సాధిస్తాం అన్న ఎన్నికల నినాదం ఎత్తుకున్నారు. ఈ మధ్యనే రైతుల ఆందోళన పట్ల ఎలా వ్యవహరించారో చూశాం. ఢిల్లీ రాజధాని కావడంతో అక్కడ నిరసనలు తెలిపే హక్కులకు కూడా ఇక ముప్పు వాటిల్లవచ్చు. పోలింగ్ ముగిశాక కూడా కేజ్రీవాల్, అతిషిలతో సహా పలువురు నాయకులపై కొత్త కేసులు నమోదు చేశారంటే వారి దాడి తీవ్రత తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఫలితాలు వస్తుండగానే సచివాలయం మూసివేయడంతో సహా మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ విజయం ప్రభావం ఎలా వుంటుందో, వివిధ రాజకీయ పార్టీలూ శక్తులూ ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇన్ని చేసినా ప్రతిపక్షాలకు దాదాపు యాభై శాతం ఓట్లు రావడం గమనిస్తే ప్రజలలో ప్రజాస్వామిక కాంక్ష ఎంత లోతుగా వేళ్లూనుకుని వుందో తెలుస్తుంది. ఈ ఫలితాలను, పరిణామాలను మరింత కూలంకషంగా అధ్యయనం చేసి తగు పాఠాలు తీసుకోవడం జరుగుతుందని ఆశించాలి.
దీంతోపాటే ఎన్నికల నిర్వహణపైనా ముందే సందేహాలు వ్యక్తమైనాయి. వాటిపైన కూడా సంతృప్తికరమైన సమాధానాలు రావలసే వుంటుంది. ఆప్ ముందే ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేస్తూ వచ్చింది. రాహుల్ గాంధీ కూడా లోక్‌సభ ప్రసంగంలోనే అభ్యంతరాలు లేవనెత్తారు. కనుక ఫలితాల తర్వాతా ఆ చర్చ కొనసాగవచ్చు. న్యాయపరమైన సాంకేతికమైన ప్రక్రియలు ఎలా వున్నా రాజకీయంగా నేర్చుకోవలసిన అంశాలు ఆచరణలో దిద్దుకోవలసిన పొరబాట్లపైనే దృష్టి పెట్టడం ఇక్కడ కీలకం.
తెలకపల్లి రవి