కార్పొరేట్‌ విజన్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం ఆవిష్కరించిన ‘స్వర్ణాంధ్ర విజన్‌-2047’ డాక్యుమెంట్‌ నయా-ఉదారవాద విధానాలు మరింత శీఘ్రగతి అమలుకు రోడ్‌ మ్యాప్‌. కార్పొరేట్ల అడ్డూఅదుపు లేని దోపిడీకి ఎర్ర తివాచీ. వికసిత భారత్‌ నిర్మాణం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ‘విజన్‌-2047’లో భాగంగా రాష్ట్రంలోనూ తీసుకొచ్చామని చంద్రబాబు, కూటమి నేతలు ప్రకటించారు. కేంద్రంలో బిజెపి ప్రతిపాదించిన విజన్‌లో అణువణువూ మతతత్వ-కార్పొరేట్‌ జమిలి విధానాల కలబోత కాగా అందులో భాగమే తమ ‘కల’ అంటున్నారు చంద్రబాబు. ప్రజలందరికీ సంపద, ఆరోగ్యం, సంతోషం అందించడమే లక్ష్యమని చెబుతున్నారు. పేదరికం లేని సమాజం, ఉపాధి- ఉద్యోగ కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, ఇత్యాది పది సూత్రాలు తమ విజన్‌కు ప్రాతిపదికగా పేర్కొన్నారు. 2047 నాటికి అందరికీ అక్షరాస్యత, 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 42 వేల డాలర్ల తలసరి ఆదాయం, 60 శాతానికి పట్టణ జనాభా, రెండు శాతానికి నిరుద్యోగిత రేటు తగ్గింపు, 85 సంవత్సరాల సగటు ఆయు ప్రమాణం, 450 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు లక్ష్యాలుగా ప్రకటించారు. ఈ ‘కలలు’ ఆకర్షణీయంగానే కనిపిస్తున్నప్పటికీ వాటి సాధనకు ఎంచుకున్న విధానాలే సదరు కలలను కల్లలు చేస్తాయి.

రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పి-4 విధానాన్ని తారకమంత్రంగా జపిస్తోంది. ఇప్పటి వరకు మూడు ‘పి’ లు… పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పిపిపి) వాడుకలో ఉంది. కొత్తగా పీపుల్‌, పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పిపిపిపి)… నాలుగు ‘పి’ ల ఫార్మూలా తెర మీదికి తెచ్చారు. అందులో భాగంగానే విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల వేదికపై నుంచి ఎక్కడ పరిశ్రమ వస్తే అక్కడి రైతులు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చినట్లున్నారు. దానర్ధం కార్పొరేట్లు పరిశ్రమలు, ప్రాజెక్టులు పెడతారు. అందుకు కావాల్సిన భూములను రైతులు త్యజించాలన్నమాట. రైతుల భూములను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్ర పి-4 సిద్ధాంతం వెనుక దాగుంది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ అంది. అడవులను, నదులను, సముద్రాలను, చివరికి జాతీయ రహదారుల, రైల్వే ట్రాక్‌ల వెంబడి భూములను సైతం కార్పొరేట్లకు అప్పగిస్తోంది. చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్‌ అందుకు భిన్నమైంది కాదు. ఆర్థిక హబ్‌లు, హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌, రెండు మెగా పోర్టులు, రీసైక్లింగ్‌ క్లస్టర్‌, నౌకా నిర్మాణం, టూరిజం ప్రాజెక్టులు, ఎ.ఐ, డ్రోన్లు.. ఇవన్నీ ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రాపకం కోసమే. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెన్‌ కాస్తా స్పీడ్‌ ఆఫ్‌ బిజినెస్‌గా మారిందీ అందుకే. ఇప్పటికే జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్‌గా మార్చింది. పోర్టులు, విద్యుత్‌, సకలం అదానీకి సమర్పించారు. జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్న కూటమి తాను కూడా అదే బాటలో పయనిస్తోందనడానికి సెకితో సౌర విద్యుత్‌ ఒప్పందం కొనసాగింపే ఉదాహరణ.

చంద్రబాబు విజన్లు కొత్తవేమీ కావు. 1999 ప్రాంతంలో బ్రిటీష్‌ మెకెన్సీ కన్సల్టెన్సీ రూపొందించిన ‘విజన్‌ 2020’తో ఊదరగొట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ‘విజన్‌ 2029’ అన్నారు. ఇప్పుడేమో ఏకంగా రాబోయే 23 ఏళ్లకు ‘విజన్‌-2047’ అంటున్నారు. విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా విజన్లు అనడం ప్రజలను మభ్యపెట్టడానికే. వ్యవసాయ రాష్ట్రమైన ఎ.పి.లో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతుల, కౌలు రైతుల, వ్యవసాయ కార్మికుల బతుకులు ఆందోళనకరంగా తయారయ్యాయి. వారి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర రైతుల్లో 93 శాతం మంది రుణగ్రస్తులు. సగటు అప్పు రూ.2.45 లక్షలు. ఈ రెండు అంశాల్లో దేశంలో మనమే టాప్‌. తలసరి ఆదాయంలో 15వ స్థానంలో ఉన్నాం. నిరుద్యోగం, విద్య, వైద్యం, మహిళా, శిశు మరణాలు, వారి సంక్షేమం, ఈ రంగాలన్నీ కునారిల్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం రహదార్లు మట్టి రోడ్లు. గుంతలు లేని తారురోడ్లను లక్ష్యంగా ఎంచుకున్న దుస్థితి. విజన్‌ అనేది నేల విడిచి సాము చేయకూడదు. విస్తృత స్థాయి చర్చలతో రూపొందాలి. ప్రజల మధ్య అసమానతలు రూపుమాపేది అసలైన దార్శనికత.

➡️