ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయుల స్థానాల్లో ఖాళీలను భర్తీ చేయడం కోసం ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు- ఒక్క తెలుగుదేశం కూటమి మినహా-అన్నీ ప్రత్యక్ష పాత్ర పోషించకుండా దూరంగా ఉన్నాయి. పాలక కూటమి, అందునా తెలుగుదేశం మాత్రం చాలా పట్టుదలగా, పంతంతో ఈ ఎన్నికలు అధికారం కోసం జరిగే సాధారణ ఎన్నికలైనట్టు వ్యవహరించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తక్కిన ముఖ్య నేతలు ఈ ఎన్నికలలో గెలుపు తమ ప్రభుత్వ మనుగడకు చాలా కీలకం అయినట్టుగా వ్యవహరించారు. శాసనమండలి ఎన్నికలలో రాజకీయ పార్టీల జోక్యం ఉండరాదన్న నియమం ఏదీ లేదు. అయితే ఈ ఎన్నికలు అధికారంలో ఏ పార్టీ ఉండాలన్నది నిర్ణయించగల ఎన్నికలు కావు. అందునా, ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలు చెరో అయిదూ ఉన్నాయి. వాటి ఓటర్లు ప్రభుత్వం నడుస్తున్న తీరు మీద ఈ ఎన్నికలలో తీర్పునేమీ ఇవ్వరు. తమ తమ ప్రత్యేక సమస్యలను, ఆకాంక్షలను శాసనమండలిలో వ్యక్తం చేయగల ప్రతినిధిని ఎన్నుకోడానికే ప్రాధాన్యతనిస్తారు. శాసనమండలిలో పాలక పార్టీకి మెజారిటీ ఉన్నా, లేకున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఢోకా ఏమీ లేదు. నిజానికి శాసనమండలిలో సభ్యులు గత 18 సంవత్సరాలుగా అనేక విలువైన సూచనలను, విమర్శలను, సలహాలను ప్రభుత్వానికి ఇస్తూనే వున్నారు. అయితే, గతంలోని ప్రభుత్వాలు గాని, ప్రస్తుత ప్రభుత్వం గాని పెద్దల సభకు తగిన విలువనిచ్చి ఆ సూచనలను గౌరవించి అమలు చేయడానికి పూనుకున్నది లేదు.
తాజా ఎన్నికలలో తెలుగుదేశం మూడు స్థానాలకూ అభ్యర్ధులను ప్రకటించింది. వాటిలో రెండింటిలో పాలక పార్టీ అభ్యర్ధులే గెలిచారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో మాత్రం టిడిపి బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. కాని దానివలన టిడిపి కి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా అక్కడ గెలిచిన అభ్యర్థి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టిడిపి కండువా కప్పుకుని చంద్రబాబు ఆశ్రయాన్ని పొందారు.
ఎన్నికల ఫలితాల మీద స్పందిస్తూ చంద్రబాబు ఈ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.సి.పి కుట్రలు, ఎత్తుగడలు ఎక్కడా పని చేయలేదని, ఆ పార్టీకి విద్యావంతులు మరొకసారి గుణపాఠం చెప్పారని చేసిన ప్రకటన చాలా విచిత్రంగాను, విడ్డూరంగాను ఉంది. ఎన్నికల చివరి రోజుల్లో గాని, ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా గాని, మీడియా అంతా ఈ ఎన్నికలు పాలక కూటమికి, పిడిఎఫ్ కి మధ్య ప్రధాన పోటీగా జరిగిందని చెప్తూ వచ్చాయి. ఎన్నికలలో వచ్చిన ఓట్లు చూసుకున్నా పోటీ పాలక కూటమికి, పిడిఎఫ్ కి మధ్యే ప్రధానంగా జరిగిందని ధృవపడింది. అసలు వై.ఎస్.ఆర్.సి.పి ఈ ఎన్నికల సీన్‌లో లేనే లేదు. ఎక్కడన్నా ఆ పార్టీ నాయకులు పాలక కూటమికి వ్యతిరేకంగా వ్యవహరించి వుండొచ్చు. కాని ఆ విధంగా ఇతర పార్టీల నాయకులు కూడా వ్యవహరించారు. అటువంటప్పుడు చంద్రబాబు అసలు పోటీలోనే లేని వై.ఎస్.ఆర్.సి.పి ని ఎందుకు ప్రధానంగా టార్గెట్ చేశారు?
ఈ ఎన్నికలు రెండు పరస్పరం భిన్నమైన విధానాల మధ్య జరిగాయి. కార్పొరేట్-అనుకూల విధానాలు, ధన బలం, కుల రాజకీయాలు, అధికార దుర్వినియోగం, అంతర్లీనంగా మత విద్వేష రాజకీయాల ప్రచారం-ఇవన్నీ పాలక కూటమి వైపు నుండి కనిపించాయి. అందుకు పూర్తి భిన్నంగా, ప్రభుత్వ విద్యా, వైద్య వ్యవస్థల పరిరక్షణ, ఆ వ్యవస్థలలో పని చేస్తున్న సిబ్బంది ప్రయోజనాల పరిరక్షణ, కార్పొరేట్ దోపిడీకి రాష్ట్రం ఏ విధంగా బలి అవుతోందో ఓటర్లకు తెలియజెప్పడం పిడిఎఫ్ వైపు నుండి కనిపించాయి. బలాబలాలు పాలక కూటమికే పూర్తి అనుకూలంగా ఉన్నాయని వేరే చెప్పనక్కరలేదు. కాని, అన్ని ప్రతికూలతలను తట్టుకుని పిడిఎఫ్ అభ్యర్ధులు చాలా గణనీయమైన స్థాయిలో ఓట్లు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన జిల్లాల్లో విద్యావంతులు కొందరైనా, విధానాల ప్రాతిపదికన ఆలోచించి ఓటు చేశారు. అలా స్పందించిన విద్యావంతుల సంఖ్య గణనీయంగా, లక్షకు పైగా ఉంది. ఎన్నికలు జరగని జిల్లాల్లోని విద్యావంతులు కూడా ఇదే కోవలో ఆలోచిస్తున్నారని కచ్చితంగా చెప్పవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం చాలా వేగంగా అమలు చేస్తున్న కార్పొరేట్-అనుకూల విధానాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ, వాటి ఔచిత్యాన్ని ప్రశ్నించే ధోరణి విద్యావంతులలో వ్యక్తమైంది. ఇంకా కూటమి పాలన ఏడాది కూడా పూర్తి చేసుకోకుండానే ఈ వ్యతిరేకత తలెత్తడం ఇక్కడ ప్రధానాంశం. ఇదే టిడిపి కలవరానికి కారణం. అయితే, ఎన్నికల ఫలితాల నుండి నేర్చుకునే బదులు, ఆ ఫలితాల ప్రాధాన్యతనే కప్పిపుచ్చడానికి, మసిపూసి మారేడుకాయ చేయడానికి వారు పూనుకున్నారు.
జగన్‌కు తిరుగు లేదని అనుకుంటున్న రోజుల్లో ఇదే విద్యావంతులు, ఉపాధ్యాయులు విద్యా రంగ సమస్యల మీద అన్ని నిర్బంధాలనూ తోసిరాజని విజయవాడలో లక్షలాదిగా గొంతెత్తి గర్జించారు. దాని ప్రాధాన్యతను అప్పుడు జగన్ గుర్తించలేదు. చంద్రబాబు సైతం ఆనాడు ఆ ఉద్యమానికి మద్దతు పలకలేదు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌కు చంద్రబాబు, జగన్ ఇద్దరూ వ్యతిరేకులే. ఇక ఆ విధానాన్ని తెచ్చిందే బిజెపి. అందుచేత రాష్ట్రంలో విద్యావంతులందరూ ఎలుగెత్తి ఘోషించినా, వినిపించనట్టు ఈ ముగ్గురూ నటించారు. అధికారంలో ఆనాడు జగన్ ఉన్నారు కనుక విద్యావంతులలో వ్యక్తమైన వ్యతిరేకత 2024 ఎన్నికలలో టిడిపి కూటమికి బాగా లాభించింది. ఆ సంగతి చంద్రబాబుకూ తెలుసు. అయితే విద్యావంతులు తన పాలనలో నోరెత్తకుండా ఉండాలని, ఒకవేళ నోరెత్తినా, తనకు అనుకూలంగా మాత్రమే నోళ్ళు విప్పాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ పిడిఎఫ్ అభ్యర్ధులు గెలిస్తే, అలా గెలిచినవారు ఒక్కరున్నా… శాసనమండలిలో తన విధానాల అడ్డగోలుతనాన్ని గట్టిగా ప్రశ్నిస్తారని, కార్పొరేట్ దోపడీకి రాచబాట వేసే తన విధానాల అమలులో అడుగడుగునా అడ్డం తగులుతారని చంద్రబాబుకు తెలుసు. అందుకే పిడిఎఫ్ ఎట్టి పరిస్థితులలోనూ గెలవకూడదని సర్వశక్తులనూ ఒడ్డారు.
గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు విషయంలో జగన్ ఆటలను ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడింది పిడిఎఫ్ కూటమేనని చంద్రబాబుకు బాగా తెలుసు. శాసనమండలిలో ఆ బిల్లు ఆమోదం పొందలేదు కనుకనే హైకోర్టులో టిడిపి వేసిన కేసులో అనుకూల తీర్పు వచ్చింది. అది 2024 ఎన్నికల్లో టిడిపికి బాగా ఉపయోగపడింది. జగన్ పాలన పట్ల ప్రజల్లో అంతర్లీనంగా ఉండిన వ్యతిరేకతకు స్పష్టమైన రూపం ఇవ్వడానికి పిడిఎఫ్ శాసనమండలిలోను, ఆ పిడిఎఫ్ వెనుకనున్న వివిధ సంఘాలు ప్రజాక్షేత్రంలోను సాగించిన పోరాటాలే కీలక పాత్ర పోషించాయి. ఆ కాలంలో టిడిపి ప్రజా సమస్యలమీద చేసిన పోరాటం అంటూ ఏదీ లేదు. అయినా, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పొందిక ప్రధానంగా రెండు పార్టీల మధ్య చీలిపోయి వుండడం వలన టిడిపికి లాభం చేకూరింది. పిడిఎఫ్ పోషించిన పాత్ర వలన ప్రత్యక్షంగా లాభం పొందినప్పటికీ, పరోక్షంగానైనా ఆ వాస్తవాన్ని ఒప్పుకోడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. నిజాన్ని ఒప్పుకోడానికి నైతిక స్థైర్యం కావాలి కదా!
ఇప్పుడు పిడిఎఫ్ గనుక గెలిస్తే, రాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఉద్యమాలకు, పోరాటాలకు బలం అదనంగా తోడవుతుంది. తన విధానాలను ప్రశ్నించేవారు పెరుగుతారు. తన కార్పొరేట్ ఎజండా అమలు ఇరుకున పడుతుంది. అయితే తమ పార్టీ దాడిని పిడిఎఫ్ మీద నేరుగా ఎక్కుపెడితే పిడిఎఫ్ తమ రోజువారీ పాలనలో ప్రధాన సవాలుగా తయారౌతోందని చంద్రబాబు అంగీకరించినట్టవుతుంది. పైగా వైసిపితో పోల్చుకుని తన పార్టీ గొప్పలు ఉన్నవీ, లేనివీ చెప్పుకోడానికి సాధ్యపడుతుంది కాని, పిడిఎఫ్ తో పోల్చి తమ విశిష్టత చెప్పుకోడానికి ఏముంది? గతంలో కాని, ఇప్పడు కాని చంద్రబాబు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు చేసిందేమిటో చెప్పుకునేది ఏమిటి? ఉన్న హక్కులను కాలరాయడం, చట్టాలను ఉల్లంఘించడం తప్ప ఏం చేశారు? విద్యా, వైద్య రంగాలలో ప్రైవేటీకరణ తప్ప ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం ఎప్పుడు చేశారు? తమ పాలక కూటమికి పిడిఎఫ్ ఒక ప్రత్యర్ధి అని అంగీకరిస్తే అప్పుడు చంద్రబాబు పిడిఎఫ్ లేవనెత్తే ప్రశ్నలకు స్పందించి సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. చెప్పుకోడానికి పాలక కూటమి వద్ద ఏమీ లేదు. విద్యా రంగాన్ని ప్రైవేటీకరించే విధానాలకు స్వస్తి చెప్తామని గాని, కనీసం పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ అమలు చేస్తామని కాని చెప్పగలరా? ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం చేసిన డిఎస్‌సి నియామకాల ఫైలు ఏడాది గడిచాక కూడా ఇంకా ముందుకు ఎందుకు కదలలేదో చెప్పగలరా?
ఇటువంటి విధాన పరమైన విషయాలను వేటినీ వై.ఎస్.ఆర్.సి.పి లేవనెత్తదు. ఎందుకంటే ఆ పార్టీవీ ఇవే విధానాలు, ఇద్దరూ పోటీ పడుతున్నది ప్రజల సేవ విషయంలో కాదు, కార్పొరేట్లకు సేవ చేయడంలో పోటీ పడుతున్నారు. కేంద్రంలోని విద్వేషపూరిత రాజకీయాలకు, మోదానీ దోపిడీకి అండదండలిస్తున్నారు. ఈ ఇద్దర్లో ఎవరు గెలిచినా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వానికి ఢోకా లేదు. కాని ప్రజల తరఫున అడుగుతున్నది, పోరాడుతున్నది వామపక్ష పార్టీలు. ఆ పార్టీలకు శాసన సభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో అసెంబ్లీ కార్పొరేట్ భజనమండలిగా మారిపోయింది. శాసనమండలిలో పిడిఎఫ్ కూడా లేకపోతే అక్కడ కూడా ఇదే భజన చేసుకోవచ్చు. వై.ఎస్.ఆర్.సి.పి కి కూడా ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయం ఉందనుకోలేం.
ఎన్నికలలో తమ అభ్యర్ధి ఒక స్థానంలో ఓడిపోవడం టిడిపి పాలక కూటమికి మింగుడు పడే విషయం కాదు. అక్కడ గెలిచిన వ్యక్తి మళ్ళీ తమ పంచనే చేరినా దానికి ఏ ప్రాధాన్యతా లేదని కూడా చంద్రబాబుకు తెలుసు. తమ ప్రజా వ్యతిరేక విధానాల లోతుపాతులను ఈ ఎన్నికలు వెలుగులోకి తెచ్చాయని, విద్యావంతులు ఆలోచించడం ప్రారంభించారని కూడా తెలుసు. ఈ ఆలోచనలు ముందుకు సాగితే ఇబ్బంది పడవలసి వస్తుంది కనుక, ఎన్నికల సీన్‌లో ఎక్కడా లేని వై.ఎస్.ఆర్.సి.పి మీద విరుచుకు పడ్డారు. ఇప్పుడు రేగిన విధానపరమైన చర్చను విధాన రహితంగా మార్చాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరించారు.
ఆలోచనలను రేకెత్తించే విధంగా. ప్రశ్నించేందుకు సమాయత్తం అయ్యే విధంగా, ఉద్యమ స్ఫూర్తిని మరింత ఎక్కువగా ప్రజ్వలింపజేసే విధంగా పిడిఎఫ్ సాగించిన ప్రచారం రాష్ట్రంలోని విద్యావంతుల మెదళ్ళలో కొన్ని భావాల విత్తుల్ని నాటింది. ధన బలం, మీడియా బలం, అధికార బలం వంటివి ఏవీ లేకపోయినా సూటిగా, నేరుగా ఓటర్ల గుండెల్ని తాకేలా ప్రచారం చేయగలిగింది. ఓటర్ల నుండి సానుకూలంగా వచ్చిన స్పందన కూడా గణనీయంగా ఉంది. అందుకే ఇది పిడిఎఫ్‌కు, దానిని బలపరచిన వివిధ సంఘాలకు, వ్యక్తులకు నైతిక విజయం. చంద్రబాబు గుబులు కూడా అందుకే.
ఎం.వి.ఎస్. శర్మ