తుపాను పాఠాలు

crop damage due to cyclone in ap editorial

రాష్ట్ర ప్రజలను భయోత్పాతంలో ముంచెత్తిన మిచౌంగ్‌ తుపాను తీరం తాకి బలహీనపడినా మూడు రోజుల పాటు కోస్తా జిల్లాలతో పాటు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగించింది. ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంది. అయినప్పటికీ, కొందరు మృత్యువాత పడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే, బుధవారం నాటికి కూడా అధికారిక సమాచారంలో ఈ మరణాలు చోటుచేసుకోకపోవడం బాధాకరం. ప్రాణనష్టం అంతగా లేకపోవడం కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ, భారీగా జరిగిన పంట నష్టం, ఆస్తి నష్టం కలిచివేస్తున్నాయి. కోతకొచ్చి పంట నీట మునిగిన దృశ్యాలు కోస్తా జిల్లాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.బాపట్ల వద్ద మంగళవారం తీరం దాటే క్రమంలో గంటకు 100 నుండి 120 కి.మీ వేగంతో వీచిన ప్రచండ గాలులతో అనేక చోట్ల చెట్లు, విద్యుత్‌ స్థంబాలు నేలకూలాయి. గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి. ఈ లెక్కలన్నీ తేలితే కానీ, వాస్తవంగా జరిగిన నష్టం ఎంతన్నది స్పష్టం కాదు.

లక్షలాది ఎకరాల వరిపంట నీట మునిగింది. కొన్ని చోట్ల కోసి పొలాల్లో వేసిన ఓదేలు నీళ్లలో తేలుతూ కనపడుతున్నాయి. కళ్లాల్లో పోసిన ధాన్యం కూడా తడిసిముద్దయింది. తుపాన్‌ తీరం దాటిన బాపట్ల జిల్లాలోనే దాదాపు 2 లక్షల ఎకరాల దాకా వరిపంట నీటమునిగినట్టు ప్రాధమిక సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా కొంచెం అటుఇటుగా ఆ స్థాయిలోనే నష్టం జరిగినట్టు చెబుతున్నారు. నెల్లూరు,తిరుపతి జిల్లాలతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా కూడా వరిపంట నీట మునిగింది. వేల రూపాయల పెట్టబడితో పాటు, ఆరుగాలం పడ్డ కష్టం నీళ్ల పాలు కావడం రైతాంగం గుండెలు బాదుకుంటోంది. మిర్చి, పొగాకు, వేరుశనగ, పసుపు తదితర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నానా కష్టాలు పడి పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బొప్పాయి, అరటి వంటి పండ్ల తోటలు సాగుచేసిన వారి దుస్థితి కూడా ఇంతే!

కొన్ని చోట్ల సహాయశిబిరాల్లో భోజన ఏర్పాట్లు కూడా లేవంటూ వార్తలు రావడం బాధాకరం. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలి. ప్రకృతి విపత్తు కారణంగా సర్వస్వాన్ని కోల్పోయిన బాధితులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా నిలవాలి. నష్టాలకు సంబంధించిన ఎన్యూమరేషన్‌ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈ లోగా బాధితులకు తక్షణ సాయం అందించాలి. రైతుల వద్ద ధాన్యం ఏ స్థితిలో ఉన్నా భేషరతుగా కొనుగోలు చేయాలి. తేమశాతం ఎక్కువగా ఉందనో, ఇతర నాణ్యత ప్రమాణాల పేరు చెప్పో మీనమేషాలు లెక్కించకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. లెక్కలు తేలిన తరువాత పూర్తిస్థాయి పరిహారం అందచేయాలి. హుదూద్‌ తుపాన్‌ సందర్భంగా ప్రకటించిన సాయం కూడాకూడా అరకొరగానే అందిందంటే రాష్ట్రం పట్ట కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికైనా కేంద్రం ఈ వైఖరి వీడాలి. లేని పక్షంలో ప్రతిపక్షాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడాలి.

మన రాష్ట్రానికి తుపాన్లు కొత్త కాదు. ప్రతి సంవత్సరం దాదాపుగా ఈ విపత్తుల బారిన పడుతూనే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 1970 నుండి ఇప్పటి వరకు దాదాపు 60కి పైగా తుపాన్లు రాష్ట్రంపై ప్రభావం చూపాయి. వీటిలో తీవ్ర, అతితీవ్ర తుపాన్లు 35కు పైనే ఉన్నాయి. ఏడు తీవ్ర, అతి తీవ్ర తుపాన్లు రాష్ట్రంలోనే తీరం దాటాయి. తీర ప్రాంత జిల్లాల్లో దాదాపుగా 3.50కోట్ల జనాభా రాష్ట్రంలో నివసిస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో ప్రకృతి వైపరీత్యాల ముప్పు మరింతగా పెరగనుంది. కోస్తా జిల్లాలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి డెల్టాలో తొందరగా ఖరీఫ్‌ వరినాట్లు వేసేలా నీటియాజమాన్య చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఇందులో రాజకీయ ప్రయోజనాలు, లేదా వ్యక్తిగత ప్రతిష్టలకు పోవడం గాకుండా రైతు ప్రయాజనాలను పరమావధిగా ప్రభుత్వం భావించాలి. తాత్కాలిక చర్యలతో పాటు, మడ అడవులను కాపాడటం, పెంచడం వంటి దీర్ఘకాల చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ శాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలి.

➡️