వంచన తగునా?

కార్పొరేట్లకు ప్రజాసంపద కట్టబెట్టడమే అభివృద్ధిగా ప్రచారం చేసుకోవడం మినహా, ప్రజల మనోభావాలకు ఏమాత్రం విలువనివ్వని ప్రధాని మోడీ తీరు మరోసారి బట్టబయలైంది. విశాఖలో ఆర్భాటంగా రోడ్‌షో, భారీ బహిరంగ సభ నిర్వహించి… మాటమాత్రంగానైనా విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ప్రస్తావించకుండా వెనుదిరగడం దారుణం. ఆంధ్రుల హక్కుగా, ప్రజా ఉద్యమ ఫలంగా సాకారమైన విశాఖ ఉక్కు గొంతు నులిమేందుకు గత పదేళ్ల నుంచి మోడీ సర్కారు చేయని ప్రయత్నమే లేదు! 32 మంది ప్రాణత్యాగంతో పురుడుపోసుకుని… తూర్పుతీరాన ఉన్న అతిపెద్ద ప్రభుత్వరంగ పరిశ్రమగా విశాఖ అభివృద్ధిలో సమున్నత పాత్ర పోషిస్తున్న ఈ సంస్థకు సొంత గనులివ్వకపోగా, ప్లాంట్‌లోని విభాగాలన్నింటినీ నిర్వీర్యం చేస్తుండటం, దశలవారీగా కార్మికులను తొలగిస్తుండటం, సిబ్బందికి సక్రమంగా వేతనాల్వికపోవడం కేంద్రం విద్రోహ చర్యే! భారీసభలో ప్రధాని నోరుమెదపకపోవడం, ఆయన ముందు సిఎం, డిప్యూటీ సిఎం పల్లెత్తు మాట్లాడకపోవడం నమ్మి గెలిపించిన ప్రజలను వంచించడమే.
20 మిలియన్‌ టన్నుల ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఉండి, 22 వేల ఎకరాలకుపైగా భూమి ఉన్న విశాఖ ఉక్కు భవితను చిదిమేసేందుకు సిద్ధమైన ఎన్‌డిఎ సర్కారును ఏమనాలి? ప్రధానిని గ్లోబల్‌ లీడర్‌ అంటూ కీర్తించిన చంద్రబాబు… ప్రైవేటురంగంలో నక్కపల్లిలో కొత్తగా ఆర్సిలార్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కోసం చేసిన వినతులను, ప్రధాని ఆమోదాలనూ గొప్పగా చెప్పుకున్నారే! దానికి ఎటువంటి మౌలిక వసతులు లేని విషయం గుర్తులేదా? మిట్టల్‌ కోసం పైపులైన్‌ ద్వారా ఐరన్‌ ఓర్‌ సరఫరా చేయాలని కోరగా, ప్రధాని సరేనన్నారని, ‘ఇంతకంటే… విశాఖ ప్రజలకు ఏం కావాలి?’ అని సభా ముఖంగా ముఖ్యమంత్రి ప్రశ్నించడం ఎంతవరకు సబబు? మిట్టల్‌ పరిశ్రమ విశాఖ ఉక్కును బలిగోరుతుందని, ఆ ఐరన్‌ఓర్‌ ఈ ప్రభుత్వరంగ సంస్థకు రావాల్సిందేనని, దీని పరిరక్షణకు నాలుగేళ్లకుపైగా సాగుతున్న ఉద్యమం, ప్రజల మనోభావాలు తెలియనట్టు ప్రధాని, సిఎం వ్యవహరించడం తగునా? నాలుగు నెలలుగా జీతాల్లేక 12 వేల మంది పర్మినెంట్‌ కార్మికుల కుటుంబాలు విలవిల్లాడుతున్నా కూటమికి పట్టదెందుకు? ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి అన్నింటా శఠగోపం పెట్టి, ఉక్కును కార్పొరేట్లకు పందేరం చేస్తున్న ప్రధాని మోడీ పట్ల ఎక్కడ లేని విధేయత చూపుతూ… అఖండ మెజారిటీతో అసెంబ్లీ, పార్లమెంట్లకు పంపిన విశాఖ వాసుల పట్ల చూపే కృతజ్ఞత ఇదేనా? రెండేళ్ల క్రితం ప్రధాని సభలో విశాఖ ఉక్కు అంశాన్ని ప్రస్తావించలేదంటూ అప్పటి సిఎం జగన్‌ పార్టీని దుమ్మెత్తిపోసిన కూటమి ఇప్పుడు అందుకు భిన్నంగా చేసిందేమిటి? అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల్లో ఒక్కసారైనా కేబినెట్‌లో ఈ అంశాన్ని చర్చించారా? నక్కపల్లి వద్ద మిట్టల్‌ కంపెనీకి ఎంత రాయితీలు, భూమి, విద్యుత్‌ ఇవ్వాలి? పోర్టు లింకేమిటి? అన్న విషయాలు రెండుసార్లు చర్చించినా… ఒక్కసారి కూడా ఎందుకు విశాఖ ప్లాంట్‌ గురించి చర్చించలేదని నిలదీయడానికి… ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న జనసేన అధినేత నోరుమెదపరెందుకు? విభజన హామీల్లో ఇచ్చినట్లు, గత ప్రభుత్వం చెప్పినట్లు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మిట్టల్‌ పరిశ్రమను అక్కడే ఏర్పాటు చేస్తే ప్రాంతీయ అసమానతలకు కూడా నిలువరించవచ్చు కదా? విశాఖ ఉక్కుతో పాటు, రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల విషయాల ప్రస్తావన లేదెందుకు? గత పాలకుడి పాపాలన్నీ సరిదిద్దుతున్నామని చెప్పుకుంటున్న కూటమి పెద్దలు గంగవరం పోర్టులో 16 శాతంగా ఉన్న రాష్ట్రప్రభుత్వ వాటాను వదిలేసుకోవడం గురించి ఎందుకు మాట్లాడరు? 2033 నాటికి చట్టప్రకారం రాష్ట్రప్రభుత్వానికి స్వాధీనం కావాల్సిన ఆ పోర్టును కుంభకోణాలతో అలరారుతున్న అదానీకి వైఎస్‌ఆర్‌సిపి సర్కారు వదిలేసుకోవడం వల్ల విశాఖ ఉక్కుకు ఏర్పడిన ముప్పు అర్థం కావడం లేదా? గంగవరం పోర్టును అనుసంధానించడంతోపాటు కేటాయించిన భూములు, వాటాలు వెనక్కి తీసుకుని విశాఖ ఉక్కుకు కేటాయించాలి. ‘జీ హుజూర్‌’ అనడం మాని… వ్యూహాత్మక విక్రయాలపై, ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గేలా మెడలు వంచాలి. పరిశ్రమ ఉసురుతీసే ఎత్తుగడలు మాని, ఊపిరిపోసే విధానం తీసుకోవాలి. మిట్టల్‌ స్టీల్‌ను రాయలసీమకు తరలించాలి. లేకుంటే ప్రజాగ్రహం తప్పదు.

➡️