తెలివి ఒకడబ్బ సొమ్ము కాదు, పశ్చిమ దేశాల, తెల్ల తోళ్ల గుత్త అసలే కాదు. రక్షణాత్మక చర్యలతో తన ప్రత్యర్థులను అణచివేయాలని ఎవరైనా ఎంతగా ప్రయత్నిస్తే అంతగా ప్రతిఘటనే కాదు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కూడా సవాలు విసురుతాయని గతంలో అణుబాంబులు, ఖండాంతర క్షిపణుల వరకు నిరూపించాయి. తాజాగా చైనా డీప్ సీక్ కృత్రిమ మేథ యాప్ పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రత్యేకించి అమెరికా వెన్నులో దడ పుట్టిస్తోంది. అమెరికా, దాని అనుంగు దేశాల్లో ప్రభుత్వ శాఖలు, భారీ సంఖ్యలో కంపెనీలు ఆ యాప్‌ను తమ ఫోన్లు, కంప్యూటర్లలో పెట్టుకోవద్దని, దాని సేవలను వినియోగించవద్దని ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. చైనా సాంకేతికంగా ముందుకు పోకుండా అడ్డుకొనే క్రమంలో జో బైడెన్ 2022లో తెచ్చిన చిప్స్ చట్టం ప్రకారం డ్రాగన్ దేశానికి ఎలాంటి పరిజ్ఞానం, చిప్స్‌ను అందనివ్వకూడదు. ఒక వేళ ఇతర దేశాలు ముందుకు పోతే వాటి మీద కూడా ఆంక్షలు విధిస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడవి దానికే ఎదురు తన్నుతున్నాయి. రక్షణాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా అదే జరుగుతుంది. తగిన ప్రోత్సాహం, అవకాశాలను కల్పించాలేగానీ ఎవరైనా అద్భుతాలు సృష్టించగలరని ప్రత్యేకించి చైనా ఇప్పటికే నిరూపించింది.
ఈ రంగంలో చైనా కంపెనీ విడుదల చేసిన డీప్ సీక్-ఆర్‌ఐ యాప్ పెను సంచలనం సృష్టించటమే కాదు, అమెరికా కంపెనీల వాటాల ధరలు పతనమై దాని చరిత్రలో లేని విధంగా దాదాపు లక్ష కోట్ల డాలర్లు (96,900) నష్టపోయేందుకు దోహదం చేసింది. పది సంవత్సరాల క్రితం అమెరికా ఓపెన్ ఎ.ఐ కంపెనీ (చాట్ జిపిటి సృష్టికర్త) నాలుగున్నర వేల మంది సిబ్బంది, 660 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైంది. అదే చైనా డీప్ సీక్ 200 మంది సిబ్బందితో ప్రారంభమై రెండు సంవత్సరాలు కూడా నిండలేదు. కోటి డాలర్లలోపు ఖర్చుతోనే యాప్‌ను అభివృద్ధి చేసినట్లు ది కొబెఇసీ న్యూస్‌లెటర్ స్థాపకుడు ఆడమ్ కొబెఇసీ ఎక్స్‌లో పేర్కొన్నాడు. ఈ రెండు కంపెనీలు ఇప్పుడు ఎలా పోటీబడుతున్నాయో చూడండని పేర్కొన్నాడు. ఒక్క ఎన్విడియా కంపెనీ వాటాల ధరలే 60 వేల కోట్ల మేర నష్టపోయాయి. ఆ కంపెనీ సిఇఓ 2,100, ఒరాకిల్ అధిపతి సంపద 2,760 కోట్ల డాలర్లు నష్టపోయారు. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇంత నష్టం ఇదే ప్రధమం. దాని మీద ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో సైబర్ దాడులు జరుగుతున్నాయి. అమెరికా కంపెనీలు ఒక యాప్‌ను తయారు చేసేందుకు పది కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే చైనా కంపెనీ కేవలం 60 లక్షల డాలర్లతో వాటికి దీటైనదాన్ని రూపొందించింది.
ఆధునిక చిప్‌లను, వాటిని తయారు చేసే యంత్రాలను చైనా కంపెనీలకు విక్రయించరాదని అమెరికా ఆంక్షలు విధించిన తరువాత డీప్ సీక్ తన సత్తా చాటింది. చిత్రం ఏమిటంటే అమెరికాకు చెందిన ఎన్వీడియా కంపెనీ తన దగ్గర పాత తరం హెచ్ 800 రకం చిప్స్‌ను రెండు వేలు కొనుగోలు చేసి వాటిని వినియోగించామని డీప్ సీక్ ఇంజనీర్లు వెల్లడించారు. అందువలన చైనాకు ఆధునిక పరిజ్ఞానం అందకుండా మడిగట్టుకొని మంత్రాలు వేసిన వారు ఇప్పుడేం చేస్తారన్నది ప్రపంచానికి ఆసక్తి కలిగించే అంశం. చివరికి రద్దును అమ్మాలన్నా చైనా గనుక కొనుగోలుకు ముందుకు వస్తే ధనిక దేశాల కంపెనీలు భయపడే స్థితి వచ్చింది. ఇంత తక్కువ ఖర్చుతో చైనా యాప్‌లు తయారు చేస్తున్నపుడు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేయటం అవసరమా అని అమెరికన్లలో సందేహాలు తలెత్తాయి. తాజా యాప్‌ను విడుదల చేయక ముందే అంటే జనవరి ప్రారంభం నుంచి డీప్ సీక్ కంపెనీ మీద సైబర్ దాడులు ప్రారంభమయ్యాయని చైనా భద్రతా సంస్థ ఎక్స్ లాబ్ వెల్లడించింది. అమెరికా, సింగపూర్, నెదర్లాండ్స్, జర్మనీ చివరికి చైనాలో చిరునామాలు కలిగిన సంస్థలు వేల సంఖ్యలో దాడులు జరుపుతున్నాయని, రానున్న రోజుల్లో ఇంకా పెరగవచ్చని కూడా హెచ్చరించింది. ఈ దాడులు జరుగుతుండగానే జనవరి 28వ తేదీన డీప్ సీక్-ఆర్‌ఐ మోడల్ యాప్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది అమెరికన్ ఏఐకి హెచ్చరిక అని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వర్ణించినట్లు సమాచారశాఖ మంత్రి కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు.
చైనా యాప్ విడుదలకు వారం రోజుల ముందు డోనాల్డ్ ట్రంప్ స్టార్‌గేట్ పేరుతో సాంకేతిక రంగంలో తనకు అనుకూలమైన కొందరిని సమావేశపరచి కృత్రిమ మేథ, సంబంధిత రంగాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 500 బిలియన్ డాలర్ల మేర ప్రాథమిక సదుపాయాలను కల్పించనున్నట్లు, అది సాంకేతిక రంగ భవిష్యత్‌కు తోడ్పడుతుందని ప్రకటించాడు. చైనాకు అడ్డుకట్ట వేసేందుకు కన్న కలలను అదే చైనా వారం రోజుల్లోనే ఆటతీరునే మార్చి వేస్తుందని ట్రంప్ ఊహించలేకపోయాడు. నిజానికి ఇతర చైనా కంపెనీలు ప్రపంచానికి సుపరిచితం తప్ప డీప్ సీక్ గురించి పెద్దగా తెలియదు. అలాంటి కంపెనీ అమెరికా సాంకేతిక రంగాన్ని, ఖరీదైన ట్రంప్ పథకాలను ఒకేసారి దెబ్బతీసింది. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్, తరువాత జోబైడెన్ కూడా సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలు చైనాకు అందకుండా చూసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో అనేక రంగాల్లో చైనా ముందున్నప్పటికీ మైక్రో చిప్స్, ఏఐ రంగంలో వెనుకబడి ఉందని వెంటనే అమెరికాను అధిగమించటం జరిగేది కాదని అనేక మంది భావిస్తున్న తరుణంలో అది వాస్తవం కాదని స్పష్టం చేసింది, ఇప్పటికే చిప్స్ తయారీకి శ్రీకారం చుట్టిన చైనా ఆ రంగంలో కూడా త్వరలో తన సత్తా నిరూపించటం ఖాయం. ఏఐలో సంచలనాలు సృష్టించిన చాట్ జిపిటిని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ మరికొన్నింటిని పెంపొందించటానికి ట్రంప్ స్టార్‌గేట్ పేరుతో ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు పూనుకున్నాడు. ఈ రంగంలో అతిపెద్ద సంస్థలైన గూగుల్, మేటా, ఇతర పెద్ద సంస్థలను దీన్నుంచి మినహాయించాడు. చాట్ జిపిటిపై ప్రతి ఖాతాదారు మీద నెలకు రెండు వందల డాలర్లు ఖర్చు అవుతున్నదని, నష్టాల్లో ఉన్నట్లు ఓపెన్ ఏఐ చెప్పింది. నిజానికి ఇప్పటి వరకు ఈసేవ ద్వారా లాభాలు ఎలా వచ్చేదీ స్పష్టం కాలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన డీప్ సీక్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు. బైట్ డాన్స్ రూపొందించిన టిక్ టాక్, అలీబాబా, మూన్‌షాట్, ఝిపు వంటి చైనా కంపెనీలు ఇప్పటికే ఏదో ఒక రూపంలో అమెరికా సంస్థలను సవాలు చేస్తున్నాయి. మరోసారి అమెరికాను గొప్పదిగా చేయాలన్న ట్రంప్ మీద భ్రమలు పెట్టుకున్నవారు నేడు గాకపోతే రేపైనా కళ్లు తెరవక తప్పదు.
డీప్ సీక్ కంపెనీ 2023 చివరిలో ప్రారంభమైంది. అంతకు ముందు దాని అధినేత లియాంగ్ వెన్‌ఫెంగ్ ఒక వెంచర్ కాపిటల్ సంస్థను నడుపుతున్నాడు. దాని వాణిజ్య వ్యూహాలను రూపొందించేందుకు కృత్రిమ మేథను వినియోగించాడు. తరువాత కంప్యూటర్ ప్రాతిపదికగా పని చేసే రెండు కంపెనీలను పదేళ్ల క్రితం ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో తలెత్తిన ఆసక్తి నుంచి డీప్ సీక్ యాప్ వెలువడింది. ఇటీవలి కాలంలో చైనా తనదైన శైలిలో అమెరికన్లకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నది. ప్రపంచంలో అతి పెద్ద నౌకాదళ శక్తిగా రూపొందింది. ఆరవ తరం యుద్ధ విమానాన్ని ప్రయోగించింది. ఇప్పుడు కృత్రిమ మేథ రంగంలో షాకిచ్చింది. అమెరికా కంపెనీలు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే కేవలం 60 లక్షల డాలర్లు, అంతగా ఆధునికం కాని, పరిమిత కంప్యూటర్ చిప్స్‌తో యాప్‌ను తయారు చేశారు. ఒక ఊరూ పేరు లేని సంస్థే ఆ ఘనతను సాధించటంతో సిలికాన్ వ్యాలీ లోని అగ్రశ్రేణి కంపెనీలు భయాలను వ్యక్తం చేశాయి.
ఎం. కోటేశ్వరరావు