పెద్దగా ఎవరికీ తెలియని, ఓ చిన్న చైనా కంపెనీ, డీప్ సీక్ అనే ఏ.ఐ మోడల్ (కత్రిమ మేధ నమూనా)ను, ఆవిష్కరించి మొత్తం ప్రపంచంలోని సాంకేతిక నిపుణులందరినీ దిగ్భ్రముల్ని చేసింది. ప్రఖ్యాతిగాంచిన ఓపెన్ ఏ.ఐ తాజా నమూనాలతో సరిపోలే ఈ విధంగా ఈ డీప్ సీక్ ఉండటం, దీనికైన వ్యయం అతి స్వల్పంగా ఉండటం ఈ దిగ్భ్రమకు కారణం. గత నెల టెక్ ప్రపంచమంతా ఒకటే హడావుడి. ఎన్విడియా కంపెనీ ప్రాభవాన్ని ఊపరి బిగపట్టుకొని అందరూ ఆస్వాదిస్తున్న తరుణంలో, డీప్ సీక్ వచ్చి, ప్రముఖ టెక్ కంపెనీలకు ట్రిలియన్ డాలర్ల నష్టం చేసి దు:ఖాన్ని మిగిల్చింది. ఉన్నత స్థాయి గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల (జిపియు)ను ఉత్పత్తి చేసే, ఈ ప్రఖ్యాత ఎన్విడియా కంపెనీ, కూడా భారీగా నష్టపోయింది. ఒకేరోజు 600 మిలియన్ల డాలర్లు కోల్పోయింది. నిజానికి చైనాకు ఉన్నత స్థాయి చిప్స్ ఎగుమతిపై అమెరికా పెట్టిన తీవ్రమైన ఆంక్షలను, తట్టుకుంటూనే, చైనా కంపెనీ డీప్ సీక్‌ను చాలా తక్కువ వ్యయంతో తయారు చేసింది. ఓపెన్ ఏ.ఐ, ఆంత్రోపిక్, గూగుల్, మెటా లాంటి కంపెనీలు పెడుతున్న ఖర్చులో అది 3-5 శాతం కూడా ఉండదు.
ఆంక్షల మధ్య ఎదిగిన డీప్ సీక్
ఇమేజ్ డేటా లను జి.పి.యు లు ప్రాసెస్ చేస్తాయి. ఇప్పుడివి అన్ని ఏ.ఐ మోడళ్లలోనూ వాడుతున్నారు. జి.పి.యు లను చైనాకు అందుబాటులో లేకుండా చేయాలని అమెరికా చూసింది. కొద్ది ఇన్వెస్ట్‌మెంట్లతో, చిన్న చిన్న టీమ్‌లతో మౌలికమైన ఏ.ఐ మోడళ్లను తయారుచేసే పనికి ఎవరు పూనుకున్నా, వ్యర్థమని, అమెరికన్ టెక్ దిగ్గజాలతో పోటీ పడలేరనీ అనేవారు. పోయిన సంవత్సరం భారతదేశ పర్యటనలో, ‘ఓపెన్ ఏ.ఐ గురు’గా ప్రాచుర్యంలో ఉండే శామ్ ఆల్ట్ మన్ కూడా ఈ మాట అన్నాడు. ఇండియన్ టెక్ గురు నందన్ నీలేఖరి కూడా దాదాపు ఇదే అన్నాడు. మౌలికమైన ఏ.ఐ మోడళ్లను తయారు చేసే పని జోలికి ఇండియా పోకూడదని, వాటిని వాడుకోవడం మాత్రం చేయాలని, తయారీ నియంత్రణలను అమెరికాకు వదిలేయాలని ఆయన అన్నాడు. అయితే, ఈ అభిప్రాయంతో గట్టిగా విభేదించిన అరవింద్ శ్రీనివాసన్ (పర్‌ప్లెక్సిటీ అనే ఏ.ఐ కంపెనీకి సహా వ్యవస్థాపకుడు, సిఇఓ కూడా) లాంటి వాళ్లూ లేకపోలేదు.
శామ్ ఆల్ట్‌మన్ చెప్పింది తప్పని డీప్ సీక్ రుజువు చేసింది. దానిది చాలా తక్కువ బడ్జెట్. కానీ మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టే పెద్ద కంపెనీలతో ఢకొీన్నది. అది కూడా హార్డ్ వేర్‌పై అమెరికా పెట్టే అనేక నియంత్రణలను తట్టుకొని. ఇటువంటి నియంత్రణలకు పనికి వచ్చే విధంగా ఎన్విడియా కంపెనీ చైనా మార్కెట్ కోసమే హెచ్ 800 చిప్స్‌ను ప్రత్యేకంగా తయారు చేసింది. అయితే శాస్త్ర సాంకేతిక పురోగమనాలను, వ్యాపార ఆంక్షలతో అడ్డుకోలేరనే చారిత్రక సత్యం టెక్ ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అవగతం అవుతున్నది.
ఏ.ఐ మోడళ్లు మామూలివి కావు. మన ప్రశ్నలకు జవాబు చెప్పే, మంచి సంక్షిప్తీకరణలు చేసే, గూగుల్ సెర్చ్ కంటే మెరుగ్గా ఉన్నట్లనిపించే, చాట్ జిపిటి చాట్ బోట్స్ లేదా డీప్ సీక్ చాట్ బోట్స్ కాదు. చాట్ జిపిటి కూడా ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారమే ఇస్తుంది తప్ప, కొత్త విషయం చెప్పదు. కానీ ఈ కొత్త ఏ.ఐ నమూనాలు, తార్కికంగా వ్యవహరిస్తాయి. సరికొత్తవి నేర్చుకుంటాయి. వీటినే రీజనింగ్ మోడళ్లు (తర్కించే నమూనాలు) అంటున్నారు. మానవ మేధను అనుకరించాలనుకొని, పెద్దగా సఫలం కాలేకపోతున్న ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఎజిఐ) కూడా ఈ రీజనింగ్ మోడళ్ల దారిలో నడవాల్సిందే. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలన్నీ, ఈ రీజనింగ్ మోడళ్లలోనే జరుగుతున్నాయి. ఇక్కడే డీప్ సీక్ సాధించిన ఘనత ఉంది. శక్తివంతమైన అమెరికన్ డిజిటల్ కంపెనీల కంటే ఎక్కువగా గానీ, లేదా కనీసం దానితో సరి సమానంగా గాని డీప్ సీక్ వెళ్లిందని అంటున్నారు. ఏఐ విషయంలో ‘అమెరికాను చైనా కబళిస్తోందా?’ అంటూ పత్రికా శీర్షికలు పెడుతున్నారు.
అయితే అమెరికన్ కంపెనీలను దిమ్మెర పోయేట్టుగా చేసింది మరొకటుంది. ఏ.ఐ లో అమెరికన్ టెక్ కంపెనీలను చైనా దాటుకొని వెళ్లిందనేది పక్కన పెడితే, 8 బిలియన్ల కోట్ల డాలర్ల విలువ కూడా చేయని ఒక కంపెనీ, పెద్దగా గత అనుభవం లేని కంపెనీ, అతి తక్కువ ఖర్చుతో ఈ ఫలితాన్ని సాధించడం ఏ విధంగా సాధ్యమైంది? అనేది వారి ప్రశ్న. ఓపెన్ ఏ.ఐ తో సరితూగే నమూనాను, రెండు నెలల్లోనే, ఆరు బిలియన్ల డాలర్లు మాత్రమే ఖర్చు పెట్టి ఏ విధంగా సాధించారనేది ఒక పెద్ద ప్రశ్న. పైగా, ఈ విజయాన్ని, ఎన్విడియా కంపెనీ ఇచ్చిన హెచ్ 800 లాంటి, తక్కువ సామర్ధ్యపు చిప్స్‌ను వాడి సాధించారు. చైనా సాంకేతిక నాణ్యతలంటే ఒక తీవ్రమైన అపనమ్మకం చాలామందికి ఉంది. దాన్ని పటాపంచలు చేయడానికే చైనా డీప్ సీక్‌ను ఓపెన్ సోర్స్ చేసింది. తమ పరిశోధనల గురించిన వివరమైన వ్యాసాలను ప్రచురించింది.
క్వాంట్‌లు అంటే…
ఇంతకూ ఈ డీప్ సీక్ కి వెనుక ఏ కంపెనీ ఉంది? ఎవరెవరున్నారో? చూద్దాం. ఫైనాన్షియల్ ప్రపంచంలో వారిని క్వాంట్స్ అంటారు. వీళ్లు గణిత శాస్త్రాన్ని, కంప్యూటర్ ప్రోగ్రాముల మోడళ్లను అనుసంధానం చేసి పని చేస్తారు. 2008లో వచ్చిన వాల్ స్ట్రీట్ కుప్పకూలి, సబ్ ప్రైమ్ సంక్షోభం రావడానికి వీళ్లనే కారణంగా చూపిస్తారు. ఆ విధంగా వీరికి చెడ్డ పేరు కూడా కొద్దిగా వచ్చింది. కానీ వీళ్ళు లేకపోతే ఈ ఫైనాన్స్ ప్రపంచానికి గడవదు. డీప్ సీక్ వెనుక ఉన్నది లియాంగ్ వెంగ్ ఫెంగ్ అనబడే ఒక క్వాంట్. 2012లో తాను మదుపు చేసిన 12 బిలియన్ల డాలర్లలో, మూడో భాగం వరకు పోగొట్టుకున్నాడు. మిగిలిన కొంచెం డబ్బులతో, మరికొందరు క్వాంట్‌లను టీమ్‌గా చేసి, కృత్రిమ మేధ వైపు మళ్ళించాడు.
అయితే డీప్ సీక్ కొత్త గణిత విజ్ఞానాన్నేమీ కనుక్కోలేదు. వాళ్లు చేసిందంతా, కొంచెం ఇంజనీరింగ్ తెలివి ఉపయోగించి, రెండు కొత్త మోడళ్లను సృష్టించడమే. కంప్యూటింగ్ వైపు డబ్బులు వెదజల్లితే సమస్యలు అవే పరిష్కారం అవుతాయి. అని చాలామంది లాగా వాళ్లు అనుకోలేదు. ఓపెన్ ఏ.ఐ, ఆంత్రోపిక్ కంపెనీల నమూనాలతో సరి సమానమైన ప్రపంచ స్థాయి నమూనాలతో డీప్ సీక్‌ను పోల్చవచ్చని, ప్రఖ్యాత టెకి జాఫ్రి ఇమాన్యుయేల్ అభిప్రాయపడ్డారు. కానీ ఈ కంపెనీలు పెట్టిన ఖర్చుతో పోల్చుకుంటే, డీప్ సీక్‌కు ఆయన ఖర్చు 5 శాతం మాత్రమే. ఇమాన్యుయేల్ అంచనా ఏమంటే, డీప్ సీక్ మిగిలిన ప్లాట్ ఫామ్స్ కంటే 40-50 రెట్లు మెరుగ్గా పనిచేయగలదని. డీప్ సీక్ మోడళ్లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టారు. అంతేకాదు మార్పులు చేర్పులకు వీలుగా, గిట్ హబ్ లాంటి వాటిలో కూడా వాటిని విడుదల చేశారు. ఇంకా, వారు ఏ విధంగా డీప్ సీక్‌ను నిర్మించారో, దశలవారీగా వివరిస్తూ టెక్నికల్ రిపోర్టులను అందరికీ అందుబాటులో ఉంచారు. అంటే వారు తయారు చేసిన మోడళ్లను, దాని వెనుక ఉన్న వైజ్ఞానికాంశాలను మాత్రమే కాకుండా, ఒకవేళ ఏవైనా సమస్యలు వస్తే వాటిని ఏ విధంగా పరిష్కరించారో కూడా, విశ్లేషణలను అందరికీ అందుబాటులో ఉంచారు. అంటే ఎవరైనా సరే, వీటి ఆధారంగా సొంత మోడళ్లను తయారు చేసుకుని, తమ సర్వర్లలో ఉపయోగించుకోవచ్చన్నమాట.
పర్యవసానాలు
డీప్ సీక్ సృష్టించిన మార్కెట్ షాక్‌కు మూడు పర్యవసానాలు ఉన్నాయి. మొదటిది, ఏ.ఐ బూమ్‌లో ఒక వెలుగు వెలిగిన ఎన్విడియా కంపెనీ, షేర్ల విలువలు ఒక కుదింపుకు గురి అవుతున్నాయి. ఇక, రెండవది, ఏ.ఐ పోటీలో చిన్న కంపెనీలు కూడా, ప్రవేశించే ధైర్యం చేయగలుగు తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు భయపెట్టినట్టు అదేమీ అంత వ్యయభరితమైనది కాదని అర్థం చేసుకుంటున్నారు. జీవ పరిణామంలో లాగే, పెద్ద పెద్ద జంతువులే ఈ పోటీలో గెలవాలనేదేమీ లేదు.
మూడవ విషయం ఏమిటంటే, టెక్నాలజీపై ఆంక్షలు ఉంచినా అవి పెద్దగా పని చేయవని. న్యూక్లియర్ రంగంలో కానీ, అంతరిక్ష రంగంలోగానీ మన దేశంలో ఈ ఆంక్షలు పనిచేయలేదని మనకు తెలుసు. అట్లాగే చైనాపై ఏ.ఐ రంగంలో పెట్టిన ఆంక్షలు కూడా పనిచేయలేదు. కంప్యూటింగ్ పెంచుకుంటూ పోవడం ఒకటే, మార్కెట్ వాటాను పెంచుకోవడానికి మార్గం కాదని అర్థమైన తర్వాత, ఏఐ పరిశ్రమ కోసం ఇంతింత పెద్ద డేటా సెంటర్లు అవసరమా? అనే ప్రశ్న వస్తుంది. మైక్రో ప్రాసెసర్లు, కంప్యూటర్లు తొలి రోజుల్లో ఎటువంటి కుదుపునిచ్చాయో, అటువంటి షాక్‌నే ఇప్పుడు డీప్ సీక్ ఇస్తోంది. కంప్యూటర్లలో అభివృద్ధి అంటేనే, ఒకప్పుడు పెద్ద పెద్ద గదుల్లో, పెద్ద పెద్ద కంప్యూటర్లు నిర్మించడంగా అనుకునేవారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన రెండవ రోజునే, 500 కోట్ల డాలర్లతో స్టోర్ గేట్ అనే బృహత్ ప్రాజెక్టును ప్రకటించాడు. శక్తివంతమైన డేటా ప్రాసెసింగ్ యూనిట్లతో కూడిన డేటా సెంటర్లను నిర్మించడం అనే ప్రణాళిక ఇందులో ఉంది. ఇవన్నీ దాదాపు ఎన్విడియాకు సంబంధించినవే. ఈ డేటా సెంటర్లకు పెద్ద ఎత్తున విద్యుత్ శక్తి అవసరం అవుతుంది. దీనికోసం, డ్రిల్ చేసిన సహజ వాయువులతో విద్యుత్తు ఉత్పత్తి చేయాలనే ట్రంప్ వ్యవహారం కూడా బొక్క బోర్లా పడేట్టు ఉంది. ఈ డేటా సెంటర్లే లేకుంటే, సహజ వాయువు నుండి ఉత్పత్తి చేసే విద్యుత్ శక్తికి పెద్దగా. గిరాకీ ఉండేట్టు లేదు. ఎందుకంటే అమెరికాలో సౌరశక్తి, పవన విద్యుత్‌లు, మరింత చౌకగా లభ్యం అవుతున్నాయి. మొత్తం మీద డీప్ సీక్ పెద్ద పెద్ద ప్రణాళికలపై ఉండే మోజును తుత్తునియలు చేసింది. ఒక విధంగా అమెరికాకు గ్రీన్ హౌస్ వాయువులు పెరిగే బెడద కూడా తగ్గింది.
ఒక గొప్ప తాత్వికుడు అన్న మాటేమిటంటే…సమాజంలో ఒక్కోసారి పదుల సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఏమీ జరిగినట్టే ఉండదట. కానీ కొన్ని వారాల్లోనే, ఎన్నో దశాబ్దాలలో జరగాల్సినవి జరిగిపోతాయట. బహుశా ఇప్పుడివి అటువంటి సమయాలేనేమో. కనీసం కృత్రిమ మేధకు సంబంధించినంత వరకైనా.
(స్వేచ్ఛానువాదం)
ప్రబీర్ పురకాయస్థ