ధరల సూచీలకు జాప్యమేల?

May 24,2024 03:45 #editpage

మోడీ ప్రభుత్వానికి శ్రమజీవుల సంక్షేమం పట్ల ఉన్న నిర్లక్ష్యమూ, యాజమాన్యాల పట్ల ఉన్న శ్రద్ధాసక్తీ మరోసారి వెల్లడైంది. నెలనెలా విడుదల చేయాల్సిన వినియోగ ధరల సూచీని రెండు నెలల నుంచి విడుదల చేయకపోవడం కేంద్ర కార్మిక శాఖ నిర్వాకాన్ని ఎత్తి చూపుతోంది. మోడీ షాల పదేళ్ల పాలనలో పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు ధరలు రెండింతలూ, మూడింతలూ పెరగడంతో- వాటి ఆధారిత ధరలన్నీ ఎప్పుడో ఆకాశాన్నంటాయి. అందుకు తగ్గట్టుగా వేతనాలు పెరగక, నిజ ఆదాయాలను కోల్పోయిన అన్ని తరగతుల ఉద్యోగులూ దైనందిన జీవితాలను నెట్టుకురావటానికి నానా ఇబ్బందులూ పడాల్సి వస్తోంది. అరకొర జీతాలతో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
పెరిగిన ద్రవ్యోల్పణానికి అనుగుణంగా శ్రమజీవులు ఆహార ఖర్చులను తట్టుకోవటానికి ధరల సూచీని విడుదల చేయడం, దానినిబట్టి సంస్థల యాజమాన్యాలు కరువు భత్యం (డిఎ) పెంచటం దశాబ్దాలుగా అమలులో ఉన్న చట్టబద్ధమైన ప్రక్రియ. ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులూ అవసరమైన పోషకాహారాన్ని తీసుకోవాలనేది ఈ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం. గత నెలలో వివిధ ఆహారోత్పత్తుల ధరలను సేకరించి, మధించి, వాటి హెచ్చుతగ్గుల వివరాలను నడుస్తున్న నెల ఆఖరి రోజున కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేయాలి. ఈ పని 2024 జనవరి వరకూ జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల ధరల సూచీలను మాత్రం ప్రకటించకుండా నొక్కి పెట్టారు. ఆ రెండు మాసాలకు సంబంధించి లేబర్‌ బ్యూరో సేకరించి, గణించిన ద్రవ్యోల్బణ గణాంకాలు వివిధ సందర్భాల్లో ప్రస్తావనకొచ్చాయి కూడా. కానీ, కార్మికులకు ఉపయోగపడే ధరల సూచీలను మాత్రం ఇంతవరకూ విడుదల చేయలేదు. ఎందుకు ప్రకటించలేకపోయారో కూడా ఎక్కడా పేర్కొనలేదు.
వెల్లడైన గణాంకాల ప్రకారం … ఈకాలంలో ఆహారోత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.26 శాతంగా నమోదైంది. గడచిన 13 నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి. ఫిబ్రవరిలో 0.20 శాతం ఉన్న టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) మార్చిలో 0.53 శాతానికి, ఏప్రిల్‌లో 0.79 శాతానికి ఎగసింది! కూరగాయల ధరలు 19.52 శాతం నుంచి 23.60 శాతానికి ఎగసాయి. భారతీయులు ఎక్కువగా వినియోగించే బంగాళాదుంపల ధరలు 71.97 శాతం పెరిగాయి. ఉల్లి ధరలు 59.75 శాతం హెచ్చాయి. ఈ సంఖ్యల అన్నింటి సారాంశం ఒక్కటే.. ప్రజలు ఆహారంపై పెట్టే ఖర్చు గణనీయంగా పెరిగిందీ అని. కార్మిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు ధరల సూచీని విడుదల చేసి ఉంటే- ఉద్యోగులకు, కార్మికులకు ఎంతోకొంత ఉపశమనం దొరికి ఉండేది. సూచీలో పేర్కొన్న వ్యత్యాసాన్ని బట్టి సంస్థల యాజమాన్యాలు భత్యాన్ని పెంచాల్సి ఉండేది. పద్ధతి ప్రకారం జరగాల్సిన ఈ పనిని కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆపేసిందని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం ఎన్నికల వేళ ప్రస్తావనకు రాకుండా ఉండటానికి; తన పనుపున నిలిచే యజమానులకు మేలు చేయటానికీ బిజెపి ఉద్యోగులకు ఈ ద్రోహం తలపెట్టింది.
కేంద్రం ప్రదర్శిస్తున్న ఈ నిర్లిప్త, నిర్లక్ష్య వైఖరి లక్షలాది మంది ఉద్యోగుల, కార్మికుల ప్రయోజనాలకు తీవ్రమైన దెబ్బ. ధరల సూచీ విడుదలలో జాప్యం కారణంగా బ్యాంకు ఉద్యోగులతో సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ కార్మికులూ డియర్‌నెస్‌ అలవెన్సు (డిఎ)ను కోల్పోతారు. ఎఐసిపిఐ ఐడబ్ల్యు వెల్లడించే ఈ గణాంకాలు ఉద్యోగుల డిఎ లెక్కలకు మాత్రమే కాదు; ద్రవ్యోల్బణం, ఇతర విధాన సూత్రీకరణలకూ దోహదపడతాయి. దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంచనా వేయటానికీ, అధ్యయనం చేయటానికీ ఉపకరిస్తాయి. ఇదే విషయమై సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ బుధవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు లేఖ రాశారు. ”ధరల సూచీ విడుదలలో ఇప్పుడు జరిగిన జాప్యం అసాధారణమైనది.” అని పేర్కొన్నారు. కార్మికుల, ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకుండా తక్షణం మూడు నెలల ధరల సూచీలను ప్రకటించటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత.

➡️