జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)ను వ్యతిరేకిస్తూ వివిధ రాజకీయ పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) ఏర్పాటు మోడీ ప్రభుత్వ కుట్ర పూరిత చర్యకు తిరుగులేని హెచ్చరిక. జనాభా ప్రాతిపదికన 2026లో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్రం ఎప్పుడైతే వెల్లడించిందో ఆ క్షణం నుంచి రాజకీయంగా కలకలం లేచింది. నియంత్రణా చర్యలతో జనాభాను అదుపు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. సరిగ్గా ఈ సమయంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు తగ్గబోవంటూ హోం మంత్రి అమిత్‌షా వంటి వారి వివాదాస్పద వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. కేంద్ర ఈ గందరగోళ అస్పష్ట వ్యవహారం నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె చీఫ్ స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలతో పాటు డీలిమిటేషన్ వల్ల సీట్ల కోత కత్తి వేలాడుతున్న పంజాబ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయపార్టీలతో శనివారం చెన్నరులో నిర్వహించిన తొలి సమావేశం జయప్రదమైంది. కేరళ, పంజాబ్, తెలంగాణ సిఎంలతోపాటు కర్ణాటక డిప్యూటి సిఎం, బిఆర్‌ఎస్ సహా ఆరు రాష్ట్రాలకు చెందిన 14 పార్టీలు పాల్గొనడమే కాకుండా జెఎసిగా ఏర్పడటం భవిష్యత్ కార్యాచరణపై పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం మంచి పరిణామం.
డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసిందని అది చేస్తున్న విన్యాసాలే తెలుపుతాయి. దేశ వ్యాప్తంగా సీట్లు పెరగుతాయంటున్న మోడీ సర్కారు అందుకు ప్రాతిపదికేంటో ఇదమిత్థంగా పేర్కొనలేదు. రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్ల నిష్పత్తితోనే పెరుగుతాయా లేదంటే జనాభా ప్రాతిపదికనా అనే విషయంలో మబ్బులో పెట్టి మాట్లాడుతోంది. ఒక వేళ జనాభానే కొలబద్ద అయితే జాతి హితం కోసం జనాభాను నియంత్రించిన రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయి. పార్లమెంట్‌లో వాటి ప్రాతినిధ్యం కుదించుకుపోతుంది. ఈ చర్య అన్యాయంగా ఆయా రాష్ట్రాలను శిక్షించడమే అవుతుంది. పర్యవసానంగా కేంద్రం నుంచి నిధులు తగ్గుతాయి. సంప్రదాయం, గుర్తింపు, అభివృద్ధి, రాజకీయశక్తి క్షీణిస్తుంది. రాష్ట్రాల మధ్య అసమానతలు పెరుగుతాయి. సామాజిక న్యాయం, మహిళా సాధికారత దెబ్బతింటుంది. 1971 తర్వాత దక్షిణాది సహా మరికొన్ని రాష్ట్రాలు జనాభాను నియంత్రించాయి. ఎమర్జెన్సీ సమయం 1976లో, వాజ్‌పేయి హయాం 2001లో చేసిన రాజ్యాంగ సవరణలు సీట్ల సంఖ్యను ఫ్రీజ్ చేశాయి. ఇప్పుడు జనాభా ప్రాతిపదిన డీలిమిటేషన్ అంటే జనాభా నియంత్రణ లక్ష్యాలను చేరుకోని ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ నిజానికి 2021కే పూర్తి అయి ఉండాలి. కాని ఆ లెక్కలు వెల్లడించే కఠోర వాస్తవాలను స్వీకరించే దమ్ము లేని బిజెపి ఏకంగా జనగణననే నిరవధికంగా వాయిదా వేస్తోంది. మరోపక్క డీలిమిటేషన్ వివాదాన్ని ముందుకు తెచ్చి ‘జనాభా ప్రాతిపదిక’ అంటోంది. ఇది ఆ పార్టీ నయవంచనను వెల్లడిస్తోంది. ఉత్తరాదిలో బిజెపి ప్రభావం ఎక్కువ. ఉత్తరాదిలో, బిజెపి పాలిత రాష్ట్రాల్లో సీట్లు పెంచుకొని రాజకీయంగా లబ్ధి పొందే కుట్రకు బిజెపి తెరతీసిందని అనుమానం వస్తుంది. ఈ తరుణంలో మరో పాతికేళ్లపాటు డీలిమిటేషన్ వద్దన్న విపక్ష పార్టీల జెఎసి డిమాండ్ న్యాయసమ్మతమైంది.
డిఎంకె నిర్వహించిన సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ హాజరుకాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ వెళ్లలేదు. అధికార కూటమి పార్టీలు డీలిమిటేషన్ పర్యవసానాలపై నోరు మెదపకపోవడం రాష్ట్రానికి హానికరం. టిడిపి, జనసేన పార్టీలు బిజెపి కుట్రలో భాగస్వాములైతే రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేసినవారవుతారని గ్రహించాలి. వైసిపి స్టాలిన్ నిర్వహించిన సమావేశానికి వెళ్లకుండా ప్రధానికి లేఖ రాసింది. దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గకూడదంటూనే మోడీ నేతృత్వం పట్ల తన విధేయతను జగన్ చాటుకోవడం ఆ పార్టీ అవకాశవాద వైఖరికి నిదర్శనం. ఇక తెలుగు ప్రజల కోసమే పుట్టానని చెప్పే టిడిపి మౌనం వహించడం తెలుగు ప్రజలను వంచించడమే. ఇప్పుడైనా మౌనం వీడి అసంబద్ధ, అన్యాయమైన డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా టిడిపి, జనసేన తమ వైఖరిని ప్రకటించాలి. రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత నుంచి ఈ పార్టీలు తప్పించుకోలేవు.