ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి – ఇ.డి కోరలు పీకాలి

Apr 7,2024 04:46 #editpage

లోక్‌సభ ఎన్నికలకు సిపిఎం విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక…భారత ప్రజాస్వామ్యం, పౌరుల ప్రాథమిక హక్కులపై కీలకమైన ప్రభావాన్ని చూపించగల ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి)-మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పి.ఎం.ఎల్‌.ఎ) పరిధి కింద ఆ సంస్థ పని చేసే తీరుకు సంబంధించిన అంశమే అది.
”చట్ట దుర్వినియోగం జరగకుండా నివారించేందుకుగానూ పిఎంఎల్‌ఎ స్థానంలో అనువైన మరో చట్టాన్ని తీసుకురావాలి. ఇ.డి తన చట్టాన్ని అమలు చేసే అధికారాలను తొలగించాలి.” అని సిపిఎం ఎన్నికల ప్రణాళిక పేర్కొంటోంది.
ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాల హక్కులను పరిరక్షించాలంటే సకాలంలో తీసుకోవాల్సిన అత్యంత అవసరమైన ప్రిస్క్రిప్షన్‌ ఇది. డజన్ల సంఖ్యలో ప్రతిపక్షాల నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి పిఎంఎల్‌ఎను ఇ.డి ఎలా ఆయుధంగా మలుచుకుందో మనం చూశాం. ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రులు హేమంత్‌ సోరెన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌లను పిఎంఎల్‌ఎ నిబంధనలు ఉపయోగించే ఇ.డి అరెస్టు చేసింది.
పిఎంఎల్‌ఎ చట్టం పూర్తిగా తన పూర్వపు ప్రయోజనం నుండి మారి కొత్త రూపాన్ని సంతరించుకుంది. 2005లో మొదటగా దీన్ని ఆమోదించారు. మాదకద్రవ్యాల ద్వారా ఆర్జించిన ధన దుర్వినియోగాన్ని సమర్ధవంతంగా నివారించేందుకు అన్ని సభ్య దేశాలు అనువైన చట్టాలను రూపొందించుకోవాలని కోరుతూ 1998లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి ప్రతిస్పందనగా ఈ చట్టాన్ని రూపొందించారు.
అయితే, ఇన్నేళ్ళ కాలంలో అనేక సవరణల ద్వారా పిఎంఎల్‌ఎ పరిధిని విస్తరిస్తూ వచ్చారు. 2013లో యుపిఎ ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది. కానీ అత్యంత నిరంకుశమైన నిబంధనలన్నీ 2018లో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మాదకద్రవ్యాల ద్వారా, ఇతర సంబంధిత నేరాల ద్వారా ఆర్జించిన ధనాన్ని దుర్వినియోగం చేయకుండా తీసుకువచ్చిన ఈ చట్టానికి వరుస సవరణల ద్వారా షెడ్యూల్‌లో చేర్చుకుంటూ వచ్చిన వివిధ రకాలైన ఇతర నేరాలను కలుపుకుంటూ ఈ చట్టాన్ని విస్తరించారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, ఇతర చట్టాల కింద పేర్కొన్న నేరాలన్నీ పిఎంఎల్‌ఎ కింద పేర్కొన్న నేరాల షెడ్యూల్‌లో భాగంగా మారాయి. దీంతో, మాదకద్రవ్యాల ఆర్జనతో లేదా మనీ లాండరింగ్‌తో ఏ విధంగానూ సంబంధం లేని పలు నేరాల దర్యాప్తుకు అవసరమైన అపారమైన అధికారాలను ఇ.డి సమకూర్చుకుంది.
పిఎంఎల్‌ఎ లోని అత్యంత అభ్యంతకరకమైన అంశమేమంటే బెయిల్‌ నిబంధన. ఒక వ్యక్తి దోషి అని రుజువయ్యేంతవరకు ఆ వ్యక్తిని నిర్దోషిగానే భావించాల్సి వుంటుందన్నది క్రిమినల్‌ లా లోని ప్రాథమిక సూత్రం. కానీ, చట్టంలోని 45వ సెక్షన్‌ ప్రకారం నిందితుడు నిర్దోషి అని న్యాయమూర్తి సంతృప్తి చెందితేనే బెయిల్‌ ఇవ్వాలి. అందువల్ల, తాను నిర్దోషినని రుజువు చేసుకునే భారం నిందితుడిపైనే వుంటుంది. దురదృష్టవశాత్తూ, జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌ నేతృత్వంలోని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఈ చట్టం కింద చేసిన సవరణలన్నింటినీ సమర్ధించింది. దాంతో చట్టం మరింత నిరంకుశంగా మారింది.
ప్రభుత్వ ఉద్యోగుల ముడుపులు లేదా ఇతర అవకతవకలకు సంబంధించిన నేరాలకు అవినీతి నిరోధక చట్టం వుంది. ఈ చట్టం కింద నేరాలను కూడా పిఎంఎల్‌ఎ షెడ్యూల్‌లోకి తీసుకువచ్చారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన రాజకీయ నేతలు, మంత్రులను ఈ నిరంకుశ చట్ట నిబంధనలను ఉపయోగించి అరెస్టు చేయడానికి ఇడికి ఇది అవకాశమిచ్చింది. సాధారణంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసుల దర్యాప్తును సిబిఐ చేపట్టాలి, కానీ ఇప్పుడు వాటిని ఇ.డి చేపడుతోంది. క్రిమినల్‌ కుట్ర, హత్యా యత్నం, బలవంతపు వసూళ్ళు, కిడ్నాపింగ్‌ ఇలా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కిందకు వచ్చే పలు నేరాల దర్యాప్తులో ఇడి జోక్యం చేసుకోగలుగుతోంది. సమాచార సాంకేతిక చట్టం, ఇతర చట్టాల పరిధిలోకి వచ్చే నేరాలపై కూడా ఇదే చర్యలు తీసుకోగలుగుతోంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవిన్యూ విభాగం కింద ఒక సంస్థగా పని చేసే ఇ.డి, ఇప్పుడు ప్రభుత్వానికి చట్టం లేని ఒక ఆయుధంగా మారిపోయింది. పైగా సిబిఐకి ఢిల్లీ పోలీసు చట్టం వర్తించే మాదిరిగా దీనికి ఎలాంటి నిబంధనావళి కూడా లేదు. ఇందుకు పిఎంఎల్‌ఎకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సిబిఐలో పోలీసు అధికారులు వుంటారు, కానీ ఇడిలో అధికారులందరూ కూడా ఇండియన్‌ రెవిన్యూ సర్వీస్‌లో లేదా ఇతర సివిల్‌ సర్వీసెస్‌లో పనిచేసేవారే కావడం గమనార్హం. అందువల్ల పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను ఇ.డి అధికారులు ఎదుర్కొనరు. ఉదాహరణ చెప్పాలంటే, ఇ.డి అధికారి రికార్డు చేసిన నిందితుడి స్టేట్‌మెంట్‌ను కోర్టులో ప్రవేశపెట్టవచ్చు, కానీ ఐపిసి నిబంధనల మేరకు పనిచేసే పోలీసు అధికారి ఆలా చేయలేరు. వాస్తవానికి, సుప్రీం కోర్టు కూడా తన తీర్పులో దీన్ని సమర్ధించింది. వారు పోలీసు అధికారులు కారంటూ ఇ.డి అధికారులకు గల ఈ అధికారాన్ని సమర్ధించింది.
పాలక పార్టీ రాజకీయ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకోవడం, వారిని వెంటాడడానికి మాత్రమే ఇ.డి పాత్ర పరిమితం కాలేదు. ఇటీవల ఎన్నికల బాండ్ల పథకానికి సంబంధించి వెల్లడైన కొన్ని విషయాలను పరిశీలిస్తే దీంట్లోని చీకటి కోణం బట్టబయలైంది. ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి నిధులను సమకూర్చేందుకు వ్యాపారవేత్తలను, కంపెనీలను బెదిరించడానికి, వారిని వేధించడానికి ఇ.డిని ఉపయోగించుకున్నారు. ఒక ప్రభుత్వ సంస్థను ఇలా బ్లాక్‌మెయిల్‌కు, బలవంతపు వసూళ్ళకు, దోపిడీకి దారుణంగా ఉపయోగించినందున ఇందుకు పాల్పడిన వారిని క్రిమినల్‌ నేరాల కింద ప్రాసిక్యూట్‌ చేయాలి.
అందువల్ల, ఎన్నికల ప్రణాళికలో సిపిఎం చేసిన ప్రతిపాదన చాలా సహేతుకంగా, అనుగుణంగా వుంది. మొదటగా, పిఎంఎల్‌ఎను రద్దు చేయాల్సి వుంది. తర్వాత కొత్త చట్టాన్ని రూపొందించాలి. మాదకద్రవ్యాల ద్వారా ఆర్జించిన ధనం దుర్వినియోగం కాకుండా, అంతర్జాతీయ పర్యవసానాలు కలిగిన మనీ లాండరింగ్‌ను ఆ కొత్త చట్టం కఠినంగా ఎదుర్కొనాలి.
ఇక రెండోది, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కోరలు పీకివేయాలి. దర్యాప్తు చేసే, చట్టాన్ని అమలు చేసే అధికారాలు కలిగిన సంస్థగానే దీన్ని వుంచాలి. రెవిన్యూ శాఖకు సంబంధించిన ఒక విభాగంగా మాత్రమే ఇది పనిచేయాలి. మాదకద్రవ్యాల అక్రమార్జన, అంతర్జాతీయ మనీ లాండరింగ్‌ను ట్రాక్‌ చేయడమనేది రెవిన్యూ శాఖ కర్తవ్యంగా వుండాలి. తాను సేకరించిన ఇంటెలిజెన్స్‌, సమాచారాన్ని సిబిఐ వంటి సంబంధిత లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలకు చర్యలు తీసుకునే నిమిత్తం అందచేయాలి.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలంటే ఈ రెండు కర్తవ్యాలు చేపట్టడం తప్పనిసరి.

/ ఏప్రిల్‌3 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం /

➡️