‘సంస్కృతంబులోని చక్కెర పాకంబు/ అరవ భాషలోని అమృతరాశి/ కన్నడంబులోని కస్తూరి వాసన/ కలిసిపోయె తేట తెలుగునందు’ అంటారు మిరియాల రామకృష్ణ. భారతదేశంలోని అతి ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు. లిపి వున్న 6 వేలకు పైగా భాషల్లో..అందమైన లిపివున్న రెండో భాష తెలుగు. 15వ శతాబ్దిలో వినుకొండ వల్లభ రాయుడు-‘జగతి దల్లికంటె సౌభాగ్య సంపద/ మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె’ అని తెలుగు ప్రాశస్త్యాన్ని కొనియాడినా..’తెలుగదేలయన్న దేశంబు తెలుగేను/ తెలుగు వల్లభుండ తెలుగొకండ/ ఎల్ల నృపులు గొల్వ ఎరుగవే బాసాడి/ దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కన్నడ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష కీర్తిని హిమాలయ శిఖరాగ్రాన నిలిపాడు. అయితే, గ్రాంథిక భాషలో వున్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి, వ్యవహారిక భాషలో వున్న సౌందర్యాన్ని, సౌలభ్యాన్ని తెలుగు భాష ఆవాహన చేసుకునేలా భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన మూలపురుషుడు గిడుగు రామ్మూర్తి. అందుకే- ‘గ్రాంథికమ్ము నెత్తిన పిడుగు గిడుగు/ వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు/ తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు/ కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు’ అన్నారు. పులిదిండి మహేశ్వర్.
మనిషి నుంచి పుట్టిన భాష… కేవలం మాటల వారధి మాత్రమే కాదు, మన మూలాలను తెలియజెప్పి, ముందుకు నడిపే సారథి. ఆట, పాట, మాట, సంగీతం, కళలు, పండుగలు, సంస్కృతీ సంపద్రాయాలు ఏవైనా భాష లేకుండా పెంపొందలేవు. మాతృభాష ఏదైనా…అది తల్లితో సమానం. తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేనట్లుగానే…అమ్మ భాషకూ ప్రత్యామ్నాయం లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి కోసం నేర్చుకోవాల్సి వచ్చిన ఆంగ్లభాష…స్థానికతను, ఉనికిని, మాతృభాషను మింగేసే స్థాయికి చేరింది. ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంజనీరింగ్, వైద్యశాస్త్రం వంటి కోర్సులన్నీ వారి స్థానిక భాషల్లోనే చెబుతున్నారు. విజ్ఞాన శాస్త్రాలను మాతృభాషలోనే చదువుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు 110 దేశాల కంటే మన తెలుగునేల పెద్దది. చాలా యూరోపియన్ భాషలు కూడా తెలుగుకంటే చిన్నవే. కానీ, వాటికున్న గౌరవ మర్యాదలు తెలుగు భాషకు ఇవ్వడంలేదు. వేరే దేశాల్లో, ప్రాంతాల్లో…తెలుగు వచ్చిన వారితో తెలుగులో మాట్లాడాలన్నా కూడా ఆత్మన్యూనతా భావానికి గురయ్యే పరిస్థితి తెలుగోళ్లది. ‘తెలుగువాడివై తెలుగు రాదనుచు/ సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా/ అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు/ సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అంటారు కాళోజీ. పరభాషా వ్యామోహంలో కొట్టుకుపోతూ…మాతృభాషను విస్మరించేవారికి ఇంతకంటే గొప్ప హెచ్చరిక ఏముంటుంది?
తెలుగులో చదవడం, మాట్లాడటం ఓ అభిరుచి కావాలి. కొత్త పదాల సృష్టి జరగాలి. తెలుగు భాషలో సహజంగా ఇమిడిపోయే పదాలను ఆహ్వానించాలి. తెలుగు భాషను నేర్చుకోవడం, తెలుగు సంస్కృతిని పెంపొందించుకోవడం తద్వారా తెలుగు భాషను బతికించుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత. ‘పరభాషా జ్ఞానాన్ని సంపాదించు/ కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు/ తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా/ తెలుగు మాట్లాడి వాళ్ల ఋణం/ తీర్చరా…’ అంటాడు సినీకవి చంద్రబోస్. ప్రజలు కార్పొరేట్ స్కూళ్ల మాయలో పడి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల ఆశల సౌధాల్లో చిక్కి…అటు మాతృభాష, ఇటు పరభాష-ఏదీ సరిగా నేర్చుకోలేని దుస్థితి నుంచి కాపాడాల్సిన బాధ్యత తెలుగు ప్రభుత్వాలదే. ప్రాథమిక స్థాయి నుంచే విద్యను మాతృభాషలో నేర్పించాలి. విజ్ఞాన శాస్త్రాలను తెలుగు భాషలోకి తర్జుమా చేయగలిగితే, తెలుగులోనే చదువుకునే అవకాశం లభిస్తుంది. పిల్లలకు మాతృభాషలో అందించే విజ్ఞానం తరతరాలకూ చేరుతుంది. గిడుగు వారి వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందించాల్సిన బాధ్యత మనది. ఆగస్టు 29 ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా వివిధ సంస్థలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవి తెలుగు భాష వికాసానికి దోహదపడతాయని ఆశిద్దాం.
