జీవో 117తో కష్టాలు…

Feb 7,2025 03:50 #117 GO, #Articles

గత ప్రభుత్వం జీవో 117 ద్వారా ఐదు ప్రధాన సమస్యలు సృష్టించింది. ప్రాథమిక పాఠశాలలను నిలువునా రెండు ముక్కలు చేసి 3, 4, 5 తరగతుల బాలబాలికలను ఉన్నత పాఠశాలలకు పంపింది. అత్యధిక సందర్భాల్లో ఉన్నత పాఠశాలలకు వెళ్ళిన విద్యార్థులు నిర్లక్ష్యానికి గురికాగా, 1, 2 రెండు తరగతులతో మిగిలిపోయిన ఫౌండేషన్‌ పాఠశాలలతో కలిపి సుమారు 15 వేల ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా దిగజారి పోయాయి. 1 నుంచి 8 వరకు ఉండే అత్యధిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య ఎనిమిది నుంచి నాలుగు లేదా ఐదుకు తగ్గించారు. ఆ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అత్యధిక ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు, పి.ఇ.టి పోస్టులు రద్దు చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విభాగాల్లో తరగతి గదిలో విద్యార్థుల గరిష్ఠ సంఖ్య వరుసగా 30, 35, 40/50 నుంచి వరుసగా 40, 52, 60గా మార్చారు. వారానికి ఉపాధ్యాయులు గరిష్టంగా బోధించాల్సిన పీరియడ్స్‌ 32 నుంచి 42కు పెంచారు. దీంతో విజయవంతంగా నడుస్తున్న ఎక్కువ నమోదుగల పాఠశాలలు అవసరమైన ఉపాధ్యాయ పోస్టులు కోల్పోయి నష్టపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సమాంతరంగా నడుస్తున్న మాతృభాషా మాధ్యమ విభాగాలు రద్దు చేశారు. జీవో 117ను రద్దు చేయమని అన్ని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్‌ చేశాయి. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి విషయంలో ‘కేంద్ర విద్యా హక్కు చట్టం’ తగిన స్థాయిలో లేదు. ఆపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ‘విద్యా హక్కు చట్టానికి మినహాయింపుగా’ ఇచ్చిన ఒక తీర్పును ఉపయోగించుకుని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థి నమోదు 20 వరకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడ్ని ఇస్తూ వచ్చారు. ఇప్పుడూ అందులో మార్పు లేదు. ఇక, నమోదు 21-40 స్లాబ్‌లో విద్యా హక్కు చట్టం ప్రకారం ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయి స్తున్నారు. ఇటీవల విడుదలైన మెమో ప్రకారం నమోదు 21-30 ఉన్న ఫౌండేషన్‌ పాఠశాలలకు (ఎల్‌.కె.జి, యు.కె.జి ఇంకా 1వ తరగతి, 2వ తరగతి) ఒక ఉపాధ్యాయుడినే కేటాయించడం ఒక కొత్త కత్తిరింపు. ఆదర్శ పాఠశాలల స్థాపన పేరున ఈ కత్తిరింపులు జరుగుతున్నాయి. నమోదు 41-60 ఉన్న ప్రాథమిక పాఠశాలలను బేసిక్‌ పాఠశాలలుగా పరిగణిస్తూ ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున మాత్రమే ఇవ్వబోతున్నట్లు ఇటీవలి మెమోను బట్టి తెలుస్తుంది. ఈ స్లాబ్‌లో మూడవ ఉపాధ్యాయుడ్ని ఎందుకివ్వకూడదు? ఈ స్లాబ్‌లో కనీసం ప్రతి పంచాయితీకి ఒక పాఠశాల ఉంటుంది. మూడవ పోస్టును కేటాయించి వాటిని బలపరచవచ్చు. ఇంకా బాలబాలికల నమోదు 40, 60, 90 దాటిన ప్రాథమిక పాఠశాల అన్నింటికీ విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పోస్టును అదనంగా ఇస్తే ప్రాథమిక స్థాయిలో సార్వత్రికంగా విద్యా ప్రమాణాలు పెరుగు తాయి. అత్యధిక పాఠశాలలు ఆదర్శ పాఠశాల వైపు అడుగులు వేయగలుగుతాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నమోదు కూడా పెరుగుతుంది.

– డా. ఎం. సురేష్‌ బాబు,
సెల్‌: 9989988912

➡️