డిజిటల్‌ అభ్యసన

Feb 25,2024 07:20 #Editorial

               ‘అక్షరంబు తల్లి యఖిలవిద్యల కెన్న/ నక్షరంబు లోక రక్షకంబు/ అక్షరంబు లేని యబలున కెందును/ భిక్ష పుట్టబోదు పృథ్విలోన’ అని ఒక చాటువు. జీవన వికాసానికి, పరిపూర్ణతకు అక్షరం ఓ గీటురాయి. అక్షరాస్యత మానవ ప్రగతికి దిక్సూచి. ‘మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో…మానవ ప్రగతికి చదువు కూడా అంతే అవసరం’ అని యునెస్కో నిర్వచించింది. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ప్రగతిపథంలో ఉందంటే అక్కడి అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశాలలో ప్రధానమైనది అక్షరాస్యత. ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల అక్షరాస్యతపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడంతా టెక్నాలజీ కాలం. మొత్తం ప్రపంచమే డిజిటల్‌ మయంగా మారింది. రోజువారీ జీవితంలో డిజిటల్‌ అక్షరాస్యత అనివార్యమవడంతో డిజిటల్‌ లెర్నింగ్‌నకూ ప్రాధాన్యత పెరిగింది. విజ్ఞానం, నైపుణ్యాలను పెంచుకునే క్రమంలో డిజిటల్‌ లెర్నింగ్‌ విప్లవాత్మక మార్పులకు తెరతీసింది. సాంకేతికత, ఇంటర్నెట్‌ పెరుగుదలతో పాటు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) విద్య మరింత ఇంటరాక్టివ్‌గా, ఆకర్షణీయంగా మారింది. డిజిటల్‌ లెర్నింగ్‌… సాంప్రదాయ విద్య రూపురేఖలను మార్చింది.

డిజిటల్‌ లెర్నింగ్‌ అనేది గొడుగు లాంటిది. ఆన్‌లైన్‌లో మనం నేర్చుకోవాలనుకున్న ప్రతిదానిలోనూ డిజిటల్‌ టెక్నాలజీ పాత్ర తప్పక ఉంటుంది. ఉదాహరణకు విద్యార్థులు ఆన్‌లైన్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ క్లాసులను వీడియో ద్వారా వీక్షించడం… ఉపాధ్యాయులు డిజిటల్‌ టూల్స్‌ (స్మార్ట్‌ బోర్డ్స్‌, టాబ్లెట్స్‌) ఆధారంగా బోధించడం వంటివి డిజిటల్‌ లెర్నింగ్‌ కిందకే వస్తాయి. టీచర్స్‌ కూడా ఆన్‌లైన్‌ వేదికగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆయా బోధనాంశాల్లో, పద్ధతుల్లో మరింత మెరుగుదలకు, ఆయా రంగాల్లో జరుగుతున్న మార్పులు, కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు, పరిణామాలు తెలుసుకోవడానికి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగపడుతుంది. ‘శాస్త్రం నీ అస్త్రం/ మౌనం శ్మశానం/ అదికాదు జ్ఞానం/ పరీక్షించు సహేతుకంగా’ అంటారు మహాకవి శ్రీశ్రీ. చదువుకోవాలనే ఆలోచన వుండాలేగాని ఆన్‌లైన్‌ విద్య వైపు విద్యార్థులనైనా, పెద్దలనైనా ప్రోత్సహించడానికి డిజిటల్‌ లెర్నింగ్‌ దోహదపడుతుంది. దీన్ని ప్రోత్సహించే లక్ష్యంతోనే ‘డిజిటల్‌ లెర్నింగ్‌ దినోత్సవం’ ప్రతియేడాది ఫిబ్రవరి చివరి గురువారం జరుపుకుంటారు. ‘టెక్నాలజీ కేవలం ఒక సాధనం. పిల్లలతో కలిసి పనిచేయడం, వారిని ప్రేరేపించడంలో ఉపాధ్యాయుడు అత్యంత కీలకం’ అంటాడు బిల్‌గేట్స్‌. నైపుణ్యం కలిగిన టీచర్‌… విద్యార్థులను ప్రభావంతంగా ప్రోత్సహించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాబోయే దశాబ్దాల్లో 90శాతం ఉద్యోగాలకు డిజిటల్‌ నైపుణ్యం అవసరమని భావిస్తున్నారు.

డిజిటల్‌ అభ్యాసం విద్యారంగాన్ని విప్లవాత్మకంగా మార్చగల శక్తివంతమైన సాధనం. ఓపెన్‌సోర్స్‌ సాంకేతికత, ఏఐ సాంకేతికత… డిజిటల్‌ లెర్నింగ్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాయి. డిజిటల్‌ లెర్నింగ్‌ విద్యకు సమాన అవకాశాలను అందిస్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరికీ సాంకేతికత, అందరికీ ఇంటర్నెట్‌ అందడం లేదు. టెక్‌ ఫెయిర్‌లు, డిజిటల్‌ అక్షరాస్యత వర్క్‌షాప్‌లు నిర్వహించడం, విద్యార్థులందరికీ డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం అవసరమైన సాంకేతికత, వనరులు అందుబాటులో ఉండేలా చూడడం ప్రభుత్వాల బాధ్యత. దాదాపు 140 కోట్ల మంది జనాభా వున్న భారత్‌లో ప్రస్తుతం 64.6 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. అక్షరాస్యత పరంగానే కాకుండా సాంకేతికతను ఉపయోగించడంలోను, డిజిటల్‌ లెర్నింగ్‌లోనూ కేరళ ప్రథమ స్థానంలో వుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఓపెన్‌సోర్స్‌ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా డిజిటల్‌ లెర్నింగ్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే ఇదొక విశేష విద్యావిధానం. ప్రతి ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లో తక్కువ ఖర్చుతో కంప్యూటర్‌ విద్యను అందించే అవకాశం వుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ‘డిజిటల్‌ లెర్నింగ్‌ డే’ దానికి నాంది కావాలి. ‘జీవితాశలే/ భావి జాడలోరు’ అంటారు శ్రీశ్రీ. విద్యార్థులకు సమర్థవంతమైన అభ్యాస అనుభావాన్ని అందించడచానికి సాంప్రదాయ విద్య, డిజిటల్‌ అభ్యాసం మధ్య సమతుల్యతను సాధించడం కీలకం.

➡️