డిజిటల్‌ కాలుష్యం – అణు విద్యుత్‌

‘వాతావరణ మార్పు’ గురించి మాట్లాడుకునే సందర్భాలలో, నూతన సాంకేతికతలైతే, తక్కువ కర్బన అడుగు జాడల్ని (కార్బన్‌ ఫుట్‌ ప్రింట్‌) వదులుతాయని అంటే తక్కువ కాలుష్య కారకాలుగా ఉంటాయని అనుకుంటాము. గ్రీన్‌ టెక్నాలజీల ముసుగులో ఈ సాంకేతికతలు చెలామణి అవుతుంటాయి. నీలి హైడ్రోజన్‌, నాచురల్‌ గ్యాస్‌ లాంటి ప్రత్యామ్నాయాల గురించి యూరప్‌లో, అమెరికాలో మాట్లాడుతూ ఉంటారు. మానవ జీవితాన్ని మారుస్తున్న, తీవ్రంగా మార్చబోతున్న ఈ సాంకేతికతలన్నీ (కంప్యూటర్‌ సాంకేతికతలు, ప్రక్రియలు లాంటివి) ఒక సగటు మనిషికి నిరపాయకరంగానే అనిపిస్తాయి. ఇవి కల్పించే సౌలభ్యంలో పడి, వీటి వల్ల వచ్చే కాలుష్యాలను, గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటి లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్‌ ఫోన్లు చాలా శక్తివంతమైనవి. ఎంత శక్తి అంటే, మనిషి చంద్రుడి పైకి వెళ్ళి, మళ్ళీ తిరిగి రావటానికి ఉపయోగపడిన ఒక గది అంత సైజు ఉండే కంప్యూటర్‌ కంటే కూడా, వందల రెట్లు శక్తివంతమైనవి. ఒక గంట సేపు చార్జి చేస్తే, ఎన్నో గంటల పాటు అవి పని చేయగలవు. వీటిలో సినిమాలు చూడొచ్చు. ప్రశ్నలు అడగొచ్చు. ఇప్పుడైతే, సెర్చ్‌ ఇంజిన్ల నుండే కాదు, మిలియన్ల బైట్ల సమాచారం ఉండే కృత్రిమ మేధ (ఏ.ఐ)ల నుండి కూడా ఆ జవాబులు పొందొచ్చు. ఈ కృత్రిమ మేధ సర్వవ్యాపితం. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వైద్యం, సినిమా, కళ, పరిశ్రమలు-అంతటా ఇదే. ఒక క్లిక్‌తో సమాచారం అందుబాటులోకి వచ్చేస్తుంది. అయితే ఇంత భారీ సమాచారం ఎక్కడ నిల్వ ఉంచి ఇస్తున్నారు? అనే అంశాన్ని ఎవరూ ఆలోచించడం లేదు. అలాగే క్రిప్టో కరెన్సీల విషయం కూడా. అమ్ముతున్నారు, కొంటున్నారు. కానీ వాటి తయారీపై ఆలోచన లేదు. పెద్ద పెద్ద సర్వర్లను వాడే కంపెనీలు, ఇప్పుడు పెద్ద పెద్ద క్లౌడ్‌ సర్వీసులను వాడుతున్నాయి. అవి ఎక్కడో ఉండి, మనకు కనపడకుండానే భారీ సమాచారాలను నిల్వ ఉంచుతున్నాయి. ఇదంతా చాలా అద్భుతంగా, ఒక కొత్త ప్రపంచం లాగా, నమ్మశక్యం కానంతగా అనిపిస్తుంది. పర్యావరణానికి ఎటువంటి హాని కూడా జరగదన్నట్టుగా, సున్నితంగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది. కానీ ఒక ప్రమాదకరమైన, భయానకమైన, వికారమైన వాస్తవాలు ఇందులో ఉన్నాయి.

ఉద్గారాలు

విద్యుత్‌ ఎక్కువగా వాడే కొద్దీ, ఎక్కువ ఉద్గారాలు వెలువడతాయి. కృత్రిమ మేధ, క్రిప్టో కరెన్సీలు, బిగ్‌ డేటాలకు చాలా ఎక్కువ విద్యుత్‌ వాడకం అవసరం అవుతుంది. వినియోగదారుల షాపింగ్‌ ప్రవర్తనల గుర్తింపు, ముఖ కవళికల గుర్తింపు, సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ ట్రాకింగ్‌- లాంటి వాటిల్లో చాలా ప్రాసెసింగ్‌ ఉంటుంది. ఈ ప్రక్రియ కంటికి కనిపించదు. కానీ పెద్ద పెద్ద సర్వర్లు, వాటిని ఉంచే పెద్ద పెద్ద భవనాలు, వాటికున్న బృహత్తరమైన కంప్యూటింగ్‌ శక్తి సామర్థ్యాలు, వాటిని చల్లబరిచేందుకు ఎంతో నీరు, పెద్ద పెద్ద ఫ్యాన్లు అవసరమవుతాయి. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్‌ వాడినప్పుడు, ఉద్గారాలు కూడా పెరుగుతాయి. పునరుత్పాదక శక్తి వాడినప్పుడు, శిలాజ వనరులు వాడినప్పటి కంటే తక్కువ ఉద్గారాలు వెలువడవచ్చు. కానీ వాటి వల్ల వచ్చే, అదనపు సమస్యలు వేరే ఉన్నాయి.

ఈమధ్య కాలంలో, డిజిటల్‌ ప్రపంచం నుంచి వెలువడుతున్న ఉద్గారాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2010 సంవత్సరంలో ఇంటర్నెట్‌తో అనుసంధానింపబడిన పరికరాలు 100 కోట్లు ఉంటే, 2025 వచ్చేసరికి 5000 కోట్లు, 2030 వచ్చేసరికి 10000 కోట్లు ఉంటాయని అంచనా. మొత్తం ప్రపంచ వ్యాప్త ఉద్గారాలలో డిజిటల్‌ రంగం నుండి వచ్చేవే, 3.5 శాతం దాకా ఉండొచ్చు. వైమానిక రంగం నుంచి వచ్చే ఉద్గారాలను (2.5 శాతం) ఇది ఇప్పుడు మించిపోయింది. వాస్తవిక కరెన్సీని అనుకరించే, దాదాపు సమానమనిపించే క్రిప్టో కరెన్సీని వెలికి తీయడానికి కూడా ఎంతో డేటా వినియోగం, శక్తి వినియోగం జరుగుతుంది. గ్లోబల్‌ ఉద్గారాలలో దీని వాటా 0.7 శాతం ఉంటుంది. వీటన్నింటిలో, ఉత్పత్తి ప్రక్రియల వల్ల సగం ఉద్గారాలు వెలువడితే, మరో సగం వినియోగం ద్వారా వెలువడతాయి. స్మార్ట్‌ ఫోన్ల వినియోగం, కత్రిమ మేధ వినియోగం పెరిగే కొద్దీ, ఎన్నో రెట్లు ఈ ఉద్గారాలు కూడా పెరుగుతాయి.

ఉద్గారాల లెక్కలు – సమస్యలు

ఈ ఉద్గారాలను సరిగ్గా లెక్కించాలంటే, అవసరమైన డేటాను పరిశ్రమలు ఇవ్వడం లేదు. ఇతర పరిశ్రమలలో ఉన్నట్టుగా, ఉద్గారాలకు సంబంధించిన ప్రామాణికరింపబడిన లెక్కలు కానీ, ప్రోటోకాల్స్‌ గాని ఇక్కడ లేవు. ప్రాసెసింగ్‌ ఎంత జరుగుతోందనే సమాచారం మాత్రం కొంత ఉంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా స్టోరేజ్‌, ఏ.ఐ ప్రాసెసింగ్‌ లాంటివి జరిగే డేటా సెంటర్లకు, క్రిప్టొ కరెన్సీ మైనింగ్‌లకూ అవసరమయ్యే విద్యుత్తు, ప్రపంచ విద్యుత్తు వినియోగంలో 2 శాతం దాకా ఉంటే, ఉద్గారాలు 1 శాతం వరకూ ఉండొచ్చు. అయితే ఇవన్నీ కూడా పాత లెక్కలే. పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఏ.ఐ సర్వీసులు, ఏ.ఐ సాఫ్ట్‌వేర్లు, హార్డ్‌వేర్ల విస్ఫోటానికి ముందు లెక్కలు ఇవన్నీ. ఈ మధ్య ఐఎంఎఫ్‌ ఒక లెక్క వేసింది. డేటా సెంటర్లు, క్రిప్టో కరెన్సీల వాటా ప్రపంచ విద్యుత్‌ వినియోగంలో 3.5 శాతం ఉండవచ్చని చెప్పింది. ఇది ఐదవ పెద్ద దేశమైన, జపాన్‌ విద్యుత్‌ వినియోగానికి దాదాపు సమానం. అయితే కచ్చితంగా లెక్క వేయడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. ప్రపంచంలోని ఎక్కడెక్కడి ప్రాంతాలకో డేటా ప్రాసెసింగ్‌ను, క్లౌడ్‌ స్టోరేజ్‌ను, ఔట్‌ సోర్స్‌ చేయడం లాంటి బిజినెస్‌ మోడళ్ల వల్ల కచ్చితమైన లెక్కలు సాధ్యం కావడం లేదు.

ఇదంతా డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన విషయం. కానీ డేటా వినియోగం, వైపు నుండి ఎంత ఉద్గారాలు వస్తాయనే విషయంలో చాలా తక్కువ అధ్యయనం ఉంది. ఈ మధ్య కాలంలోనే ఎం.ఐ.టి లాంటి చోట్ల కొన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఏ.ఐ ని ఉపయోగించి ఒక ఇమేజ్‌ను సృష్టించడానికి అయ్యే విద్యుత్తు, ఒక స్మార్ట్‌ ఫోన్‌ను పూర్తిగా చార్జ్‌ చేయడానికి అయ్యే విద్యుత్‌తో సమానమని అంటున్నారు. గూగుల్‌ సెర్చ్‌ కంటె చార్ట్‌ జిపిటి పదింతలు ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుందని అంటున్నారు. చాలా స్మార్ట్‌ ఫోన్లలో, ఏ.ఐ డిఫాల్ట్‌ ఆప్షన్‌గా ఉంది. అంటే గూగుల్‌ సెర్చ్‌కు అడ్డుపడుతుంది. సాధారణ సాఫ్ట్‌వేర్‌ కంటే ఈ ఏ.ఐ సాఫ్ట్‌వేర్‌ 33 రెట్లు ఎక్కువ విద్యుత్తును వాడుకుంటుంది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం అంచనా ప్రకారం, ఏ.ఐ కంప్యూటింగ్‌, ప్రతి వంద రోజులకు రెండింతలు పెరుగుతోంది.

బిగ్‌ ఫైవ్‌

విద్యుత్‌ వినియోగం, కాలుష్య ఉద్గారాల విషయంలో మొదటి ఐదు స్థానాల్లో పెద్ద కంపెనీల డేటా సెంటర్లే ఉన్నాయి. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, మెటా-ఈ ఐదు కంపెనీలూ అవడం పెద్ద ఆశ్చర్యం కాదు. రెండవ స్థానంలో ఉన్న యాపిల్‌ కంటే, మొదటి స్థానంలో ఉండే అమెజాన్‌ వెలువరించే ఉద్గారాలు రెండింతలు వుంటాయి. అయితే చాలా అధ్యయనాలు అమెజాన్‌ను వదిలేస్తాయి. ఎందుకంటే అమెజాన్‌ డేటా వినియోగం, కంప్యూటింగ్‌ మోడళ్లు విభిన్నంగా ఉండి, ఇతర కంపెనీలతో పోలిక కష్ట సాధ్యం చేస్తాయి. ద గార్డియన్‌ పత్రిక ఒక అధ్యయనం చేసింది. మిగిలిన నాలుగు కంపెనీలు (అమెజాన్‌ మినహా) అధికారికంగా ఇచ్చే లెక్కల కంటే, వాటి వాస్తవ ఉద్గారాలు 662 శాతం ఎక్కువ ఉంటాయని, ఆ అధ్యయనం చెబుతుంది. ఆ కంపెనీలు ఉపయోగించే ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతుల వల్ల, పారదర్శకం కానీ విధానాల వల్ల అసలైన లెక్కలు బయటకు రావడం లేదు. యాపిల్‌, మెటా ‘సృజనాత్మక’ పద్ధతులను ఉపయోగించి లెక్కల్ని దాస్తాయి. గూగుల్‌ 2030 వచ్చేసరికి తన డేటా సెంటర్లన్నింటా, సంపూర్ణంగా (22/7) రెన్యువల్‌ ఎనర్జీని ఉపయోగిస్తామని హామీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ కూడా ఇటువంటి నూరు శాతం హామీనే (100/100/0) ఇచ్చింది.

అణు విద్యుత్‌ రంగప్రవేశం

పారిశ్రామిక వాణిజ్య గృహ విద్యుత్‌ అవసరాలలో, రాత్రింబవళ్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ డేటా సెంటర్లు, ఏ.ఐ కోసం 24 గంటల విద్యుత్‌ సరఫరా సంవత్సరం పొడుగునా అవసరమవుతుంది. ఈ డిమాండు గ్రిడ్ల మీద విపరీతమైన భారాన్ని మోపుతుంది. అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. డేటా సెంటర్లకు చాలా హెచ్చుగా 800-900 ఎం.డబ్ల్యు.ఇ దాకా అవసరమవుతుంది. అందుకే వీటికి 24 గంటల హామీ ఉండే సొంత, శిలాజేతర విద్యుత్‌ వనరులు అవసరమవుతాయి. ఇటువంటి, నిరంతరాయ విద్యుత్తు, జల-వాయు-సౌర వనరుల ద్వారా సాధ్యం కాదు. ఇక్కడే అణు విద్యుత్తు రంగంలోకి ప్రవేశిస్తుంది. ఒక ఐదేళ్లకు ముందు ఎవరూ ఈ ఆలోచన చేయలేదు. ఈ మధ్యనే మైక్రోసాఫ్ట్‌, కన్సల్టేషన్‌ పవర్‌ అనే ఒక సంస్థతో 20 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే తీవ్రమైన ప్రమాదం జరిగిన ‘త్రీ మైల్‌’ అణు విద్యుత్‌ కేంద్రం నుండి విద్యుత్‌ను అందించే ఒప్పందం ఇది.
1979లో, అమెరికాలోనే అతి పెద్ద అణు ప్రమాదాలలో ఒకటి ఈ ప్లాంట్‌ లోనే (యూనిట్‌ 2) జరిగింది. 2019లో మూసివేసిన, సందేహాస్పదమైన యూనిట్‌ 1 నుండి ఇప్పుడు విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారు. అలాగే, అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌లు ఈ మార్చి నుండి పెన్సిల్వేనియా లోని ‘టాలెన్‌ ఎనర్జీస్‌’ అణు విద్యుత్‌ కేంద్రం నుండి 960 ఎం.డబ్ల్యు.ఇ ని కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు చిన్న చిన్న న్యూక్లియర్‌ రియాక్టర్ల వైపు ఆసక్తి పెరుగుతోంది. పెట్టుబడులు పెట్టడం వైపు, సాంకేతిక అభివృద్ధి వైపు ఆలోచనలు జరుగుతున్నాయి. అంటే దీని అర్థం ఏమిటి? ఇంటర్నెట్‌ భవిష్యత్తు అణుశక్తిపై ఆధారపడి ఉన్నదా? వేచి చూద్దాం.

 స్వేచ్ఛానువాదం

– రఘు

➡️