ఇటీవల కాలపు ప్రపంచ అతి పెద్ద ఆరోగ్య విపత్తు కోవిడ్ 19ని ఎదుర్కొని అప్పుడే ఐదేళ్లు గడిచిపోయాయి. 2020 మార్చి 11వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) కోవిడ్‌ని పెను విపత్తుగా ప్రకటించటంతో అన్ని దేశాలూ అప్రమత్తమయ్యాయి. దేశాల మధ్య, పట్టణాలు నగరాల మధ్య, గ్రామాల మధ్య, ఆఖరికి మనిషికీ మనిషికి మధ్య భౌతిక దూరం అనివార్యమై, కనీవినీ ఎరగని పరిస్థితి నెలకొంది. ఎల్లెడలా భయాందోళనలు అలముకున్నాయి. రోజువారీ జీవనం అస్తవ్యస్తమైపోయింది. మన దేశంలో మోడీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లూ చేయకుండానే లాక్‌డౌన్ ప్రకటించటంతో కోట్లాదిమంది వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షలాది మంది రోజుల తరబడి వందల కిలోమీటర్ల దూరం నడిచి, నానా ఇక్కట్లూ ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో దాహార్తికి నీరై, పగుళ్లు దేరిన కాళ్లకు చెప్పులై, నెత్తిన గొడుగులై, ఆకలికి ఇంత అన్నమై వలస జీవులను ఆదుకోవటానికి తోటి మనుషులు తోడై నిలిచిన తీరు గొప్ప మానవతా దృక్పథానికి అద్దం పట్టింది.
కోవిడ్ రెండో దశలో వ్యాధి ప్రభావం ఎక్కువై, మరణాలు సంభవించినప్పుడు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల ధనదాహం కంపరం పుట్టించింది. ఆధునిక వైద్య విజ్ఞానంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు కంచాలు వాయించమని, చప్పట్లు కొట్టమని, దీపాలు వెలిగించమని చేసిన ప్రహసనం ప్రపంచం ముందు నవ్వుల పాలైంది. విపత్తు తీవ్రతను తక్కువగా అంచనా వేసి, ప్రజల ప్రాణాలను పరిహాసం చేసిన దేశాధినేతల్లో అప్పటి, ఇప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నాడు. ఘోర విపత్తు సమయంలోనూ ఆరోపణలూ అత్యోక్తులతో కాలహరణం చేయడం మన పాలకుల దగ్గరా కనపడింది. ప్రమాద తీవ్రతను, మరణాలను దాచిపెట్టటానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. దేశంలో దాదాపు 4 లక్షల 74 వేల మంది మరణించారని మోడీ ప్రభుత్వం ప్రకటిస్తే- భారతదేశంలో మరణాల సంఖ్య 47 లక్షల వరకూ ఉందని డబ్ల్యుహెచ్‌ఒ వెల్లడించింది. విపత్తు వేళ దాపరికమూ, గొప్పల వ్యాఖ్యానమూ కొనసాగిస్తే- అవసరమైన చర్యలు చేపట్టడం సాధ్యం కాకుండాపోతుందని కోవిడ్ అనుభవం తేటతెల్లం చేసింది. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారీ, పంపిణీ విషయాల్లో సామ్రాజ్యవాద దేశాలు లాభాల దృష్టితో వ్యవహరించాయి. చిన్న దేశమైన సోషలిస్టు క్యూబా అందుకు భిన్నంగా వ్యాక్సిన్‌ను, తమ వైద్య బృందాల సేవలనూ పలు దేశాలకు నేరుగా అందించింది.
శాస్త్రవేత్తలు, వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు తదితరుల నిరంతర కృషితోనూ, సేవలతోనూ ప్రపంచం విజయవంతంగా కోవిడ్ మహమ్మారిని తిప్పికొట్టింది. వైద్య వైజ్ఞానిక రంగం ఇలాంటి విపత్తులను ఎదుర్కొని, పైచేయి సాధిస్తుందని మరోసారి రుజువైంది. వ్యవస్థలను, కుటుంబాలను కోవిడ్ అనేక విధాల నష్టపరిచినా చిట్టచివరకు దానినుంచి బయటపడి ముందుకు సాగటం మానవ సమాజ సమిష్టి విజయం.
అయితే, ఇలాంటి ఘోర ఆరోగ్య విపత్తు నుంచి దేశాలూ ప్రభుత్వాలూ ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాలి. వ్యవస్థలు కార్పొరేటు శక్తుల చేతుల్లో ఉండడం, స్వార్థం, బాధ్యతారాహిత్యం, పర్యావరణ హననం వంటివి విపత్తుల వేళ కష్టాలను మరింత పెంచుతాయని గ్రహించాలి. ప్రతి వైపరీత్యంలోనూ కాసులు గడించుకునే కార్పొరేట్ వ్యాపార నమూనా సర్వజన హితానికి ఏమాత్రమూ పనికి రాదని అర్థం చేసుకోవాలి. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఆదుకునేది, అస్త్రశస్త్రాలను అందించేది వైజ్ఞానిక శాస్త్రం, శాస్త్రీయమైన సమిష్టి ఆచరణ తప్ప- గతాలూ, వాటి గొప్పతనాలూ కానేకాదని ఒప్పుకోవాలి. కానీ, పాలకులకు అలాంటి పాఠాలు తలకెక్కినట్టు లేదు. ఆరోగ్య ఆపత్కాలంలో కీలకంగా వ్యవహరించాల్సిన ప్రపంచ ఆరోగ్య సంస్థను బలోపేతం చేసే బదులు దానిని నిర్వీర్యపర్చటానికే అమెరికా పూనుకుంటోంది. మనదేశంలోనూ విద్యా వైద్య వైజ్ఞానిక రంగాల్లో పరిశోధనలు పెంచి, ఆయా వ్యవస్థలను మెరుగుపర్చటానికి తగిన నిధుల కేటాయింపు జరగటం లేదు. విపత్తులు విరుచుకుపడ్డప్పుడు హడావిడి పడడం కాదు; అవి తలెత్తకుండా చూడడం, తారసపడితే తగు రీతిలో ఎదుర్కోవటం మన కర్తవ్యంగా ఉండాలి. ఇదే విపత్తుల నుంచి విజ్ఞులు నేర్వాల్సిన పాఠం!
