దశాబ్దకాలంలో అమలు జరగని విభజన హామీలు

Jun 1,2024 05:05 #edit page

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజించబడి 2024 జూన్‌ 2 నాటికి 10 సంవత్సరాలు పూర్తవుతాయి. 2014 జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా విభజించబడి, ఆ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది. విభజన కోసం భారత ప్రభుత్వం పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 లేక ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం చేసి, రెండు తెలుగు రాష్ట్రాలకు ఆ చట్టంలో అనేక హామీలు ఇచ్చింది. ఆ చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు దశాబ్ద కాలం అయినప్పటికీ అమలు జరగలేదు. ఈ చట్టంలో పొందుపరచిన హామీలకు, అమలుకు పదేళ్ల కాల పరిమితి విధించగా, ఆ గడువు జూన్‌ 2తో ముగుస్తుంది. ఆ గడువు పొడిగిస్తారా? లేదా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. విభజన చట్ట హామీలు అమలు జరగకపోవటానికి ప్రధాన ముద్దాయి కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన గల బిజెపి ప్రభుత్వమే. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్ట హామీలు అమలు జరపకుండా 5 కోట్ల ఆంధ్రులకు పూర్తి అన్యాయం చేసింది. దీనితో పాటు గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు, 2014-19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం, 2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వైఫల్యం చెందాయి. రెండు పార్టీలు నరేంద్రమోడీ ప్రభుత్వంతో అంటకాగాయి.
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్ట ఆమోద సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని ఆ నాటి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించారు. ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు ఇవ్వాలని నాటి రాజ్యసభలో బిజెపి నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు డిమాండ్‌ చేశారు. విభజన తరువాతి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు లేవు. అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ప్రత్యేక హోదా వలన పారిశ్రామిక, పన్నులు రాయితీలు లభించి రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని అనేక మంది భావించారు. 2014కు ముందు ప్రణాళికా సంఘం సిఫార్సులతో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించి, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి 70 వేల కోట్ల లబ్ధి జరుగుతుందని ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజీ దగా అర్ధం కావటానికి ఆయనకు రెండేళ్లు పట్టింది. 2024 ఎన్నికలలో ఆ దగా చేసిన వారితోనే మళ్లీ తెలుగు దేశం పార్టీ, జనసేన కలిసి ఎన్‌డిఎ కూటమిగా పోటీ చేయటం ఓ రాజకీయ విషాదం. 2019-24 మధ్య అధికారంలో కొనసాగుతున్న వె.ౖయస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు, దీక్షలు చేశారు. తనకు 25 మంది లోక్‌సభ సభ్యులను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రకటించారు. 22 మంది వైఎస్‌ఆర్‌ పార్టీ తరపున లోక్‌సభ సభ్యులుగా గెలుపొందారు. ప్రత్యేక హోదా సాధనలో పూర్తి వైఫల్యం చెంది, తమ వల్లకాదని చేతులు ఎత్తేశారు.
మౌలిక వసతులు, పరిశ్రమలు
విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో పారిశ్రామికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అనేక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పొందుపరిచారు. రాష్ట్రంలో దుగ్గరాజపట్నం వద్ద దశలవారీగా నూతన భారీ నౌకాశ్రయాన్ని నిర్మించి మొదటి దశ 2018 కల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. కడప జిల్లాలో సమగ్ర, భారీ ఉక్కు కర్మాగారం సెయిల్‌ సహకారంతో నిర్మించాలి. విశాఖపట్నంలో నూతన రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ ఫీల్డ్‌ ముడి చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో రసాయన సముదాయాన్ని నెలకొల్పాలి. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణ అవకాశాలు పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నుంచి హైదరాబాద్‌కు ర్యాపిడో రైలు, రోడ్డు అనుసంధానం చేయటానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నంలోనూ, విజయవాడ-గుంటూరు-తెనాలిలో మెట్రో రైలు సౌకర్యం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. 13వ షెడ్యూల్‌లో చేర్చిన మౌలిక వసతులు, పరిశ్రమలకు సంబంధించి ఒక్క అంశం కూడా అమలు జరగలేదు.
ఉమ్మడి ఆస్తుల విభజన
రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జనాభా నిష్పత్తి 58.32 : 41.68గా ఉన్నది. ఉమ్మడి ఆస్తులను అదే నిష్పత్తిలో పంచుకోవాలని ఈ చట్టం తెలిపింది. 9,10 షెడ్యూళ్లలో ఉమ్మడి ఆస్తులను, సంస్థలను గుర్తించారు. వీటి విభజన కోసం విశ్రాంత ఐ.ఎ.యస్‌ అధికారి శ్రీమతి షీలా బిడేను నియమించారు. ఆమె నాయకత్వంలో ఆస్తుల పంపిణీపై కొన్ని మార్గదర్శక సూత్రాలు రూపొందించి ప్రతిపాదనలు చేశారు. అవి ఇంతవరకు అమలు జరగలేదు. ఉమ్మడి ఆస్తులలో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ. లక్ష కోట్లు రావాలి. ఇంత వరకు రూపాయి కూడా రాలేదు. కేంద్రం ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు. ఆస్తుల పంపిణీలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా అన్యాయం చేసింది. విభజన చట్టం చేసి పదేళ్లు పూర్తి కావటంతో ఇప్పుడు ఆస్తుల పంపిణీ సందిగ్ధంలో పడింది. అసలు ఆస్తులను పంపిణీ చేస్తారా? లేదా? అని అనుమానం తలెత్తుతున్నది.
వెనుకబడిన జిల్లాల అభివృద్ధి
విభజన చట్టంలో సెక్షన్‌ 46 ప్రకారం రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలను మొత్తం 7 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించారు. వీటికి బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజ్‌ ఇచ్చి అభివృద్ధి చేస్తామని ఆ నాటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. అంటే ఈ జిల్లాలకు సుమారు 24 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. కానీ ఆచరణలో మూడేళ్లపాటు రూ.1050 కోట్లు మాత్రమే విదిల్చారు. 2015, 2016, 2017 సంవత్సరాలలో ఏడాదికి రూ.350 కోట్లు చొప్పున ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఊసేలేదు.
రాజధాని నిర్మాణం
విభజన చట్టంలో సెక్షన్‌ 94(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణం కోసం కావలసిన సౌకర్యాలు సృష్టించటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇవ్వాలి. దీనికి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం రూ.42,935 కోట్లు అంచనా వేసి నివేదిక ఇచ్చింది. కేంద్రం కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2015 అక్టోబర్‌ 22న రాజధానికి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడి రాష్ట్రానికి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి మాత్రమే అందించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూ సమీకరణ చేసి తాత్కాలిక రాజధాని భవనాలు మాత్రమే నిర్మించింది. వై.యస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల వివాదాన్ని తెచ్చి అమరావతిలో రాజధాని నిర్మాణానికే ప్రయత్నించలేదు. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగింది. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం నాటకాలు కొనసాగించింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలివ్వకుండా ఇప్పటికీ అదే నాటకాన్ని కొనసాగిస్తున్నది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
విభజన చట్టంలో సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపడుతుందని చట్టంలో తెలిపారు. పర్యావరణ, అటవీ, పునరావాస, పునర్నిర్మాణ అనుమతులకు కేంద్రానిదే బాధ్యత అని పేర్కొన్నారు. 2017-18 సవరించిన అంచనా మొత్తం రూ.55,656 కోట్లుగా పేర్కొన్నారు. దీనిలో భూసేకరణకు, పునరావాసానికి రూ.33 వేల కోట్లు ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడం అతి పెద్ద అంశం. 373 గ్రామాలలో 1,05,000 కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయి. ఇప్పటికీ కేవలం 7 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం జరిగి కేవలం రూ. 7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పునరావాసం జరగకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదు. గత ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రెండూ పునరావాసాన్ని నిర్లక్ష్యం చేశాయి. కేంద్ర ప్రభుత్వం పునరావాసానికి బాధ్యత వహించాలని విభజన చట్టం తెలపగా, పునరావాస నిధులతో మాకు సంబంధం లేదని కేంద్రం చెబుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రెండు ప్రాంతీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పునరావాసానికి కేంద్రం నిధులు ఇస్తేనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది.
అదేవిధంగా కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు నీటి పంపకాలపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. కేంద్రం నీటి వివాదాలను పరిష్కరించే బదులు విద్వేషాలను రెచ్చగొడుతున్నది. అంతర్జాతీయ జల న్యాయ సూత్రాల ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ జరగవలసిన అవసరం ఉన్నది.
జాతీయ విద్యాసంస్థలు
2014లో విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విద్యాసంస్థలు లేవు. విభజన చట్టంలో 13వ షెడ్యూల్‌లో జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఐ.ఐ.టి తిరుపతిలో, ఐ.ఐ.యమ్‌ విశాఖపట్నంలో, సెంట్రల్‌ యూనివర్శిటీ అనంతపురంలో, గిరిజన యూనివర్శిటీ విజయనగరంలో, యన్‌.ఐ.టి తాడేపల్లిగూడెంలో, ఎయిమ్స్‌ మంగళగిరిలో, వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరులో, పెట్రోలియం యూనివర్శిటీ విశాఖపట్నంలో ప్రతిపాదించారు. వీటిలో కొన్నింటిని ప్రారంభించారు. ఈ 11 జాతీయ విద్యాసంస్థలకు ఇప్పటికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ కేవలం 3 వేల కోట్లు ఖర్చుచేశారు. దీనితో ఈ సంస్థలు వివిధ ప్రాంతాలలో అద్దె భవనాలలో నడుస్తున్నాయి. భవనాలు నిర్మించాలన్నా, నిర్మాణానికి స్థల సేకరణ జరగాలన్నా నిధులు అవసరం. నిధులు లేక ఈ విద్యాసంస్థలలో మౌలిక వసతులు లోపించి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కారకులెవరు?
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి దోహదపడే విభజన చట్ట అంశాలు అమలు జరగలేదు. గత పదేళ్లుగా పారిశ్రామికాభివృద్ధి లేక ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. 2024 జూన్‌ 2తో ఆ గడువు ముగుస్తున్నది. విభజన చట్ట హామీలు అమలు జరగక పోవటానికి నరేంద్రమోడీ ప్రభుత్వంతో పాటు గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు కూడా కారకులే. 2024 మే 13న జరిగిన ఎన్నికలలో ప్రత్యేక హోదా గురించి కానీ, విభజన హామీల అమలు గురించి కానీ యన్‌.డి.ఎ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు ఎటువంటి ప్రస్తావన చేయకపోవడం దుర్మార్గమైన విషయం. అలాగే వై.యస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రచారంలో గానీ, ఎన్నికల ప్రణాళికలో గానీ వీటిని పేర్కొనకపోవటం అత్యంత దుర్మార్గం. అదే సమయంలో ‘ఇండియా’ వేదిక, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు అమలు చేస్తామని స్పష్టంగా ప్రకటించింది.
ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దటానికి ప్రజాభిప్రాయం కూడగట్టడం అవసరం. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పౌరసమాజం ద్వారా ఈ కృషిని చేయవలసిన అవసరమున్నది.

కె.యస్‌.లక్ష్మణరావు
/ వ్యాసకర్త ఎమ్మెల్సీ, సెల్‌ : 83099 65083/

➡️