గ్రామీణ పేదలకు అండగా ఉంటున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ఉసురు తీయాలని చూడటం అమానుషం. ఈ ఏడాది మార్చి 21 నాటికి రూ.26 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా కేంద్రంలోని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మీనమీషాలు లెక్కిస్తోంది. అందులో మన రాష్ట్రానికి రావాల్సిన బకాయి రూ.2,030 కోట్లు. కేరళకు రూ.1,055 కోట్లు, తమిళనాడుకు రూ.3,725 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌కు రూ.3,668 కోట్లు, బీహార్‌కు రూ.2,849 కోట్లు..ఇలా…దాదాపు అన్ని రాష్ట్రాలకూ బకాయిలున్నాయి. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ఈ ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రధాని అనుంగు మిత్రుడు గౌతమ్ అదానీ కుటుంబ సంపద ఈ ఏడాది అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు పెరిగి, ఆసియాలో రెండో సంపన్నుడిగా కొనసాగుతున్నాడు. మన దేశంలోని 284 మంది బిలియనీర్ల చేతిలో భారత జిడిపిలో దాదాపు మూడింట ఒక వంతు సంపద అంటే రూ.98 లక్షల కోట్లు పేరుకుపోయింది. కార్పొరేట్లకు సమస్త వనరులనూ కట్టబెడుతుండటంతోపాటు రూ.16 లక్షల కోట్లు బ్యాంకుల నుంచే దోచిపెట్టిన మోడీ ప్రభుత్వం ఎందుకు ‘ఉపాధి’ బకాయిల చెల్లింపులో జాప్యం చూపుతోంది?
వామపక్షాల చొరవతో యుపిఎ-1 హయాంలో 2005లో ఉపాధి హామీ చట్టం రూపుదాల్చింది. గ్రామీణ పేదలకు కనీసం వంద రోజుల ఉపాధికి హామీ ఇవ్వాలనేది ఈ చట్టం ప్రధానోద్దేశం. బిజెపి, మోడీ అప్పట్లో బహిరంగంగానే ఈ చట్టంపై విమర్శలు గుప్పించారు. ఉపాధి హామీ చట్టం ఒక హక్కు. లబ్ధిదారులు ప్రజల ఉమ్మడి సంపద సృష్టికర్తలు. చేసిన పనికి ప్రతిఫలం పొందుతారు. ఎవరికీ కృతజ్ఞత చూపవలసిన అవసరమూ లేదు. వారికి బేరమాడే శక్తీ వస్తుంది. ఈ విధమైన హక్కులు పేదల ఆత్మగౌరవాన్ని పెంచడంతోపాటు సాధికారతనూ కల్పిస్తాయి. ప్రజల వద్ద ఏ అధికారమూ ఉండటం బిజెపికి ఎంతమాత్రం నచ్చదు. అందుకే ఉపాధి హామీ చట్టం మీద దాడి కొనసాగుతూనే ఉంది.
ఉపాధి హామీ చట్టం ప్రకారం వేతన బకాయిలను పని ముగిసిన తరువాత 15 రోజుల్లో చెల్లించాలి. ఆలస్యమైతే రోజుకు 0.05 శాతం చొప్పున పరిహారం చెల్లించాలి. గ్రామ పంచాయతీ లేదా జిల్లా అధికారికి ఫిర్యాదు చేయొచ్చు. పనే కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇంతవరకూ పరిహారం గాని, నిరుద్యోగ భృతి కానీ చెల్లించలేదు. ఇది చట్టాన్ని దారుణంగా అతిక్రమించడమే. వేతనాల చెల్లింపులో విపరీతమైన జాప్యం చేయడం ఈ పనుల పట్ల కూలీల్లో విముఖత పెంచి, చట్టాన్ని దెబ్బతీసే వ్యూహమే! ఉపాధి పనుల్లో మెటీరియల్ కాంపొనెంట్ నిధులను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచి యంత్రాల పనులుగా ఇప్పటికే మార్చేసింది. ఇప్పుడు రావాల్సిన బకాయిల్లోనూ కార్మికుల వేతనాల కింద రూ.15,277 కోట్లు, సామగ్రి, పాలనా ఖర్చుల కింద రూ.10,820.23 కోట్లు ఉన్నాయి. చట్టం హామీ ఇచ్చిన వంద రోజుల నుంచి 34 రోజులకు వ్యవసాయ కార్మికుల పనిదినాలు పడిపోయాయి. ఏడాది కాలంలోనే దేశంలో ఆరు కోట్ల జాబ్‌కార్డులను రద్దు చేసింది. కేంద్ర బడ్జెట్ పెరుగుతున్నా ఉపాధి చట్టానికి మూడేళ్లుగా కేటాయింపులు పెంచకపోగా, రూ.86 వేల కోట్లకే పరిమితం చేసింది. రోజుకు రూ.345 కూలి చెల్లించాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సు కాగితాలకే పరిమితమైంది. ఎన్‌సి, ఎస్‌టి, బిసి, అగ్రవర్ణాల గ్రామీణ పేదలు ఉపాధి దెబ్బతింటోంది. చట్టం సమర్థవంతంగా అమలు చేయాలంటే రూ.2.5 లక్షల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉన్నా… కేంద్రంలోని ఎన్‌డిఎకు పట్టడం లేదు. ప్రతిపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు పార్లమెంట్ లోపలా, బయటా ఆందోళన చేస్తున్నా మీనమేషాలు లెక్కిస్తోంది. బకాయిల కోసం కేరళ, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై పోరాడుతున్నాయి. మోడీ ప్రభుత్వ బాటలోనే మన రాష్ట్రంలోనూ వివిధ కారణాలు చూపుతూ 13 లక్షల జాబ్‌కార్డులు తగ్గించారు. మరింతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక అగ్రశక్తిగా ఎదుగుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కారు ఇకనైనా ‘ఉపాధి’ బకాయిలన్నీ చెల్లించాలి. వీటిపై మరింత సంఘటితంగా గ్రామీణ పేదలు పోరాడేందుకు సహకరించాల్సిన బాధ్యత అందరిదీ.
