స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా లక్ష్యంగా మహారాష్ట్రలోని పాలక పక్షం, దాని అనుచర గణాలు చెలరేగిపోతున్న తీరు దారుణం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాధ్ షిండేపై కునాల్ కమ్రా చేసిన వ్యంగ్య వ్యాఖ్యను ఏ మాత్రం సహించలేని అధికారంలో ఉన్న ఎన్‌డిఎ కూటమి హింసాత్మక చర్యలకు దిగింది. ఆయన ప్రదర్శన చేసిన హేబిటేట్ స్టూడియోపై పాలక కూటమి గూండాలు ఒకవైపు దాడి చేయగా, మరోవైపు మున్సిపల్ అధికారులు స్టూడియోలోని పలు భాగాలను కూల్చివేశారు. కమ్రాను అడ్డగించడం, బెదిరించడంతో పాటు ఆయనపై అనేక కేసులను పోలీసులు నమోదు చేశారు. విమర్శను సహించలేని కూటమి ప్రభుత్వం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ బరితెగింపు చర్యలు నిస్సందేహంగా కక్ష సాధింపు మాత్రమే గాక, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడమే! ప్రజాస్వామ్యంలో విమర్శకు ఎంతో ప్రాధాన్యత ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనదైన శైలిలో సూక్తిముక్తావళి పఠించిన కొద్ది రోజుల్లోనే ఆయన నేతృత్వంలోని కూటమి పాలించే రాష్ట్రంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం మాటలకు, చేతలకు పొంతన లేని తనానికి నిదర్శనం. బిజెపి, ఎన్‌డిఎ కూటమి పాలనలోని రాష్ట్రాల్లో ఒక దాని తరువాత ఒకటిగా చోటుచేసుకుంటున్న ఈ తరహా పరిణామాలు అక్కడి ప్రభుత్వాలు మూకహింసనే చట్టంగా మార్చుకుంటూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న తీరుకు తార్కాణాలు.
పెద్దగా పేరులేని ఒక రాజకీయ నాయకుడి ఎదుగుదలను వివరిస్తూ సాగిన హిందీ సినిమా పాటను తన ప్రదర్శనలో అనుకరించిన కునాల్ గద్దార్ (ద్రోహి) అనే పదాన్ని ఉపయోగించారు. దీనిని ఏమాత్రం సహించలేని అక్కడి పాలకపక్షం, తన అధికారాన్ని ఉపయోగించడంతో పాటు, గూండాలను ఆయనపైకి ఉసిగొల్పుతోంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శాసనసభ వేదికగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేశారు. ఆయన సమక్షంలోనే శివసేన ఎంఎల్‌ఏ ముర్జి పటేల్ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే కునాల్ కమ్రాను వీధుల్లోకి తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. ఆ వెంటనే వరుస సంఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ముంబయి పోలీసులు కమ్రాపై భారతీయ న్యాయ సంహిత కింద ప్రజలకు హాని కలిగించడం, వారి మధ్య శత్రుత్వాన్ని రగిలించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కమ్రా చేసిన వ్యాఖ్యకు ప్రజలకు హాని కలిగించడం ఏమిటో అర్ధం కాదు. పరువు నష్టం సెక్షన్ల కింద కూడా ముంబయి పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత హోదాలో వ్యక్తులు మాత్రమే పెట్టవలసిన ఈ కేసును పోలీసులు ఎలా నమోదు చేస్తారన్న ప్రశ్నకు వారి వద్ద నుండి సమాధానం లేదు. ఈ కేసుల తతంగం ఒకవైపు నడుస్తుండగానే మరోవైపు గూండాల గుంపు ఒకటి కమ్రా ప్రదర్శన ఇచ్చిన హేబిటేట్ వేదికపై విరుచుకుపడి ధ్వంసం చేసింది. ఈ విధ్వంసకాండ జరుగుతుండగానే రంగ ప్రవేశం చేసిన బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తన వంతు విధ్వంసాన్ని పూర్తి చేసింది. ఆ వేదికకు సంబంధించిన కట్టడంలో మిగిలిన అక్రమాలను కూడా వెలికి తీసి కూల్చివేస్తామని ప్రకటించింది.
రాజకీయల్లో ఈ తరహా విమర్శ కొత్త కాదు. పార్టీ ఫిరాయింపు సంఘటనల్లో ఇటువంటి మాటలు వినపడుతుంటాయి. ఇప్పుడు షిండే కొమ్ము కాస్తున్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత అజిత్ పవార్ సైతం తన ప్రత్యుర్థులనుద్దేశించి గతంలో ఈ ద్రోహ పదాన్ని ఉపయోగించిన విషయాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఇక రాజకీయాలపై జరిగే కళాత్మక ప్రదర్శనల్లో వ్యంగ్యం చోటుచేసుకోవడం అసాధారణమేమీ కాదు. ఇటువంటి కారణాల చేతనే బహిరంగ క్షమాపణ చెప్పాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను కునాల్ కమ్రా తిరస్కరించారు. అదే సమయంలో చట్టబద్ధమైన దర్యాప్తునకు సహకరిస్తానని, కోర్టులు ఆదేశిస్తే క్షమాపణ చెబుతానని ఆయన ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏకపక్ష, కక్ష సాధింపు చర్యలు మానుకొని, కమ్రాపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. అప్పటి వరకు కమ్రాకు బాసటగా నిలవడం ద్వారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత! అక్రమ కేసులు, దాడులు, నిర్బంధంతో కళాకారుల గొంతు నొక్కడం అసాధ్యమన్న విషయాన్ని ఎన్‌డిఎ నేతలు గమనించాలి.
