జనాభా తగ్గకుండా ఉండాలంటే ప్రతి మహిళ కనీసం ముగ్గురు పిల్లలను కనాలని ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ నాగపూర్‌లో జరిగిన ఒక సభలో చేసిన వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. అదానీ లంచాలపై మోడీ నోరు విప్పాలంటూ పార్లమెంటును స్థంభింప చేయటం, ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం, దిగజారిన జిడిపి వంటి అనేక సమస్యలు చుట్టుముడుతుండగా వాటి మీద నోరెత్తకుండా ఒక సమావేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న పిలుపు ఇవ్వటం ఏమిటన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడించినట్లు జనాభా తగ్గుదల, వృద్ధుల పెరుగుదల గురించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యల పూర్వ రంగంలోనే ఇలా మాట్లాడినట్లు ఒక వర్గపు మీడియా భాష్యం చెప్పింది. అసలు విషయం ఏమంటే ఇద్దరు సిఎంలు చెప్పింది మొత్తంగా వృద్ధులు పెరుగుతున్నారని, దాన్ని అవకాశంగా తీసుకొని మోహన్ భగవత్ హిందువులు తగ్గిపోతున్నారని, పెంచాలనే నేపథ్యంలో మాట్లాడారు. జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తగ్గితే ఎవరూ నాశనం చేయకుండానే సమాజం అంతరించి పోతుందని భగవత్ చెప్పారు.0.1 సంతానం ఉండదు గనుక ముగ్గురు ఉండాలన్నారు. సంతానోత్పత్తి రేటు అంటే ఒక మహిళ జీవిత కాలంలో ఎంత మంది పిల్లలకు జన్మనిచ్చిందో తెలిపే సగటు. ఇది దేశాలను బట్టి, దేశంలోనే ప్రాంతాలు, విశ్వాసాలు, ఇతర అనేక అంశాలను బట్టి మారుతూ ఉంటుంది. అన్నింటినీ కలిపితే ప్రపంచ సగటు వస్తుంది. జనాభా పెరుగుదల లేదా తగ్గుదల గురించి ఎవరైనా తమ వైఖరిని చెప్పవచ్చు. కానీ దానికి మతాన్ని ముడిపెట్టటమే అసలు సమస్య. ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి 2022 అక్టోబరులో జనాభా అదుపునకు సమగ్ర విధానం ఉండాలని, మత ప్రాతిపదికన అసమతూకం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
హిందూ మతం బతికి బట్టకట్టాలంటే హిందువులు పది మంది పిల్లలను కనాలని ఆర్‌ఎస్‌ఎస్ గుంపుకు చెందిన విశ్వహిందూ పరిషత్ నేతలు పిలుపు ఇచ్చారు (ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2015 జనవరి 19 లక్నో). ఆ సంస్థ ఏర్పాటు చేసిన ఒక సభలో దాని అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ హిందూ మతం పెరగాలంటే ఎనిమిది నుంచి పది మంది పిల్లలను కనాలని చెప్పారు. బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ నలుగురిని కనాలన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా 2006 ఏప్రిల్ 20వ తేదీన ”కాషాయ జనాభా శాస్త్రం” పేరుతో ప్రచురించిన విశ్లేషణ వివరాల ప్రకారం అదే సంస్థ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ 2004లో మాట్లాడుతూ హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనకపోవటం ఆత్మహత్యా సదృశ్యమన్నారు. కుటుంబ నియంత్రణ పాటించ కూడదన్నారు. కుటుంబ నియంత్రణ అన్నది హిందువులకు ఇంకేమాత్రం వ్యక్తిగత సమస్య కాదని, ఒక బిడ్డ చాలని వారు అనుకుంటే ముస్లింలు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని విశ్వహిందూ పరిషత్ నేత చంపత్ రారు 2015లో ఒక పత్రికా గోష్టిలో చెప్పారు. చిత్రం ఏమిటంటే ఇదే విహెచ్‌పి కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటి వరకు ఏకరూప పౌరస్మృతిని అమలు జరపాలన్న వారు జనాభా నియంత్రణ అందరికీ ఒకే విధంగా ఉండాలని, ఇద్దరు పిల్లలకు మించి ఏ మతం వారూ కనకూడదని చెబుతోంది. ”ఆర్గనైజర్‌లో రాసిన తరువాత ఉమ్మడి జనాభా విధానం, ఏకరూప పౌరస్మృతి ప్రకారం అందరికీ ఇద్దరు పిల్లల నియమం ఉండాలని కోరుతున్న విహెచ్‌పి” అనే శీర్షికతో 2024 జులై 11న ”ది ప్రింట్” ఆన్‌లైన్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. జనాభా అసమ తూకాన్ని నిరోధించాలని, ముస్లిం జనాభా పెరుగుదల గణనీయంగా ఉండటమే దీనికి కారణమని ఆర్గనైజర్ (ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక) సంపాదకీయం లంకె పెట్టిందని దానిలో వ్యాఖ్యానించారు. విహెచ్‌పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ఆ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ఏకరూప పౌరస్మృతిలో ఇద్దరు పిల్లల నిబంధన కూడా చేర్చాలన్నారు.
హిందూ జాతి అంతరిస్తున్నదని, మతానికి ముప్పు వచ్చిందని, త్వరలో ముస్లిం జనాభా మెజారిటీగా మారుతుందని హిందూ మహాసభ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ నాయకులంతా పదే పదే చేస్తున్న గోబెల్స్ ప్రచారం తెలిసిందే. అయితే మోహన్ భగవత్ కనీసం ముగ్గుర్ని కనాలంటూ సంఖ్యను తగ్గించారు. గతంలో మాదిరి డజన్ల కొద్దీ సంతానాన్ని కని హిందూ మతాన్ని పెంచాలంటే మొదటికే మోసం వస్తుందని, ఉన్న ఆదరణ కోల్పోతామన్న భయంతోనే ఇలా మాట్లాడుతున్నారన్నది స్పష్టం. జనాభా నియంత్రణ విధానంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఇతర పద్ధతులను మన ప్రభుత్వాలు ప్రోత్సహించాయి తప్ప ఒక్క హిందువులు మాత్రమే పాటించాలని, ముస్లింలు, ఇతర మతాలవారికి మినహాయింపులు ఇచ్చినట్లు చెప్పలేదు. అది కూడా స్వచ్ఛందం తప్ప ఎలాంటి నిర్బంధం చేయలేదు. మరి కాషాయ దళాలు దాన్ని ఎందుకు వక్రీకరిస్తున్నట్లు? అన్ని మతాల వారికి ఇద్దరిని మించి కనగూడదని నిబంధనలు పెట్టాలని ఎందుకు కోరుతున్నట్లు? జనాభా సమ తూకం అంటే వీరి దృష్టిలో ఏమిటి? ఏ మతం వారు ఎందరుంటే సమ తూకం ఉంటుంది? అంటే వీరు చెప్పినట్లే జనం మతాన్ని పాటించాలి, ఎందరు పిల్లల్ని కనమంటే ఆ సంఖ్యలోనే కనాలి. ఇలాంటి వారిని సహిస్తే రానున్న రోజుల్లో ఏ కులం వారు ఎంత మంది ఉండాలో కూడా వీరే నిర్దేశిస్తారన్నమాట!
ఇంతకీ ముగ్గురు పిల్లలను కనాలని కేవలం హిందువులకే చెబుతున్నారా లేక జనాభా మొత్తానికా అన్నది మోహన్ భగవత్ చెప్పలేదు. ముస్లింలు, నాలుగు వివాహాలు చేసుకొని ఎక్కువ మందిని కని హిందూ జనాభాను మించిపోవాలని చూస్తున్నారన్న ప్రచారం వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాలలో చేస్తున్నది హిందూత్వ శక్తులే అని వేరే చెప్పనవసరం లేదు. ఇది నిజమా ? ఈ గుంపు మాటలు వాస్తవమైతే భారత్ ఎప్పుడో ముస్లిం మతస్తులతో నిండిపోయి ఉండాల్సింది. భారత ఉపఖండంలోకి ముస్లింలు, ఇస్లాం మత రాక క్రీస్తుశకం 7వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. పన్నెండు వందల నుంచి 1,700 శతాబ్దం వరకు ఐదు వందల సంవత్సరాల పాటు ముస్లిం రాజుల పాలన సాగింది. తరువాత రెండు వందల సంవత్సరాలు క్రైస్తవులైన ఆంగ్లేయుల పాలన ఉంది. అయినప్పటికీ భారత్‌లో ఇప్పటికీ 80 శాతం మంది హిందువులే ఉన్నారు. బలవంతపు మత మార్పిడులు చేశారని, ఎక్కువ మంది పిల్లలను కన్నారని చెప్పిన తరువాత పరిస్థితి ఇది. ఆ ప్రచారం ఇప్పటికీ కొనసాగుతున్నందున హిందూ మతాన్ని నిలబెట్టేందుకే ముగ్గురు పిల్లలను కనాలన్నది మోహన్ భగవత్ మాటలకు అర్ధం. ఎందుకంటే ఇదే భగవత్ 2022 అక్టోబరులో అందరికీ వర్తించే సమగ్ర జనాభా విధానం కావాలంటూనే మత ప్రాతిపదికన అసమతూకం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో జనాభా పెరుగుదలను మత కోణంలో చూడటం అవాంఛనీయ వైఖరి.
ఇదే గనుక వాస్తవమైతే ముస్లిం ఛాందసులు అధికారంలో ఉన్న ఇరాన్‌లో సంతానోత్పత్తి రేటు ఏడాదికేడాది ఎందుకు తగ్గుతున్నదో ఎవరైనా చెప్పగలరా? విద్య, పట్టణీకరణ, ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, శిశుమరణాలు తదితర పరిస్థితులను బట్టి తప్ప ప్రపంచంలో ఎక్కడా మత ప్రాతిపదికన పిల్లలను కనటం లేదు. తమ ఉన్మాద చర్యలకు ఉపయోగించుకోవటం తప్ప ఏ మతమూ పిల్లల బాగోగులకు బాధ్యత తీసుకోవటం లేదు. 2023లో దక్షిణ కొరియాలో సంతానోత్పత్తి 0.7 ఉండగా ఆఫ్రికాలోని నైగర్‌లో 6.1 ఉంది. ఆర్థికాభివృద్ధి, విద్య, పట్టణీకరణ తదితర అనేక అంశాలు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన 1,800 సంవత్సర ప్రారంభంలో ప్రపంచంలో 4.5 నుంచి 7.5 వరకు ఉంది, 1960 దశకంలో ఐదు ఉండగా 2023 నాటికి 2.3కు తగ్గింది. 2,100 నాటికి 1.8కి తగ్గుతుందని అంచనా. ఇతర అన్ని దేశాలలో మాదిరే మనదేశంలో కూడా అన్ని చోట్లా ఒకే విధంగా లేదు. కొన్ని వివరాలు చూద్దాం. 2019-21లో జరిగిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో సంతానోత్పత్తి రేటు 2.1 ఉంటే దక్షిణాది రాష్ట్రాలలో 1.64, ఉత్తరాదిన 2.0, పశ్చిమాన 1.81, తూర్పున 2.0, మధ్య ప్రాంతంలో 2.1 ఈశాన్య ప్రాంతంలో 2.15 ఉంది. రాష్ట్రాలన్నింటా ఒకే విధంగా లేదు. బీహార్‌లో 3.02 పక్కనే ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో 2.38, దాన్నుంచి ఏర్పాటు చేసిన ఉత్తరాఖండ్‌లో 1.87, పశ్చిమ బెంగాల్‌లో 1.56 పక్కనే ఉన్న ఒడిషాలో 2.14 చొప్పున ఉంది. ఒకే రాష్ట్రంలో చూస్తే గుజరాత్ గ్రామీణంలో 2.15, పట్టణాల్లో 1.63, మధ్యప్రదేశ్‌లో 2.23-1.62, తెలంగాణలో 1.95-1.63, ఆంధ్రప్రదేశ్‌లో 1.74-1.62 ఉంది.
ఎందరు పిల్లల్ని కనాలనే అంశంలో కాషాయ దళాలు మాట ఎందుకు మారుస్తున్నట్లు? సమగ్ర జనాభా విధానం ఉండాలని చెబుతున్నవారు జనాభా గురించి ఒక సమగ్ర దృష్టితో కాకుండా విద్వేష, పాక్షిక దృష్టితో ఎందుకు చూస్తున్నట్లు ? ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అదే నిజం అవుతుందన్న గోబెల్స్ సిద్ధాంతం కొంతకాలం నడిచింది. ఇప్పుడు అదే అబద్ధాలు చెబితే కుదరదు. దేశంలో వారు ప్రచారం చేసినట్లుగా ముస్లింల జనాభా పెరగలేదు, హిందువులు అంతరించలేదు. కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రవేశ పెట్టిన వెంటనే దేశంలోని అన్ని సామాజిక తరగతులు ఒకే విధంగా స్పందించలేదు. 2015-16 జాతీయ కుటుంబ సర్వే వివరాల ప్రకారం ఎక్కువ విద్యావంతులున్న జైన్ సామాజిక తరగతిలో సంతానోత్పత్తి రేటు 1.2 శాతమే. మొత్తంగా చూసినపుడు అత్యంత పేదల్లో 3.2 ఉండగా ధనికుల్లో 1.5 మాత్రమే ఉంది. ముస్లిం సామాజిక తరగతిలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండటానికి వారు ఆలశ్యంగా మేలుకోవటమే. దానికి కుట్ర సిద్ధాంతాలతో విద్వేష ప్రచారం చేయటం తగని పని. తాజా సమాచారాన్ని చూసినపుడు సంతానోత్పత్తి రేటు తగ్గుదల హిందువులతో పోల్చితే ముస్లింలలో వేగంగా ఉంది.1992 నుంచి 2021 మధ్య కాలంలో ముస్లింలలో 4.41 నుంచి 2.36కు (2.05 మంది) తగ్గగా హిందువుల్లో 3.3 నుంచి 1.94కు (1.36 మంది) పడిపోయింది. హిందువుల్లోని దళితుల్లో 2.08, గిరిజనుల్లో 2.09, ఓబిసిల్లో 2.02 ఉంది. ఈ మూడు కాని తరగతుల్లో 1.78 ఉంది. సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉన్న వారిలో విద్య, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే కొద్దీ సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నట్లు ప్రతి సర్వే వెల్లడిస్తున్నది. అందువలన ముస్లింలను బూచిగా చూపటం మెజారిటీ ఓట్ల రాజకీయం తప్ప మరొకటి కాదు. కొస మెరుపు ఏమిటంటే ముస్లింల కంటే ఎక్కువగా రాష్ట్ర సగటు సంతానోత్పత్తి రేటు ఉత్తర ప్రదేశ్‌లో 2.47, బీహార్‌లో 3.19 ఉంది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందని ఎవరైనా చెప్పగలరా? ఆ రాష్ట్రాలు దుర్భర దారిద్య్రంలో ఉండటమే కారణం. మైనారిటీలూ అంతే.
ఎం. కోటేశ్వరరావు