కుక్క కాటు మరణాలు పెరుగుతున్నారు

May 29,2024 05:18 #editpage

పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలంలో నెల రోజుల వ్యవధిలో వీధి కుక్కల దాడిలో ఇరువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ రెండు దుర్ఘటనలు కుక్కలు గుంపుగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన కారణంగా సంభవించాయి. ఏటేటా కుక్కకాటు వల్ల రేబిస్‌ సోకి జరుగుతున్న మరణాలకు, ఇలా దాడి ద్వారా కూడా మరణాల సంఖ్య కలవడం సామాజిక సమస్య. వెంటనే ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన తీవ్రత కలిగిన సమస్య. వీధి కుక్కల కాట్లు విషయంలో దేశానిది ప్రపంచంలో మొదటి స్థానం. ఈ మధ్య కాలంలో దేశం నలుమూలలా ఈ ప్రమాదం పెరిగింది. ఒక అంచనా ప్రకారం దేశంలో వీధి కుక్కల సంఖ్య ఆరు కోట్లు. ఏటేటా నమోదౌతున్న కాట్లు పాతిక లక్షల పైమాటే. ఇంకా గ్రామీణ ప్రాంతాలలో దృష్టిలోకి రానివి ఇంకా ఎక్కువే ఉంటాయి. అవి పెరుగుతూ రావడం ఆందోళనకరం. వీధికుక్కల్ని అదుపు చేయడంలో స్థానిక ప్రభుత్వాలది ముఖ్య పాత్ర. వాటి సంఖ్య పెరగకుండా శస్త్ర చికిత్సలు చేయించాలి. రేబిస్‌ తదితర వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. పురపాలికలు, స్థానిక సంస్థలు తమ ప్రాంతంలో కుక్కలు ఎక్కువైతే వాటిని పట్టుకుని వేరే ప్రాంతంలో వదిలేస్తున్నాయి. ఆ కొత్త ప్రాంతానికి అవి సమస్యగా మారుతున్నాయి. తిండి, నీడ కరువైన ఆ ప్రాణులు ప్రమాదకరమైన ప్రవర్తన అలవర్చుకుంటున్నాయి. లేదా ఇలాంటి దుర్ఘటనలు ఎదురైనప్పుడు వాటిని చంపేయడం జరుగుతుంది. అలా చంపడం చట్టరీత్యా నేరమైనా, ప్రజలకు వేరే గత్యంతరం లేకుండా పోతుంది.కనుక పెరుగుతున్న కుక్క కాట్లకు సమగ్రమైన పరిష్కారం ఆలోచించాలి. ఏమైనా అనారోగ్య కారణాల వల్లనా అన్నది కూడా పశు వైద్య నిపుణుల సాయంతో తెలుసుకోవాలి. వాతావరణ మార్పులు, వాటి మనుగడ సమస్య, వ్యాధులు తదితర ప్రభావాలపై స్పష్టత ఉంటే దానికి తగ్గట్టుగా పరిష్కారం వెతకడం వీలౌతుంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రజాసంఘాలు, మీడియా, ప్రజలు అంతా చేయి కలపాలి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
– డా.డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ, విజయనగరం.

ు–

➡️