విషజ్వరాలు, ఆహార కల్తీ, పాము కాటు, కుక్క కాటు, ఇతర ఆరోగ్య సమస్యలతో కొన్నేళ్లుగా గిరిజన విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు పాడేరు, పార్వతీపురం మన్యంలో ఎక్కువ. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2023-24 విద్యా సంవత్సరంలో ఈ రెండు జిల్లాల్లో 42 మంది మరణించారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలకీëపురంలోని ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి ఆహారం వికటించి మరణించిన విషయం తెలిసిందే. అంతకముందు అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయి కొందరు గిరిజన విద్యార్థులు మృతి చెందడం అందరినీ కలచివేసింది. రాష్ట్రంలో 545 ఆశ్రమ పాఠశాలలు ఉంటే దానిలో 535 పాఠశాలలో విద్యార్ధులకు అత్యవసర వైద్యం అందించేందుకు హెల్త్ వర్కర్లు లేరు. అత్యవసరమైతే ఆసుపత్రికి తీసుకెళ్లే దిక్కు లేక వసతి గృహాల్లోనే ప్రాణాలు వదిలేసే పరిస్థితి. మరోపక్క హాస్టల్ పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు, వంటకు అవసరమైన హాస్టల్ సిబ్బంది, కమాటీ పోస్టులు 1100 ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా ఆ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. హాస్టల్ విద్యార్ధులు చనిపోతున్నా వారి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నా పాలకులకు పట్టడం లేదు. ఎప్పుడైనా విద్యార్ధి కుటుంబాల నుంచి, విద్యార్ధి సంఘాల నుంచి ఒత్తిడి వస్తే స్పందిస్తున్నారు. ఎంతో కొంత పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. విద్యార్ధుల మరణాలపై అధ్యయనం చేసి, సమస్యను పరిష్కరించే ందుకు కృషి చేయాలి. సంక్షేమ హాస్టళ్లలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
– హర్ష