సింగిల్‌ టీచర్‌ వ్యవస్థ వద్దు

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 9 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని అంచనా. ఇటువంటి పాఠశాలలు ఉంటే అక్కడ పని చేసే ఉపాధ్యాయుడు ఎంత అంకిత భావంతో చెప్పినప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదు. ఉపాధ్యాయ సిబ్బందికి ఎప్పటి లాగానే సమావేశాలు, శిక్షణా తరగతులు, యాప్స్‌ నిర్వహణ, రికార్డుల నిర్వహణ వంటి పనులు ఉంటాయి. వీటిని సమన్వయం చేసుకుంటూ 1 నుండి ఐదు తరగతులకు వివిధ రకాల సబ్జక్టులను బోధించడం అంత సులభ సాధ్యం కాదు. ఇందుకు తోడు హోమ్‌ వర్క్‌ కూడా ఇవ్వాలి. ఆ ఉపాధ్యాయుడు సెలవు పెట్టాలన్నా ఇబ్బందే. రెండు మూడు రోజులు డెప్యూటేషన్‌పై వచ్చిన వారికి విద్యార్థుల గురించి సరైన అవగాహన ఉండదు. అటువంటి సమయంలో ఆ పాఠశాల మొక్కుబడిగా నడుస్తుంది. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేస్తామని చెబుతుంది. ఇందులో భాగంగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తుంది. మరోవైపు 1,2 తరగతులున్న పాఠశాలలను అలాగే ఉంచుతుంది. వీటితో పాటు మరికొన్ని బేసిక్‌ ప్రైమరీ పాఠశాలలు కూడా ఉండనున్నాయి. ఇటువంటి పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య 20 లోపు ఉంటే ఓకే ఒక్క టీచర్‌ ఉంటారు. విద్యా శాఖను ప్రక్షాళన చేయాలంటే ముందు ఏకోపాధ్యాయ పాఠశాలలు వుండకూడదు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి వారికి కనీసం రెండేళ్ల సమయం ఇవ్వాలి. పాఠశాలలను నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ప్రాథమిక పాఠశాలలు పటిష్టంగా ఉంటేనే, ఉన్నత పాఠశాలలు మనుగడలో ఉంటాయి.

– యం. రాంప్రదీప్‌, తిరువూరు.

➡️