బిజెపి, మోడీ ప్రభుత్వ ప్రభావం కింద కేంద్ర ఎన్నికల సంఘం (ఇ.సి) పని చేస్తోందన్న భావనలకు శుక్రవారం అది విడుదల ఎన్నికల షెడ్యూల్ అద్దం పడుతుంది. 2019లో హర్యానాతోపాటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా, ఈసారి మహారాష్ట్రను వదిలేయడం అక్కడ అధికారంలో ఉన్న ఎన్‌డిఎ పార్టీలు ఎన్నికలకు సిద్ధం కావడానికి మరింత సమయం ఇవ్వడానికేనని విపక్షాలు లేవనెత్తిన అనుమానాలకు ఇసి వద్ద సమాధానం లేదు. గతంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రస్తావన లేదు, ఈ ఏడాది ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన రెండు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలి, కాశ్మీర్‌లో అతధికంగా భద్రతా సిబ్బందిని మోహరించాలి అని ఇ.సి చేసిన వాదనలు అంతగా పొసగవు. గతంలో కూడా గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా హిమాచల్‌కు ముందుగా ప్రకటించి ఎప్పటికో గుజరాత్‌కు షెడ్యూల్ ఇచ్చారు. అప్పుడు ఇ.సి పక్షపాత వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. సందేహించినట్లుగానే ప్రధాని మోడీ అధికారికంగా గుజరాత్‌లో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతోపాటు ప్రత్యర్ధి పార్టీల నేతలను బిజెపిలో చేర్చుకొనే వరకు అమాంబాపతు ‘రాజకీయ’ పనులను చక్కబెట్టారు. అలాగే మహారాష్ట్రలో సైతం ఏదో జిమ్మిక్కు చేయాలన్న ఉద్దేశం బిజెపికి ఉందన్న భావన మరాఠా ప్రజల్లో బలంగా ఉంది.
మహారాష్ట్రను బిజెపి ప్రధానంగా చూస్తుంది. అక్కడ అధికారం కోసం గత ఐదేళ్లల్లో ఆ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నిందో దేశం చూసింది. పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపిని, ఉద్ధవ్ ధాకరే సారథ్యంలోని శివసేనను నిట్టనిలువునా చీల్చి పడేసి, ప్రభుత్వాన్ని పడగొట్టి, తాను వెనుకుండి చీలిక గ్రూపులతో సంకీర్ణ సర్కారును ప్రతిష్టించింది. బిజెపి అప్రజాస్వామిక చర్యలకు లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. 42 లోక్‌సభ సీట్లు ఉన్న ఎన్‌డిఎ బలాన్ని 17కు తగ్గించి విపక్ష కూటమి బలాన్ని 9 నుంచి 30 స్థానాలకు పెంచారు. లోక్‌సభ ఎన్నికల్లో వెల్లడైన తీవ్ర ప్రజా వ్యతిరేకతను అసెంబ్లీ ఎన్నికల్లో తగ్గించేందుకు తగిన సమయం కోసం మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను దూరం జరపాలని ఇ.సి కి బిజెపి, మోడీ సర్కారు కన్నుగీటిందని తెలుస్తుంది.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 2014 నవంబర్-డిసెంబర్ తర్వాత ఇప్పుడే. అప్పుడు పిడిపి నేత ముఫ్తి మహ్మద్ సయూద్ సిఎంగా పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2016 జనవరి 7న సయూద్ మరణంతో కొన్ని రోజులు గవర్నర్ పాలన నడిచింది. అనంతరం మెహబూబా ముఫ్తి సిఎంగా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింది. 2018 జూన్‌లో బిజెపి మెహబూబా సర్కారుకు మద్దతు ఉపసంహరించడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. కొన్ని పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినా నాటి గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు. 2018 డిసెంబర్ 20 నుంచి రాష్ట్రపతి పాలన విధించారు. 2019లో రెండవ సారి కేంద్రంలో బిజెపి రాగానే జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత రాష్ట్రం, లడాఖ్‌లుగా విభజించారు. 2019, 2024 లోక్‌సభ ఎన్నికలు ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఇ.సి, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం భద్రత పేరిట సాకులు చెప్పడం వెనుక కేంద్ర బిజెపి డైరెక్షన్ తప్పక ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనలో బిజెపికి పట్టు ఉన్న జమ్మూ డివిజన్‌లో 7 అసెంబ్లీ స్థానాలు పెరగడం, ఆ పార్టీకి పట్టులేని కాశ్మీర్ లోయలో ఒక స్థానమే పెరగడం వెనుక కుట్ర జరిగిందన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 114 స్థానాలుండగా 24 పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనివి. హర్యానాలో ముఖ్యమంత్రుల మార్పు, జడలు విప్పిన అవినీతి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని దెబ్బతీశాయి. గతంలో పదింటికి పది లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న బిజెపి 2024లో ఐదింటిని కోల్పోయింది. హర్యానా భయం ఆ పార్టీకి పట్టుకుంది. ఇసిల నియామకం, ఎలక్టోరల్ బాండ్లు, ఇవిఎంలలో ఓట్ల తేడా, లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పట్ల ఇసి వ్యవహరించిన ఉదాసీన వైఖరి వలన స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఇ.సి పట్ల ప్రజల్లో క్రమంగా అవిశ్వాసం గూడుకట్టుకుంటోంది. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ప్రస్తుత పరిణామాలు మరోసారి ఎన్నికల సంస్కరణల డిమాండ్‌ను ముందుకు తెస్తున్నాయి.
