ఇ.సి తీరు మారాలి!

Jul 21,2024 04:45 #editpage

ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటింగు, లెక్కింపులకు సంబంధించి సందేహాలు వున్న అభ్యర్థులకు ఇవిఎంలను పరీక్షించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఎన్నికల సంఘం (ఇ.సి) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత అభ్యర్థులు తాము కోరుకున్న ఏ పోలింగ్‌ కేంద్రంలోనైనా మాక్‌ పోలింగ్‌, వి.వి ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు కోరవచ్చునని ప్రకటన చేసింది. అయితే జూన్‌ నాలుగున ఫలితాలు వెలువడిన వారం రోజులలోగా అభ్యంతరాలు నమోదు చేసిన వారికి మాత్రమే ఆ అవకాశం వుంటుంది. దేశంలో ఎనిమిది మంది అభ్యర్థుల నుంచి అలాంటి అభ్యంతరాలు ఇ.సి కి అందాయి. వాటిలో కాంగ్రెస్‌, బిజెడి, వైసిపి అభ్యర్థులతో పాటు బిజెపి వారు కూడా వుండటం విశేషం. విజయనగరంలోని బొబ్బిలి నుంచి వైసిపి, చత్తీస్‌గఢ్‌ లోని కాంకర్‌లో, హర్యానా లోని కర్నాల్‌, ఫరీదాబాద్‌ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈ దరఖాస్తులు చేశారు. ఆసక్తికరంగా మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలలో లోక్‌సభ స్థానాలపై బిజెపి అభ్యర్థులు వెరిఫికేషన్‌ కోరారు. శాసనసభ పోలింగ్‌కు సంబంధించి ఎ.పి లో రెండు చోట్ల వైసిపి, ఒరిస్సాలో ఒకచోట బిజెడి పరిశీలన కోరాయి. ఓటింగుపై సందేహాలు, ఇవిఎంల లోని మైక్రో చిప్‌లను పరీక్షించుకోవచ్చు, ఒక్కో ఇవిఎంను పరీక్షించుకోవడానికి నలభై వేల రూపాయలు డిపాజిట్‌ కట్టవలసి వుంటుందని ఇసి తెలిపింది. ఈ ఎనిమిది మంది అభ్యర్థులు మొత్తం 43 పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేసుకున్నారు. జూన్‌ 16వ తేదీన ఇ.సి ఒక బహిరంగ ప్రకటన విడుదల చేస్తూ వారు ఎక్కడైనా ఏ ఇవిఎంనైనా పరీక్షించుకొనేందుకు అవకాశం కల్పించడానికి సిద్ధంగా వున్నట్టు వెల్లడించింది. ఇవిఎంల పనితీరుపై అపోహలకు వాటి సాంకేతికతకన్నా ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరే ఎక్కువ ఆస్కారమిస్తోంది.
ఇవిఎంలపై అభ్యంతరాలను, అనుమానా లను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ప్రధాన పోలింగ్‌ కంటే ముందుగా ఏప్రిల్‌ 26న తీర్పునిచ్చింది. ఎలాంటి సందేహాలకు ఆధారం లేదని అభిప్రాయ పడింది. మహారాష్ట్రలో శివసేన (షిండే) వర్గం అభ్యర్థి నైరుతి ముంబాయి నుంచి కేవలం అయిదు ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అలా గెలిచిన ఆ అభ్యర్థి బావమరిది ఒక కౌంటింగ్‌ అధికారి ఫోన్‌లో మాట్లాడటం వివాదమైంది. ఫోన్‌ తీసుకుపోవడం, అధికారి ఫోన్‌లో ఇతరులు మాట్లాడటం నిషిద్ధం గనక కేసు పెట్టారు గాని మరేమీ తప్పు జరగలేదని ఎన్నికల సంఘం ఆగమేఘాల మీద సమర్థించుకుంది. అయితే ఈ క్రమంలో ఓట్ల గోల్‌మాల్‌ జరిగిందనేది రాహుల్‌ గాంధీ ఆరోపణ. ఇక్కడ ఇవిఎంలు హ్యాకింగ్‌ అయ్యాయని కాదు, మానవ పరమైన తగు జాగ్రత్తలు ఇ.సి తీసుకోకపోవడం వల్లే ఇటువంటి అనుమానాలకు ఆస్కారమిస్తోంది. వి.వి ప్యాట్‌లను జత చేయాలని 2013లో సుబ్రహ్మణ్య స్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయంగా స్వేచ్ఛగా ఎన్నికల ప్రక్రియ జరగాలంటే పేపర్‌ వినియోగంతో పోల్చిచూడటం (పేపర్‌ ట్రయల్‌) తప్పనిసరి అని అభిప్రాయపడింది. సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల వి.వి. ప్యాట్‌ వెరిఫికేషన్‌ ఏర్పాట్లు జరగాలని 2019లో తీర్పు చెప్పింది. తాను నిర్ణయించిన అయిదు శాతం పోలింగ్‌ కేంద్రాల్లో మాత్రమే వివి ప్యాట్‌లను వినియోగించాలన్నది ఎన్నికల సంఘం నిర్ణయం.
కోట్ల ఓట్ల తేడాకు జవాబుదారీ ఏదీ?
స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం రాజ్యాంగ విహిత బాధ్యతలను నెరవేర్చి వుంటే ఫలితాలు బిజెపి, ఎన్‌డిఎలకు మరింత ప్రతికూలంగా వుండేవని సిపిఎం కేంద్ర కమిటీ తన ఎన్నికల సమీక్షలో వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం చాలావరకూ ఎన్‌డిఎ భాగస్వామి పాత్ర పోషించిందని ఆ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. బిజెపి ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి తోడ్పట్టమే లక్ష్యంగా ఇ.సి వ్యవహరించింది. మోడీతో సహా బిజెపి నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు ఆధారాలతో సహా కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వెనుకాడింది. మోడీకి ఇవ్వాల్సిన తాఖీదును బిజెపి అధ్యక్షుడిగా నడ్డాకు పంపి సరిపెట్టడమే గాక దాన్ని అన్ని పార్టీలకూ పంపి తన దోషాన్ని పంచే ప్రయత్నం చేసింది. అంతకంటే దారుణం పోలైన ఓట్ల సంఖ్యా వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తూ ఇ.సి ఎన్నికల వ్యవస్థలో మోసాలు జరిగి వుంటాయనే సందేహాలు పెరగడానికి కారణమైంది. దాని రాజ్యాంగ ప్రతిష్టనూ దెబ్బతీసింది. ఎన్నికలు ముగిసిన తర్వాతనైనా ఈ పరిస్థితిని చక్కదిద్దడా నికి ఇ.సి చర్యలు తీసుకోలేదు. ఇవిఎం లలో నమోదైన ఓట్లకూ లెక్కింపు జరిగిన ఓట్ల సంఖ్యకూ భారీ తేడా ఎందుకు వచ్చిందనేది తేల్చనేలేదు. దేశ వ్యాపితంగా చూస్తే మొత్తం 5.14 కోట్ల ఓట్ల తేడా కనిపిస్తున్నది. దీనికి ఇ.సి నే జవాబుదారీ వహించాలి. అసలు 2019 ఎన్నికల ఓట్ల వివరాలే రెండేళ్ల తర్వాత సవరించడమంటే ఇక వ్యవస్థ విలువేమయ్యేట్టు? అంటే ఇక్కడ రాజ్యాంగ పరంగానూ, రాజకీయ కోణంలోనూ వ్యక్తిగతంగా ఆ యా అధికారులు అంటే కమిషనర్ల పరంగానూ కూడా సవాళ్లు కాదనలేనివి. స్వయంగా తాను సూచించిన కొన్ని తరుణోపాయాల పైన కూడా ఇ.సి పట్టు పట్టకపోవడం వంటివన్నీ ఇ.సి పారదర్శకత లోపాన్ని తెలియజేస్తున్నాయి. అన్నిటినీ కలిపి (మిక్సింగ్‌) లెక్కపెడితే మంచిదని ఇ.సి నే ఒకప్పుడు సూచన చేసింది. ఇందుకు టోటలైజర్‌ అనే సాధనం వాడవలసి వుంటుంది. ఇసిఐఎల్‌ అందులో ఏర్పాటు చేసింది కూడా. మన ఇవిఎంలలో ఆ విధంగా 14 క్లస్టర్ల ఓట్లు కలిపి చూసే అవకాశం వుంటుంది. సంబంధిత అభ్యర్థికి మొత్తం ఓట్లు ఎన్ని వచ్చాయో తెలుసుకోవడానికి ఒక బటన్‌ నొక్కితే సరిపోతుంది. లా కమిషన్‌ కూడా ఈ సూచనకు మద్దతునిచ్చింది.
ఎన్నికల పారదర్శకత కోసం గట్టిగా మాట్లాడి, అర్ధంతరంగా పదవీ విరమణ చేసిన మాజీ కమిషనర్‌ అశోక్‌ లావాసా దీనిపై ఇటీవలే వ్యాసం కూడా రాశారు. టోటలైజర్‌ వినియోగించే సమయం ఇంకా రాలేదని మొన్నటి ఎన్నికల తర్వాత కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. పారదర్శకత కోసం, ఇవిఎంలో ఓటింగు యూనిట్ల సీక్వెన్స్‌ మార్చాలని సిపిఎం మరో పద్ధతి సూచించింది. ప్రస్తుతం బ్యాలట్‌ యూనిట్‌ ముందు, తర్వాత వి.వి ప్యాట్‌, ఆ తర్వాత కంట్రోల్‌ యూనిట్‌ వుంటున్నాయి. అంటే వి.వి ప్యాట్‌ నిర్ధారించిన ఓటు, మొత్తం నమోదయ్యే కంట్రోల్‌ యూనిట్‌కు వెళ్లే ఓటు ఒకటే అవునో కాదో అర్థం కాదు. బండి ముందు గుర్రం వెనక చందంగా నడుస్తుంది. కనక ముందు బ్యాలట్‌, తర్వాత కంట్రోల్‌, ఆ పైన చివరగా వివి ప్యాలట్‌ వుంటే మెరుగని రాసింది. ఇందులో ఎలాంటి సాంకేతిక సమస్యలు కూడా లేవు. అయినా ఎన్నికల సంఘం నిరాకరించింది. ఏది ఏమైనా భారతీయ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత చాలా అవసరం. ఇవిఎంలో పోలైన ఓట్లకన్నా లెక్కించిన ఓట్లకు తేడా ఇంత ఎక్కువగా వుండడానికి కారణమేమిటో ఇ.సి సెలవివ్వాలి. ఇవిఎంలు ఉపయోగించేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఇది ముందుకు తెచ్చింది. ఇందుకోసం పోరాటం కొనసాగవలసిందే.

తెలకపల్లి రవి

➡️