జర్నలిస్ట్‌

editorial on attacks on journalists in india

‘సిరికింజెప్పడు, శంఖుచక్రయుగముం జేదోయి సంధింప డే/ పరివారంబును’ అనేది గజేంద్రమోక్షంలో ఒక శ్లోకం. విష్ణువు గజేంద్రుని కాపాడే తొందరలో తన ప్రియసఖియైన లక్ష్మీదేవికి కూడా జెప్పక, శంఖ చక్ర గదాది ఆయుధములను జేపట్టక, పరివారంబును పిలువక, తన వాహనమైన గరుడునిపై గూడ నధిరోహింపక, జారిన జుట్టును గమనింపక, వేడుకలో లక్ష్మీదేవి కొంగుతో ముడివేసిన యామె పైటకొంగును కూడ గమనింపక తొందరపాటుతో యీడ్చుచునే బయలుదేరెనని ఆ శ్లోకం సారాంశం. వాస్తవానికి విష్ణువు అలా వెళ్ళాడో లేదో మనకు తెలియదు గానీ… ఏదైనా ఒక సంఘటన జరిగిందని తెలిసిన మరుక్షణం… ఆగమేఘాల మీద ఆ సంఘటనా స్థలికి చేరేవాడు జర్నలిస్టు. కలం పట్టిన సైనికుడు జర్నలిస్ట్‌. కలం పట్టినా, కెమెరా పట్టినా బాధితుల పక్షాన నిలుస్తాడు, అక్షరాలను తూటాల్లా పేల్చుతాడు. విధి నిర్వహణలో తన ప్రాణాలను సైతం ఫణంగా పెడతాడు. విత్తును మొలకెత్తించడానికి రైతు ఎంత శ్రమ పడతాడో… ఒక వార్తను ప్రపంచానికి తెలియజెప్పడానికి జర్నలిస్టూ అంతే శ్రమపడతాడు. ఒక్కోసారి సర్వశక్తులూ ఒడ్డి పోరాడతాడు. రైతుది బ్రతుకు పోరాటమైతే, జర్నలిస్టుది మంచిని బ్రతికించాలనే ఆరాటం.

గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారిందని ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. ఈ కాలంలో విధి నిర్వహణలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ చట్టం, ఇతర ఒప్పందాల ప్రకారం జర్నలిస్టులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను పూర్తిగా విచారించి బాధ్యులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవడంలో దేశాలు వైఫల్యాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుకనే జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందేనని ఐరాస స్పష్టం చేసింది. నేడు జర్నలిస్టుల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 120 మంది జర్నలిస్టులు హత్యగావించబడ్డారని అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (ఐఎఫ్‌జె) వెల్లడించింది. గ్లోబల్‌ మీడియా వాచ్‌డాగ్‌ ‘కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (సిపిజె)’ సమాచారం ప్రకారం… దశాబ్ద కాలంలో 2023 జర్నలిస్టులకు ఘోరమైన సంవత్సరం. ఈ ఏడాదిలో 99 మంది జర్నలిస్టులు చనిపోయారు. ఇందులో 77 మంది గాజాపై ఇజ్రాయిల్‌ నరమేధాన్ని రిపోర్టింగ్‌ చేస్తున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. తాజా లెక్కల ప్రకారం ఇజ్రాయిల్‌-గాజా యుద్ధంలో మరణించిన జర్నలిస్టుల సంఖ్య 88కు పెరిగిందని సిపిజె తన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించింది. ఇజ్రాయిల్‌ సైన్యం డజన్ల కొద్ది జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగానే చంపిందన్నది నిజమైతే అది ‘యుద్ధ నేరం’గా పరిగణించబడుతుంది.

గాజాపై ఇజ్రాయిల్‌ దాడిలాంటిదే… భారతదేశంలోనూ మైనారిటీలు, జర్నలిస్టులు, మేధావులపై నిరంకుశ దాడి జరుగుతోంది. మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం వందలాది జర్నలిస్టులపై దేశద్రోహం, ఉపా చట్టం కేసులు పెట్టింది. ‘న్యూస్‌ క్లిక్‌ పోర్టల్‌’పై కేసులు నమోదు చేయించింది. అందులో పనిచేసే జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు పెట్టించింది. పెగాసస్‌ స్పైవేర్‌తో 40 మంది జర్నలిస్టులపై కేంద్రం పెట్టిన నిఘా కూడా బయటపడింది. అనేకమందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనేకమంది మహిళా జర్నలిస్టులపైనా, వారి కుటుంబ సభ్యులపైనా, వారి ఇళ్లపైనా భౌతిక దాడులు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌లో భారతదేశం 2020లో 180 దేశాలలో 142వ స్థానంలో ఉంటే, 2023లో అది 161వ స్థానానికి దిగజారింది. ఇదీ మోడీ ప్రభుత్వంలో మీడియాకు దక్కిన గౌరవం. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభమైన మీడియాను ఎంతగా నరుకుతున్నారో కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూస్తేనే అర్థమవుతుంది. ‘యుద్ధరంగంలో నిలబడి/ కవిత్వం రాయడం గొప్ప ఆనందాన్నిస్తుంది’ అంటాడో కవి. నిరంకుశత్వం పెరిగేకొద్దీ జర్నలిస్టు కలం, కెమెరా కూడా తన వాడి పెంచుతుందే తప్ప… వెనక్కి తగ్గదు.

➡️