బరితెగింపు

editorial on bjp hate politics misuse ED jharkhand cm arrest

రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా మోడీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడానికి బరితెగిస్తోంది. ఈ విషయమై ఎన్ని విమర్శలు చేసినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో నామమాత్రపు మార్పు కూడా కనిపించడంలేదు. ప్రతిపక్షాలన్నీ కలిసి మూకుమ్ముడిగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. అయినా.. ఇడి, సిబిఐ వంటి సంస్థలను తమ జేబు సంస్థలుగానే మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపక్షనేతలను నయానో, భయానో లొంగదీసుకోవడానికి, అలా లొంగని వారిని కేసులతో వేధించడానికి ఆ సంస్థలను దుర్వినియోగపరుస్తున్న తీరు జుగప్స కలిగిస్తోంది. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఇడి అధికారులు ఏడు గంటలకు పైగా ప్రశ్నించి, అరెస్ట్‌ చేయడం బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌ను లక్ష్యంగా చేసుకోవడం దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి తాజా నిదర్శనం. బిజెపి నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నందునే ఇడి వీరిని లక్ష్యంగా చేసుకుంది. బీహార్లో మహాకూటమి ప్రభుత్వం నుండి నితీష్‌ కుమార్‌ వైదొలిగి బిజెపి పంచన చేరిన మరుసటి రోజే ఇడి విచారణ ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం. సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా తేజస్వీ తండ్రి, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కూడా ఇటీవలే ఇడి నోటీసులు జారీ చేసింది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి లాలూ సాగిస్తున్న పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే స్థితి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్‌ అధ్యక్షుడు కేజ్రివాల్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇడి బాధితులుగా మారడానికి కారకులెవరో అందరికీ తెలిసిందే. ప్రత్యేకహోదా కోసం నిలదీసినందుకు ఇడి తనను వేధిస్తోందంటూ మన రాష్ట్రానికే చెందిన గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ ఏకంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి దుర్నీతికి, దుర్వినియోగానికి ఉదాహరణాలెన్నో! 2014వ సంవత్సరంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి గత ఏడాది జనవరి వరకు దేశ వ్యాప్తంగా 121 మంది రాజకీయ నేతలపై ఇడి కేసులు పెట్టి విచారణ చేపట్టింది. వీరిలో 115 మంది అంటే 95 శాతం మంది ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెంది, బిజెపిని గట్టిగా వ్యతిరేకించేవారే కావడం గమనార్హం. ఇలా కేసులు నమోదైన వారు బిజెపిలో చేరితే వెంటనే వారిపై నమోదైన కేసులను ఎత్తివేయడం, వారిలో కొందరికి ప్రభుత్వ పదవులను సైతం కట్టబెట్టడం మోడీ సర్కారు బరితెగింపునకు మరో నిదర్శనం. మరోవైపు ఇడి కేసుల్లో నేరం రుజువై శిక్షపడినవి చాలా తక్కువ. అధికారిక లెక్కల ప్రకారం 2011 నుండి ఇడి 1600 కేసులు నమోదు చేసి, 1800 దాడులను ఇడి నిర్వహించింది. అయితే, నేరం రుజువై శిక్ష పడింది మాత్రం కేవలం 10 మందికి మాత్రమే! గడిచిన 18 ఏళ్లలో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పిఎంఎల్‌ఏ) కింద 5,422 మందిపై ఇడి కేసులు పెట్టి దర్యాప్తు చేయగా, 23మందికి మాత్రమే శిక్ష పడింది. ఇది కేవలం 0.5శాతం మాత్రమే! అయినా, భయపడుతున్నారంటే ఇతర దర్యాప్తు సంస్థలకు లేని ప్రత్యేక అధికారాలు ఇడి కి ఉండటమే కారణం. ముఖ్యంగా న్యాయస్థానాల అనుమతి లేకుండానే ఆస్తులు జప్తు చేసే అధికారం ఒక సారి కేసు నమోదైతే నేరం చేయలేదని రుజువు చేసుకునే బాధ్యత నిందితునిపైనే మోపడం వంటి అధికారాలను ఇ.డి కి అప్పగించారు. ప్రస్తుత పార్లమెంటులోని ప్రతిపక్ష సభ్యుల్లో దాదాపు 90 శాతం మంది ఏదో ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ నిఘానీడలో ఉన్నట్లు ఇటీవల విడుదలైన ఒక నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలు ఇడి దాడులను అడ్డుకోవడంతో పాటు, ఆ సంస్థ సిబ్బందిపై కేసులు నమోదు చేశాయి. తాజాగా జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ కూడా ఇడి అధికారులు తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ కేసు దాఖలు చేశారు. తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఈ అధికార దుర్వినియోగాన్ని అరికట్టి, దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై ప్రజానీకంలో తిరిగి నమ్మకం కలిగించాలంటే అధికారం నుండి బిజెపిని సాగనంపడం ఒక్కటే మార్గం. ఈ లక్ష్య సాధనకు ఐక్యంగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంది.

➡️