గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం రూ.32 వేల కోట్ల విద్యుత్ భారాలను జనం నెత్తిన మోపింది. కూటమి పార్టీలు, చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని మాట ఇచ్చారు. ప్రజలు నమ్మి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలలలో చార్జీలు పెంచలేదని, రాబోయే నాలుగేళ్లు భారం వెయ్యబోమని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. గత తొమ్మిది నెలల్లో రెండు దఫాలుగా రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారాన్ని మోపి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.
ప్రపంచ బ్యాంకు షరతులకు లొంగి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 1998 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణలు పెట్టింది. విద్యుత్ సంస్థలను మూడు ముక్కలు చేశారు. ఉత్పత్తి రంగంలో ప్రైవేటు సంస్థలను దించారు. విద్యుత్ చార్జీలు చెల్లించిన సంవత్సరం లేదా ఐదు సంవత్సరాల తర్వాత లెక్కలు చూసి, ఆదాయం కంటే ఖర్చులు పెరిగితే ఆ తేడాని జనం నుండే వసూలు చేసే సర్దుబాటు చార్జీల విధానాన్ని ఆనాడు ప్రవేశపెట్టారు. వాటినే ట్రూ అప్, ఆ తర్వాత సర్దుబాటు చార్జీలు (ఫ్యూయల్ పవర్ పర్చేజింగ్ కాస్ట్ ఎడ్జస్ట్‌మెంట్-ఎఫ్.పి.పి.సి.ఎ)గా పిలుస్తున్నారు. ఈ సర్దుబాటు చార్జీలను ఐదు సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి లెక్కించి ఆ భారం మొత్తాన్ని నెల నెలా బిల్లులలో కలిపి వసూలు చేస్తున్నారు. ఈ సర్దుబాటు చార్జీల విధానమే ప్రమాదం.
అసలు కంటే కొసరు ఎక్కువ
ప్రతి ఒక్కరి నెల విద్యుత్ బిల్లులు పరిశీలిస్తే కూటమి ప్రభుత్వ బండారం బట్టబయలవుతుంది. బిల్లులలో నెలసరి వాడుకున్న విద్యుత్ యూనిట్లు, దానిపై వసూలు చేస్తున్న ఎనర్జీ చార్జీలు ఉంటాయి. నివాసాలకు యూనిట్ రూ.1.90 పైసల నుండి స్లాబు ప్రకారం పది రూపాయల వరకు వసూలు చేస్తారు. నివాసం కాని షాపులు, ఇతర సంస్థలకు అధిక స్లాబులు ఉంటాయి. ఈ చార్జీలలో పెద్ద మార్పులు లేవు. కానీ బిల్లులు మాత్రం పెరుగుతున్నాయి. ఇందులోనే మోసం ఉంది. అసలు చార్జీల కంటే కొసరు చార్జీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫిక్స్‌డ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, ఆలస్యమైందనే సాకుతో రూ.25 సర్ చార్జీలు, ఇంకా ఆలస్యమైతే కనెక్షన్ తొలగించినట్లు రాసుకొని మళ్లీ రీకనెక్షన్ చార్జీలు…ఇవన్నీ వసూలు చేస్తున్నారు. మరోవైపు గత 32 నెలల నుండి 2014-19లో వినియోగించుకున్న విద్యుత్‌పై ట్రూ అప్ చార్జీలు వసూలు చేస్తున్నారు. మరో 4 నెలలు అవి కొనసాగుతాయి. ఇవి కాకుండా 2022-23, 2023-24 సంవత్సరాల్లో కట్టిన బిల్లులపై మళ్ళీ అదనంగా సర్దుబాటు చార్జీలు (ఎఫ్.పి.పి.సి.ఎ) కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అదనంగా వేశారు. అది బిల్లుల్లో కలుపుతున్నారు. 2026 నవంబర్ వరకు ఇవి కొనసాగుతాయి. ప్రతి నెలా గత నెలలో వాడిన కరెంటుపై యూనిట్‌కి 40 పైసలు చొప్పున మరుసటి నెలలో మరొక సర్దుబాటు చార్జీ వసూలు చేస్తున్నారు. దీనికి తోడు విద్యుత్ సుంకం (ఎలక్ట్రిసిటీ డ్యూటీ) వసూలు చేసి ప్రభుత్వం ఖజానా నింపుకుంటున్నది. ఒక్కొక్క యూనిట్‌కి ఆరు పైసలు వసూలు చేస్తున్నారు. నివాసం కాకుండా చిన్నా చితక వ్యాపారాలేగాక పెద్ద సంస్థలకు కూడా ఇప్పటి దాకా వసూలు చేస్తున్న యూనిట్‌కు 6 పైసలను ఒకేసారి 100 పైసలకు సుంకం పెంచారు. వైసిపి ప్రభుత్వం ఈ రకంగా పెంచితే కోర్టు నిలుపుదల చేసింది. కూటమి ప్రభుత్వం చట్ట సవరణ చేసి 100 పైసలు వసూలు చేయటానికి చట్టబద్ధత కల్పించింది. అంటే విద్యుత్ సుంకం ఒకే సారి 15 రెట్లు (1566 శాతం) పెంచింది. వేల కోట్లు దండుకుంటున్నది. ఇదే కాకుండా ప్రతి ఇంటిలో తనిఖీలు చేసి ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, ఇతర గృహోపకరణాలు అదనంగా ఉన్నాయని సాకు చెప్పి అదనపు లోడ్ పేరుతో వేల రూపాయలు జనం నెత్తిన అదనపు లోడ్ చార్జీలు వసూలు చేయటం నిత్యకృత్యంగా మారింది. దానికి ఇప్పుడు రాయితీ ప్రకటించి, స్వచ్ఛందంగా మీరే వెళ్లి దరఖాస్తు పెట్టుకుని 50 శాతం కడితే చాలని ఇంకొక నాటకానికి ప్రభుత్వం తెరదీసింది. రైల్వేలు వాడే కరెంటు చార్జీలు పెంచడంతో రైల్వే ప్రయాణికులపై భారం పడింది. పరిశ్రమలలో తయారయ్యే సరుకుల ధరలూ పెరిగాయి. స్థానిక సంస్థలలో మంచినీరు, డ్రైనేజి, వీధిలైట్లపై కరెంటు చార్జీలు పెంచడంతో స్థానిక సంస్థలలో మళ్లీ పన్నులు పెంచుతున్నారు. విద్యుత్ ప్రత్యక్ష భారాలేగాక, పరోక్ష భారాలూ ఎన్నో వున్నాయి. విద్యుత్ భారాలు భరించలేక కొన్ని పరిశ్రమలు మూతబడుతున్నాయి. ఉపాధి దెబ్బతింటున్నది. అభివృద్ధి మందగిస్తున్నది. చార్జీలు పెంచలేదని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, నియంత్రణ మండలి, అధికారులు అందరూ నమ్మబలుకుతున్నారు. గత సంవత్సరాలలో వాడుకున్న విద్యుత్‌పై సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పుడు కరెంటు చార్జీలు పెంచి వసూలు చేయడం కాదా! కానీ ముక్కలు ముక్కలుగా దొంగ చాటున ప్రజల కళ్ళుగప్పి రకరకాల పేర్లతో జనం జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇది నూతన దోపిడీ. ప్రజలను మభ్యపరిచే కుట్ర. భారాలు లేవంటూనే ప్రజల ముక్కు పిండి వసూలు చేసే కుతంత్రం. ప్రజలు వీటిని గమనించి తిప్పికొట్టాలి.
ముందుంది మొసళ్ళ పండగ
ఇంతటితో ఆగలేదు. భవిష్యత్తులో మరిన్ని భారాలు పడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు స్మార్ట్ మీటర్లు బిగించాలని ఆదేశాలు ఇచ్చింది. మోడీకి, కేంద్రానికి లొంగి గత వైసిపి ప్రభుత్వం షరతులకు లొంగింది. ఆ విధానాలనే టిడిపి కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. అదానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగింపు గత ప్రభుత్వం ప్రారంభించింది. రైతులు ప్రతిఘటించారు. ఎన్నికలలో ఎజెండాగా మారింది. తాత్కాలికంగా పంపు సెట్లకు మీటర్ల బిగింపు ఆగింది. కానీ కార్యాలయాలకు కూటమి సర్కార్ స్మార్ట్ మీటర్లు బిగించింది. ఆ తరువాత చిన్న, మధ్యతరగతి వ్యాపారులు మొదలు అన్ని సంస్థలకు మీటర్లు బిగిస్తున్నది. తదుపరి 200 యూనిట్ల పైన వినియోగించే గృహాలన్నింటికీ ఈ మీటర్లు బిగిస్తారు. ఆ తదుపరి ప్రతి ఇంటికి మీటర్ బిగిస్తారు. ఇవన్నీ అదాని సంస్థకు చెందిన మీటర్లే. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని పాదయాత్రలో లోకేష్ పిలుపునిచ్చారు. హైకోర్టులో టిడిపి నేతలు కేసు వేశారు. అదే కూటమి ప్రభుత్వం నేడు శరవేగంగా మీటర్లు బిగిస్తోంది. ఈ మీటర్ పేరుతో ప్రజలకు ఉరి తాళ్లు బిగిస్తున్నారు. సెల్ ఫోన్ తరహాలో ఈ మీటర్ ద్వారా ముందస్తుగా (ప్రీపెయిడ్) కార్డు వేసుకోవాలి. కొనుగోలు చేసిన విద్యుత్ వినియోగం ముగిసేలోపే మళ్ళీ రీచార్జ్ చేయించుకోవాలి. అంటే బిల్లులు ముందే చెల్లించాలి. ఎంత రేటు వేస్తారో మనకే తెలియదు. ఇంటికి వచ్చి రీడింగ్ చూడాల్సిన అవసరం లేదు. అంతా కేంద్రీకృతంగా అదాని కంపెనీ ప్రతి ఇంటికి కరెంట్ బిల్లు వసూలు చేస్తుంది. తక్షణమే ప్రీపెయిడ్ పద్ధతి రాకపోయినా మీటర్ల బిగింపు అంతా పూర్తయిన తర్వాత ఈ విధానం అమలు చేస్తారు. ఈ మీటర్ రేటు రూ.10 వేల పైనే ఉంటుంది. దీనిని 93 నెలల్లో, వాయిదాల పద్ధతిలో బిల్లులో కలిపి వసూలు చేస్తారు. ప్రభుత్వం తాజాగా ‘టైమ్ ఆఫ్ ది డే’ (టి.ఒ.డి) పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కరెంటు అధికంగా వాడే సమయంలో యూనిట్‌కు అధిక రేటు వసూలు చేసే విధానం అమలు ముందుగా వ్యాపార సంస్థలకు ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత గృహాల నుంచి వసూలు చేస్తారు. సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు యూనిట్‌కు అదనంగా రూపాయి, రెండు రూపాయలు చెల్లించాలి. 24 గంటలను నాలుగు భాగాలుగా విభజించి, రకరకాల రేట్లు వసూలు చేస్తారు. వేసవి ఇతర సీజన్లలో మరింత రేట్లు ఎక్కువ ఉంటాయి. ఈ స్మార్ట్ మీటర్లు గంటగంటకు రీడింగ్ తీస్తాయి. ఏ సమయంలో, ఎంత రేటు ఉంటే అంతా మన బ్యాలెన్స్‌లో కట్ అయిపోతుంది. ఇదంతా దశలవారీగా చేస్తారు. ప్రజలలో ప్రతిఘటన రాకుండా ముక్కలుగా అమలు చేస్తున్నారు. చార్జీలు పెంచలేదంటూనే ప్రజలను దోపిడీ చేయడానికి పాలకులు అనుసరిస్తున్న కుట్రలను గమనించాలి.
తిలా పాపం తలా పిడికెడు?
ఈ భారాలకు కారణం ఏమిటి? ప్రత్యామ్నాయం లేదా? కేంద్రంలో, రాష్ట్రంలో ఇప్పటివరకు పాలించిన పాలకుల విధానాలే ఈ భారాలకు మూలం. కేంద్రంలో మోడీ సర్కార్ విద్యుత్ రంగంలో దోపిడీని మరింత తీవ్రం చేసింది. కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణలు తీసుకువస్తోంది. విద్యుత్ రంగాన్ని అదాని, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు కట్టబెడుతోంది. సబ్సిడీలను కుదిస్తోంది. ఉచిత విద్యుత్‌కు ఎసరు పెడుతున్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అదే దారిలో నడిచింది. నేడు టిడిపి కూటమి సర్కార్ మరింత దూకుడుగా సాగుతోంది. ఈ సంస్కరణకు తానే ఆద్యుడినని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. సంస్కరణల ద్వారా చౌకైన, నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్తు లభిస్తుందని నమ్మబలికారు. 25 ఏళ్ల అనుభవం చూస్తే ఈ సంస్కరణలు విఫలమయ్యాయి. చార్జీలు తగ్గకపోగా మరింత పెరిగాయి. విద్యుత్ ఉత్పత్తి చేసే బడా కంపెనీలతో పాలకులు అధిక రేట్లతో, దీర్ఘకాలం పాటు సాగే ఒప్పందాలను (పి.పి.ఎ) చేసుకున్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ఇంధనం, రవాణా అన్నీ కార్పొరేట్ కంపెనీల చేతిలో ఉన్నాయి. వారు అడ్డగోలుగా రేట్లు పెంచి విద్యుత్ భారాలకు కారకులవుతున్నారు. కరెంటు కోతలు, కొరత పేరుతో బహిరంగ మార్కెట్లో అప్పటికప్పుడు విద్యుత్ అధిక రేట్లు పెట్టి స్వల్పకాలిక కొనుగోళ్లు చేసి రూ.వేల కోట్లు పాలకులు, ఉన్నతాధికారులు, బడా కంపెనీలు దండు కుంటున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు మొదలు మొత్తం సామాగ్రి రేట్లు పెంచేసి భారీ అవినీతికి పాల్పడుతున్నారు. ప్రైవేటు సంస్థల వద్ద విద్యుత్ కొనుగోలు చేసి ప్రభుత్వ ధర్మల్ కేంద్రాలను మూత వేస్తున్నారు. ఉత్పత్తి తగ్గిస్తున్నారు. ఈ భారం ప్రజలపైనే వేస్తున్నారు. సోలార్, పవన ఇతర సాంప్రదాయేతర విద్యుత్ అంటూ అడ్డగోలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత వైసిపి ప్రభుత్వం మోడీ ఒత్తిళ్లకు లొంగి రాష్ట్రంలో వ్యవసాయానికి అవసరమైన మొత్తం 7వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ అదాని సంస్థ నుండి కేంద్ర ప్రభుత్వ సంస్థలు (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ) ద్వారా కొనుగోలుకు 25 సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. ఆనాటి వైసిపి ప్రభుత్వ పెద్దలకు రూ.1750 కోట్లు లంచాలు ఇచ్చి ఈ ఒప్పందం చేసుకున్నట్లు సాక్ష్యాధారాలతో అమెరికా కోర్టులలో విచారణ జరుగుతున్నది. రూ.1.99 పైసలకు దొరికే సోలార్ విద్యుత్తును రూ.2.49 పైసలకు 25 ఏళ్లు అదే రేటు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవడం దుర్మార్గం. పైపెచ్చు రాజస్థాన్‌లో తయారయ్యే విద్యుత్ రాష్ట్రానికి చేరుకోవటానికి ట్రాన్స్‌మిషన్, ఇతర అదనపు చార్జీలు పడతాయి. దీనివలన పాతికేళ్లలో లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల భారం జనం మీద పడుతుందని స్వయంగా చంద్రబాబు శ్వేత పత్రంలో ప్రకటించారు. కానీ ఇంత అవినీతి జరిగినా బహిరంగంగా, వెల్లడవుతున్నా కూటమి, చంద్రబాబు ఒప్పందం రద్దు చేయబోమని నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం తగ్గుతుందని, పెనాల్టీ చెల్లించవలసి వస్తుందని సాకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం చెల్లదని ఈనాటి ఆర్థిక మంత్రి కేశవ్ ఆనాడు కోర్టులో కేసు వేశారు. అదే ఒప్పందాన్ని నేడు జగన్ అవినీతిని కాపాడుతున్నారు. మోడీ, అదానితో కుమ్మక్కు అవటంలో టిడిపి, జనసేన, వైసిపి అందరిదీ ఒకటే దారి. ప్రజలను వంచించటంలో వీరందరిదీ ఒకటే మాట. ఇదే కాదు హిందూజా అనే బడా కంపెనీకి విద్యుత్తు ఉత్పత్తి చేయకుండానే 1200 కోట్ల రూపాయలు అడ్డగోలుగా వైసిపి ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబు, పవన్ నోరు మెదపడం లేదు. యాక్సిస్ అనే సంస్థ నుండి యూనిట్‌కు రూ.4.60 చెల్లించే సోలార్ విద్యుత్ కొనుగోలుకు తాజా ఒప్పందానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జగన్ బినామీ సంస్థగా టిడిపి నేతలు చెప్పిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంస్థకు కూటమి అధిక రేట్లతో కాంట్రాక్టులను కొనసాగిస్తున్నది. అదే సంస్థకు చెందిన ఇండోసోల్ కంపెనీకి సోలార్ ప్యానళ్ళ తయారీకి 8,000 ఎకరాల భూముల కేటాయింపును కూటమి సర్కార్ ఖరారు చేసింది. మంత్రులు సైతం ఇదేమిటని అడిగినా, చంద్రబాబు దీనిని సమర్ధించుకుంటున్నారు. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలను ప్రభుత్వం సక్రమంగా చెల్లించదు. సంస్థలను అప్పులు, నష్టాల్లోకి నెడుతున్నారు. కార్పొరేట్ల దోపిడి, పాలకుల అవినీతి, అక్రమ విధానాల పాపం మొత్తాన్ని జనం నెత్తిన భారాల రూపంలో రుద్దుతున్నారు. రాబోయే కాలంలో ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ వాస్తవాలను ప్రజలు గమనించాలి.
భారాలను, విధానాలను తిప్పి కొట్టాలి
వైసిపి-తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవటం, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని నమ్మబలకటం చూస్తున్నాం. విద్యుత్ ప్రైవేటీకరణ, సంస్కరణలు, బడా కార్పొరేట్ కంపెనీల దోపిడీ విషయంలో వీరందరిదీ ఒకటే దారి. దోపిడీ రూపం, చార్జీల పేర్లు మారినా…భారాలు తప్పవు. వీటికి ప్రత్యామ్నాయ విధానాలను సిపిఎం, వామపక్షాలు మాత్రమే చూపుతున్నాయి. దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలపై బషీర్‌బాగ్ పోరాటంలో ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాట ఫలితంగానే ఆ నాడు సంస్కరణ వేగం తగ్గింది, చార్జీల పెంపు కొంత కాలం ఆగింది. ఇప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు తాత్కాలికంగా ఆగాయి. ప్రజలు నూతన దోపిడీ రూపాలను గమనించి విద్యుత్ భారాలకు కారణమైన సంస్కరణలపై పోరాటం సాగించాలి. ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ చైతన్యవంతులు కావాలి. తిప్పికొట్టాలి.
వ్యాసకర్త: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు