ప్రపంచవ్యాప్తంగా ఆధునిక విజ్ఞానం ఎంతో ముందుకు పోతోంది. సైన్సుకు తిరుగులేదు అన్నంతగా ప్రపంచ మానవుడు ఇతర గ్రహాలలో కాపురం పెట్టేందుకు ఉరకలు వేస్తున్నాడు. దేవుడు కల్పితం, స్వర్గనరకాలు లేవు, మహిమలు మంత్రాలు, చేతబడులు అసలే లేవు. అని రుజువులతో హేతువాదులు సవాలు చేస్తున్నారు. జ్యోతిష్యం వాస్తూ బూటకమని, నమ్మి మోసపోవద్దని ఎన్నిమార్లు ఛాలెంజ్ చేసినా ఇంకా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. బాబాలందరూ మోసగాళ్లు, వారిని నమ్మి జీవితాలు పాడు చేసుకోవద్దు అని నిత్యం చెప్తూనే ఉన్నాం. అయినా చదువుకున్నారని అనుకున్నవారే ఈరోజు బాబాలను పోషిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం మదనపల్లిలో బాగా చదువుకున్న తలిదండ్రులు, వారి ఇద్దరు కుమార్తెలను సుత్తితో కొట్టి మరీ చంపారు. ఈ సంఘటనకు ఒక బాబా ప్రేరణ వున్నదని ఆ రోజు పత్రికలు రాశాయి. ఆ తల్లిదండ్రుల ఫోన్ తీస్తే ఆ బాబా ఎవడన్నది మొత్తం బయటపడేది. ఆరేడు సంవత్సరాల క్రితం కేంద్రం మూఢనమ్మకాల నిర్మూలన కోసం అన్ని రాష్ట్రాలను సలహాలు ఇవ్వండని కోరింది. ఏమైందో తెలియదు. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నది. ప్రజలలో ప్రశ్నించేతత్వం పెంచాలని రాసుకున్న రాజ్యాంగ సూత్రాలను నాయకులు గాలికి వదిలారు. ఒక బిజెపి పార్లమెంటు సభ్యుడు సంస్కృతం మాట్లడితే షుగర్ జబ్బు పోతుందని బుద్ధిలేని ప్రకటన ఇస్తాడు. ఇంకొక యూపీ బిజెపి మంత్రి అవు వెనుక భాగంలో చరిస్తే బీపీ తగ్గిపోతుందని ప్రకటిస్తాడు. ఇంకేం! షుగర్, బీపీ ఇంత సులభంగా తగ్గి పోగొట్టిస్తున్న వీరిద్దరికి నోబెల్ బహుమతి ఇవ్వవచ్చు. ప్లేట్లు వాయిస్తే కరోనా పోతుందన్న మోడీజీకి కూడా ఇంకొక నోబెల్ ఇవ్వవచ్చేమో! ఆ కమిటీ పరిశీలించాలి. ఆవుకు సంస్కృతం నేర్పుతానన్న నిత్యానంద దేశం వదలి పారిపోయాడు. ఈమధ్య అడ్డుఅదుపు లేకుండా వశీకరణ మంత్రాలు యూట్యూబ్ చానళ్లలో వస్తున్నాయి. అదుపు చెయ్యాల్సిన ప్రభుత్వం ఆ పని చెయ్యటంలేదు. ఆవు మూత్రం తాగితే సర్వ రోగాలు పోతాయని కూడా బిజెపి వారు ప్రచారం చేస్తున్నారు. అష్ట్రో నవగ్రహ వాచ్ పెట్టుకుంటే సమస్యలు తీరతాయని, ఒక వాచ్ రెండు వేలు, రెండు వాచ్‌లు మూడు వేలు అని టీవీలలో ప్రచారం చేస్తూ, జనం జేబులు కొడుతున్నా కూడా పట్టించుకునేవారు లేరు. మూఢ నమ్మకాల నిర్మూలన తోనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకోసం అందరూ కృషి చెయ్యాలి.
– నార్నె వెంకట సుబ్బయ్య.