ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్‌సి-2025 నోటిఫికేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు ఏప్రిల్ 20న వెలువడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్‌సి నోటిఫికేషన్ రాకతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మొత్తం 16,347 పోస్టులను ప్రభుత్వం భర్తీకి ఉపక్రమించడం స్వాగతించదగినది. కాగా నోటిఫికేషన్‌లో లోపాలు ఉద్యోగార్ధులను కలవరపెడుతున్నాయి. పలు సందిగ్ధాలకు, గందరగోళానికి గురి చేస్తున్నాయి. మెగా డిఎస్‌సి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన నాటి నుంచి గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్‌సి డిమాండ్ ముందుకొచ్చింది. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలను నూటికి నూరు శాతం గిరిజనులకే ఇచ్చేందుకు ఉద్దేశించిన జిఒ నెం.3 ని తాము అధికారంలోకొస్తే పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడేమో ఆ ప్రస్తావన లేకుండా డిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసి టీచర్ పోస్టులు భర్తీ చేయ నిశ్చయించడం చూస్తుంటే ఎన్నికల్లో గిరిజన నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని మర్చిపోయినట్లే కనిపిస్తోంది. డిఎస్‌సిలో 1,600 పోస్టుల వరకు ఏజెన్సీలో వస్తాయి. వాటిని ఇతర ప్రాంతాల వారితో నింపితే స్థానిక గిరిజన యువతకు తీరని అన్యాయం వాటిల్లుతుంది. ఇది రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ప్రాంత గిరిజనుల హక్కులను కాలరాయడమే. యువత ఆందోళన బాట పట్టారు. మే 2న ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చారు. వారి ఆందోళనలతోనైనా జిఒనెం.3ని పునరుద్ధరించి ఎన్నికల హామీని టిడిపి కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. గిరిజనులకు ప్రత్యేక డిఎస్‌సి కోసం ఆర్డినెన్స్ తేవాలి.
డిఎస్‌సి అభ్యర్ధులను ఆందోళనకు గురి చేస్తున్న మరో అంశం మార్కుల అర్హత. ఎస్‌టి, ఎస్‌సి, బిసి, వికలాంగులకు తప్పనిసరిగా 45 శాతం మార్కులుండాలన్న నిబంధన ఆయా తరగతుల అభ్యర్ధులకు నష్టం కలిగిస్తుంది. ఇంటర్‌లో, డిగ్రీలో, పి.జి.లో 40 శాతం మార్కులొచ్చిన వారు డైట్, బిఇడి చేశారు. టెట్‌లో ఉత్తీర్ణత పొంది ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించారు. కాగా ఇప్పుడు 45 శాతం మార్కులను అర్హతగా పేర్కొనడం వలన వీరందరూ అన్యాయానికి గురవుతారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, వికలాంగులను ఉద్యోగానికి దూరం చేసే, సామాజిక న్యాయానికి తూట్లు పొడిచే ‘మార్కుల’ నిబంధనను సడలించాలని ఉద్యోగార్ధులు ముక్తకంఠంతో కోరుతున్నారు. అభ్యర్ధులను బాధిస్తున్న మరో ముఖ్యాంశం వయో పరిమితి. ఏడేళ్లుగా డిఎస్‌సి లేదు. ఉద్యోగం కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్న వారి వయసు మీరిపోయింది. ఈ తరుణంలో వయో పరిమితి 47 ఏళ్లు చేయాలన్న డిమాండ్ సహేతుకమైనది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. అభ్యర్ధులు పరీక్షలకు ప్రిపేర్ కావడానికి కనీసం 90 రోజుల సమయం ఇవ్వాలని, ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండాలన్న కోర్కెలూ వ్యక్తమవుతున్నాయి.
మెగా డిఎస్‌సి కోసం కూటమి ప్రభుత్వం తొలి సంతకం చేసి దాదాపు పది నెలలైంది. నిరుద్యోగుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా నోటిఫికేషన్ వచ్చింది. కసరత్తుకు బోల్డంత సమయం తీసుకుంది. విద్యాహక్కు చట్టం, హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల పోస్టులు భర్తీ కావాలని ఉపాధ్యాయ సంఘాలు తెలుపుతున్నాయి. పాఠశాలల విలీనం, జాతీయ విద్యా విధానం అమలు వలన టీచర్ పోస్టులు తగ్గుతున్నాయన్న ఆవేదన నెలకొంది. కూటమి ప్రభుత్వం మాత్రం 16 వేల చిల్లర పోస్టులనే భర్తీ చేస్తోంది. ఎస్‌సి రిజర్వేషన్ వర్గీకరణతో లింకు పెట్టి కొన్ని నెలలపాటు నోటిఫికేషన్‌ను వాయిదా వేసింది. ఎస్‌సి రిజర్వేషన్ వర్గీకరణపై పాక్షికంగానే నిర్ధారణ చేశారు. ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్‌గా అమలు చేస్తున్నారు. జనగణన పూర్తయ్యాక జిల్లా యూనిట్ అని చెబుతున్నారు. ఎస్‌సి వర్గీకరణ పద్ధతి ప్రకారం జరగలేదంటూ న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు పడ్డాయి. వాటిపై కోర్టులు ఏం నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు 1న అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తారు. ఇంతా చేసినా విద్యా సంవత్సరంలో రెండు నెలలు గడిచిపోతాయి. ఏమైనా అవాంతరాలొస్తే ఇంకెంత ఆలస్యమవుతుందో! నోటిఫికేషన్‌లో లోపాలను సరిదిద్ది రీనోటిఫికేషన్ ఇచ్చి తమకు న్యాయం చేయాలన్న అభ్యర్ధుల డిమాండ్‌ను అంగీకరించడం ప్రభుత్వ ధర్మం!