ఐరోపా పార్లమెంటు ఎన్నికలు- పెరిగిన నాజీ, ఫాసిస్టుల ముప్పు !

Jun 12,2024 05:30 #editpage

ఐరోపా యూనియన్‌ లోని 27 దేశాలలో జూన్‌ ఆరు నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగిన యూనియన్‌ పదవ పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఆందోళనకర సూచనలు వెలువడ్డాయి. అధికారికంగా ఫలితాల పూర్తి ప్రకటన వెలువడలేదు. నాలుగు దేశాల్లో లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి అందిన సమాచారం, ఫలితాల తీరుతెన్నుల ప్రకారం నయా నాజీ, ఫాసిస్టు, పచ్చి మితవాద శక్తులు బలం పుంజుకున్నాయి. ఈ పరిణామం ఐరోపా విధానాలనే తీవ్రంగా ప్రభావితం చేసేదిగా ఉంది. వివిధ దేశాలలో పాలక పార్టీలు, కూటములకు ఎదురు దెబ్బలు తగిలాయి. ఐరోపా సమాఖ్య వైఖరిలో వచ్చే మార్పులు, చేర్పుల గురించి చర్చ ప్రారంభమైంది.
పార్లమెంటులోని మొత్తం 720 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మెజారిటీ 361 స్థానాలు సాధించిన కూటమి ఎంచుకున్న నేత ఐరోపా కమిషన్‌ అధ్యక్ష పదవిని అధిష్టిస్తారు. కమిషన్‌ విధానాలను ఐరోపా పార్లమెంటు రూపొందిస్తుంది. ప్రతిదేశానికి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు.
ఈ ఎన్నికలలో ప్రస్తుతం సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్న ఉర్సులా వాండరె లెయన్‌ నాయకత్వంలోని యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీ (ఇపిపి) 191 సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. పచ్చి మితవాదులను అధికారంలోకి రాకుండా నిరోధించగలమని ఆమె చెప్పింది. మరోసారి ఆమె సమాఖ్య అధ్యక్ష స్థానం కోసం పోటీలో ఉన్నారు. ఐరోపా రాజకీయ పరిభాషలో ఇపిపిని మధ్యేవాద మితవాద పార్టీగా పరిగణిస్తారు. ఫ్రాన్సులో మారిన్‌ లీపెన్స్‌ నాయకత్వంలోని పచ్చి మితవాద ఐడెంటిటీ (ఉనికి)-డెమోక్రసీ (ప్రజాస్వామ్య) పార్టీ(ఐ.డి)కి 57 వచ్చాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ నాయకత్వంలోని యూరోపియన్‌ కన్జర్వేటివ్‌, రిఫార్మిస్టు (ఇసిఆర్‌) పార్టీకి 71 వచ్చాయి. ఈ మూడు పక్షాలూ గతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాయి. సోషలిస్టు మరియు డెమొక్రాట్స్‌ కూటమి (ఎస్‌.డి) రెండవ పెద్ద పక్షంగా 135 సీట్లు తెచ్చుకుంది. గుర్తింపు పొందని చిన్న పక్షాలు 95 గెలుచుకున్నాయి. గ్రీన్స్‌ పార్టీ 53, రెన్యూ (పునరుద్ధరణ) యూరోప్‌ (ఆర్‌.ఇ) 83, ఐరోపా వామపక్ష పార్టీ 35 సీట్లు తెచ్చుకుంది. గత ఎన్నికల్లో ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండెర్‌ లెయాన్‌ అభ్యర్థిత్వాన్ని సమర్ధించి గెలిపించిన పార్టీలు తాజా ఎన్నికల్లో 720కి గాను 402 స్థానాలను తెచ్చుకున్నట్లు వెల్లడైంది. అందువలన ఆమె తిరిగి మరోసారి అదే పదవిలో కొనసాగవచ్చు. ఆమె గనుక పచ్చి మితవాద పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తే తాము దూరంగా ఉంటామని, ఉదారవాద, మితవాద పార్టీల ప్రతినిధులు హెచ్చరించారు. ఆమె బలహీన పడిన గ్రీన్స్‌, ఇటలీ మితవాది మెలోనీ పార్టీ మద్దతు కోరవచ్చని కొందరు విశ్లేషకులు జోశ్యం చెప్పారు. హంగరీలో జాతీయవాద నేత విక్టర్‌ ఒర్బాన్‌ పార్టీ బలం తగ్గినా 44 శాతం తెచ్చుకుంది. ఇటలీలో మితవాద ప్రధాని మెలోనీ పార్టీ 30 శాతం తెచ్చుకుంది.
ఫ్రెంచి పార్లమెంటును ఆకస్మికంగా రద్దు చేయటంతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ రాజకీయాలకు తెరలేచింది. ఈ నెల 30, జులై ఏడున ఎన్నికలు జరగనున్నాయి. పదహారవ తేదీలోగా అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రకటన వెలువడిన వెంటనే ఐడి పార్టీ నాయకురాలు మారిన్‌ లీపెన్‌ దేశ పౌరులు ఈ ఎన్నికల్లో కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో ఆమె పార్టీ 31.5 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో ఉంది. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన జీన్‌ మారీ లీపెన్‌ కుమార్తె మేరీనే కాగా మనుమరాలు మారియో మార్చెల్‌ ఆమెతో వేరుపడి రికగ్నిట్‌ పేరుతో మరో పచ్చి మితవాద పార్టీని ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో మేనత్త మీద ఎలాంటి విమర్శలూ చేయలేదు, మితవాదులందరూ కలవాల్సిన అవసరం గతం కంటే నేడు ఎక్కువగా ఉందంటూ ఎన్నికల ఫలితాల తరువాత మారియో వ్యాఖ్యానించింది. మాక్రాన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించే మితవాద పార్టీలు మేరీ లీపెన్‌, మార్చెల్‌తో కలిసే అవకాశాలు ఉన్నాయి. వివిధ పార్టీలలో చీలికలు తెచ్చి తనవైపు తిప్పుకొనేందుకు మాక్రాన్‌ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు. అతగాడి అధ్యక్ష పదవీకాలం 2027 వరకు ఉంది. పార్లమెంటులో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంటే ఇబ్బంది కనుక వాటిని అడ్డుకొనేందుకు సర్వశక్తులూ వడ్డాలని చూస్తున్నాడు. సోషలిస్టులు, గ్రీన్స్‌, మరికొన్ని వామపక్ష పార్టీలు కూడా కూటమిగా ఏర్పడేందుకు చూస్తున్నాయి. ఐరోపా యూనియన్‌ ఎన్నికలలో సోషలిస్టు పార్టీ (పిఎస్‌)కు 14 శాతం ఓట్లు వచ్చాయి. కొన్ని సర్వేల ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో మక్రాన్‌ నాయకత్వంలోని రినైజాన్స్‌ పార్టీ (ఆర్‌.ఎన్‌) సగం స్థానాలను కోల్పోనున్నట్లు వెల్లడైంది.
జర్మనీలో పాలక కూటమిలోని సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ (ఎస్‌పిడి) 13.9 శాతం ఓట్లు తెచ్చుకొని మూడవ స్థానంలో ఉంది. పచ్చి మితవాద పార్టీ ఏఎఫ్‌డి 16 శాతం తెచ్చుకొని చరిత్ర సృష్టించింది. ప్రతిపక్ష క్రిస్టియన్‌ డెమొక్రటిక్‌ యూనియన్‌-క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ కూటమి 30 శాతం తెచ్చుకొని ప్రథమ స్థానంలో ఉంది. తూర్పు జర్మనీ ప్రాంతంలో ఎఎఫ్‌డి అగ్రస్థానంలో ఉంది. సంకీర్ణ కూటమిలోని సోషల్‌ డెమొక్రాట్స్‌ (ఎస్‌పిడి), పర్యావరణ గ్రీన్స్‌, ఫ్రీ డెమొక్రాట్స్‌ పార్టీలు వరుసగా 13.9-11.9-5.2 శాతాల చొప్పున తెచ్చుకొని చావు దెబ్బతిన్నాయి. దీంతో వెంటనే ఎన్నికలు జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. నాలుగింట మూడు వంతుల మంది జనం కూటమి పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని ఎన్నికల సర్వేలు వెల్లడించాయి.
ఉక్రెయిన్‌ సంక్షోభం, గాజాలో జరుగుతున్న పరిణామాలు, ఐరోపా అంతటా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం వంటి అంశాలన్నింటి కారణంగా మరింత భద్రత కావాలని ఓటర్లు కోరుకున్నారని, దాని మీద పచ్చి మితవాదులు వాగ్దానం చేశారని, ఈ ఎన్నికలు జాతీయ నాయకుల మీద జరిగిన ప్రజాభిప్రాయ వెల్లడి అని ఐరోపా సమాఖ్య విదేశీ సంబంధాల డిప్యూటీ డైరెక్టర్‌ వెసెలా టెక్నర్‌నెవా అన్నారు. ఐరోపాలో ఫాసిస్టు, నాజీ, పచ్చి మితవాద శక్తులు పుంజుకోవటమే కాదు, తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న ధోరణి కనిపిస్తున్నది. అయితే ఈ ఎన్నికల్లో అనేక మంది ఊహించిన మాదిరి అవి ఎక్కువ బలాన్ని పెంచుకోలేదు. మూడో వంతు సీట్లు తెచ్చుకోవటం రానున్న ముప్పును వెల్లడిస్తున్నది. ఇప్పటివరకు అనేక కారణాలతో వివిధ దేశాల్లోని ఈ శక్తుల మధ్య ఐక్యత లేదు, అసంఘటితంగా కూడా ఉన్నాయి. ఎవరికి వారుగానే పని చేస్తున్నారు. మితవాదులు, పచ్చి మితవాదులకు స్వల్ప తేడాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న పూర్వ రంగంలో పార్లమెంట్‌లో ఈ శక్తులు కలిస్తే పరిణామాలు ఎలా వుండేదీ చెప్పలేము. ఒక వేళ అదే జరిగితే వాటిని వ్యతిరేకించే వారందరూ ఒక కూటమిగా ఏర్పడవచ్చు, వారితో వామపక్షాలు కూడా చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. పచ్చి మితవాద శక్తులు బలం పుంజుకోవటం వలన పర్యావరణ, వలసలు, ఉక్రెయిన్‌కు సాయంతో సహా విదేశాంగ విధానంలో మార్పుల కోసం పట్టు పట్టవచ్చు, వేగంగా నిర్ణయాలు తీసుకోవటాన్ని అడ్డుకోవచ్చు.

ఎం. కోటేశ్వరరావు

➡️