విఫల నాయకుడి నిష్క్రమణ

అతడు పది సంవత్సరాల క్రితం లిబరల్‌ పార్టీకి అనూహ్య విజయం చేపట్టిన నేతగా నీరాజనాలు అందుకున్నాడు. ఇప్పుడు అతని ఉనికి పార్టీని పాతాళానికి దించుతుందంటూ అదే పార్టీ నేతలు తూర్పారపడుతున్నారు. అతడే కెనడా ప్రధాని, 53 సంవత్సరాల జస్టిన్‌ ట్రూడో. ఇంటా బయటా తలెత్తిన పరిస్థితి కారణంగా ఉక్కిరి బిక్కిరితో పార్టీ, ప్రభుత్వ పదవి నుంచి తప్పుకొంటూ సోమవారం నాడు ఆకస్మికంగా రాజీనామా ప్రకటన చేశాడు. ఈ నెల 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటు సమావేశాలను మార్చి 24 వరకు సస్పెండ్‌ చేశారు. వెంటనే పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ ప్రారంభం కాగానే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతామని మూడు ప్రధాన పార్టీలు ప్రకటించాయి. అదే జరిగితే ప్రభుత్వ పతనం ఖాయం. ట్రూడో ప్రకటన వెలువడిన వెంటనే డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించాడు. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా విలీనం కావటం మంచిదని గతంలో చేసిన ప్రకటనను పునరుద్ఘాటించాడు. అది అందరికీ మంచిదన్నాడు. రష్యా, చైనాల నుంచి పోటీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదన్నాడు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎన్నుకొనేంత వరకు ట్రూడో పదవుల్లో కానసాగుతాడు. వారం రోజుల్లో కొత్త నేతను ఎంపిక చేస్తామని లిబరల్‌ పార్టీ ప్రకటించింది. పార్టీలో తలెత్తిన కుమ్ములాటల కారణంగా పలుకుబడి పాతాళానికి పడిపోవటం, ఆర్థిక మంత్రి రాజీనామా, ఆర్థిక అనిశ్చితి, వాణిజ్య యుద్ధానికి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన తదితర అనేక కారణాలతో ట్రూడో రాజీనామా ప్రకటన చేశాడు. పార్టీలో అంతర్గత పోరు కారణంగా వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నడిపించటానికి తాను తగిన వాడిని కాదని, ఈ అంశంతో పాటు ప్రభుత్వంలో సంక్షోభం రాజీనామాకు కారణాలని ఆ సందర్భంగా చెప్పుకున్నాడు. రాజీనామా చేయటానికి ముందు అనేక మంది స్వంత పార్టీ ఎంపీలు గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. ట్రూడో ఏ మాత్రం కొనసాగినా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని అనేక సర్వేలు వెల్లడించాయి. గడచిన రెండు ఎన్నికల్లోనూ లిబరల్‌ పార్టీ తక్కువ శాతం ఓట్లతో ఎక్కువ సీట్లు తెచ్చుకొని మైనారిటీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. న్యూ డెమోక్రటిక్‌ పార్టీ (ఎన్‌డిపి)కి 17.82 శాతం ఓట్లు 25 సీట్లు వచ్చాయి. ఈ పార్టీ మద్దతుతో ట్రూడో నెట్టుకొచ్చాడు.

గతేడాది సెప్టెంబరులో న్యూ డెమోక్రటిక్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవటంతో అస్థిర పరిస్థితి ఏర్పడింది. 2025 అక్టోబరు వరకు పార్లమెంటు వ్యవధి ఉన్నప్పటికీ ఏ క్షణంలోనైనా పార్లమెంటు రద్దు, మధ్యంతర ఎన్నికలు రావచ్చని భావించారు. అయితే సమస్యను బట్టి తాము మద్దతు లేదా వ్యతిరేకించటం చేస్తామని ఎన్‌డిపి ప్రకటించటంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అయితే డిసెంబరు 16న ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ రాజీనామాతో పాలక పార్టీలో లుకలుకలు తీవ్రమయ్యాయని చెప్పవచ్చు.
పెరుగుతున్న ధరలు రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయని రెండు సంవత్సరాల క్రితం 33 శాతం మంది కెనడా పౌరులు చెబితే 2024లో 45 శాతానికి పెరిగినట్లు సామాజిక సర్వే వెల్లడించింది. ఇళ్ల అద్దెలు భరించలేకుండా ఉన్నామని 38 శాతం చెప్పారు. 2021 నుంచి ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల వలన ప్రతి ఐదుగురిలో ఒకరు సామాజిక సంస్థల నుంచి తక్కువగానో ఎక్కువగానో ఆహారాన్ని పొందినట్లు చెప్పారు. ఆర్థిక సమస్యలతో స్వల్పంగా లేదా తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురైనట్లు 35 శాతం చెప్పారు. తక్కువ ఆదాయం వచ్చే వారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అద్దె ఇళ్లలో ఉండే వారిలో జీవన సంతృప్తి చాలా తక్కువగా ఉంది. వయసు మీరిన వారి కంటే యువత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది. 25-44 సంవత్సరాల వయస్సులో ఉన్నవారిలో 55 శాతం మంది ధరల పెరుగుదల గురించి ఆందోళన వెల్లడించారు. వృద్ధులలో 28 శాతం ఉన్నారు. ఫుడ్‌ బ్యాంకులు, సామాజిక సంస్థల నుంచి ఆహారాన్ని పొందుతున్నవారు యువకులలో 46-47 శాతం ఉండగా వృద్ధులలో 27-28 శాతం ఉన్నారు. పిల్లలపై ధరల పెరుగుదల ప్రతికూల ప్రభావం గురించి చెప్పనవసరం లేదు. ఆర్థికంగా కెనడా తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొంటోంది.

ధనిక దేశాల్లో తలెత్తిన సంక్షోభం 2008 నుంచి నేటి వరకు కెనడాలో అనిశ్చితి సూచిక తీవ్ర వడిదుడులకు లోనవుతున్నది. రెండు వేల సంవత్సరం నుంచి 2008 వరకు 50 నుంచి 200 మధ్య కదలాడగా తరువాత అది వంద నుంచి 400 మధ్య ఊగిసలాడింది. 2020 కరోనా సమయంలో గరిష్టంగా 690, గతేడాది 650గా ఉంది. ట్రూడో ప్రకటనతో ఈ ఏడాది అది మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్టోబరులోగా ఎన్నికలు జరగాల్సి ఉండగా పెట్టుబడిదారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేదు. తమ ప్రాజెక్టులను తాత్కాలింగా నిలిపివేయటం లేదా వాయిదా వేసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇది ఉపాధి మీద కూడా తీవ్ర ప్రభావం చూపటం అనివార్యం. నూతన నియామకాలు పరిమితం అవుతాయి. కరెన్సీ కెనడా డాలరు విలువ కూడా గత వారంలో పతనమై కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధాని రాజీనామా ప్రకటన తరువాత స్వల్పంగా పెరిగినప్పటికీ అనిశ్చితిలో కొనసాగవచ్చు. కెనడా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. దిగుమతి చేసుకొనే వస్తువులపై 25 శాతం పన్ను విధిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన గురించి తెలిసిందే. ఆర్థిక రంగంలో అనిశ్చిత పరిస్థితి ఉన్న కారణంగా దీని గురించి బేరమాడే శక్తి కెనడాకు తగ్గుతుంది. ట్రంప్‌ చర్య అమెరికా వినియోగదారుల మీద భారాలు మోపినప్పటికీ కెనడా ఎగుమతుల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపనుంది. 1985 నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలలో కెనడా మిగులులో ఉంది. తమ వస్తువులను మరింతగా దిగుమతి చేసుకోవాలని అమెరికా ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది.

గత కొద్ది నెలలుగా పార్టీ ఎంపీలు అనేక మంది డిమాండ్‌ చేసినప్పటికీ రాజీనామాకు ససేమిరా అన్న ట్రూడో డిసెంబరులో జరిగిన పరిణామంతో దిగిరాక తప్పలేదు. ప్రధానితో తన విబేధాల గురించి ఫ్రీలాండ్‌ రాజీనామా లేఖలో వెల్లడించారు. రాజకీయ జిమ్మిక్కులు భారీ మూల్యం చెల్లిస్తున్నాయంటూ పరోక్షంగా చేసిన విమర్శల లేఖను బహిర్గతం చేయటంతో వత్తిడి మరింత పెరిగింది. ఈ ఏడాది బడ్జెట్‌ లోటు 20 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా వేయగా అది 60 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. బడ్జెట్‌ లోటు, ఆర్థిక అసమానతలను తగ్గిస్తానంటూ యువకుడిగా రంగంలోకి దిగిన ట్రూడోకు యువతరం బ్రహ్మరధం పట్టటంతో 2015లో ఘన విజయం లభించింది, ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరించాడు. తీవ్రమైన అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కొన్నాడు. ట్రూడో రాజీనామాతో పాలక లిబరల్‌ పార్టీ, ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీ నుంచి ప్రధాని పదవికి పోటీ పెరిగింది. మంత్రి పదవికి రాజీనామా చేసిన క్రిస్టియా ఫ్రీలాండ్‌, ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్న భారతీయ సంతతికి చెందిన అనిత ఇందిరా ఆనంద్‌, విదేశాంగ మంత్రి మెలీనా జోలీ కూడా ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా గవర్నర్‌గా పని చేసి ట్రూడోకు సలహాదారుగా ఉన్న మార్క్‌ కార్నే కూడా రేసులో ఉన్నాడు. ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చిన కార్బన్‌ పన్ను విధింపు ఇతగాడి సలహా మేరకే జరిగింది. మూడు సార్లు ఓట్లు అధికంగా తెచ్చుకున్నప్పటికీ అవసరమైన సీట్లు తెచ్చుకోవటంలో విఫలమైన ప్రతిపక్ష నేత పిరే పోయిలివరే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధం అవుతున్నాడు. ఒక టీవీ జరిపిన సర్వేలో పిరేకు 44.2 శాతం మంది మద్దతు ప్రకటించగా ట్రూడోకు 24 శాతం ఉన్నారు. కరోనా తరువాత వివిధ దేశాలలో జరిగిన ఎన్నికల తీరుతెన్నులను చూస్తే అధికారంలో ఉన్నవారందరూ దాదాపు ఓడిపోయారు. కెనడాలో కూడా లిబరల్‌ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. రకరకాల ఆకర్షక వాగ్దానాలతో మద్దతు పొందిన వారిని హృదయ సామ్రాట్టులుగా జేజేలు కొట్టిన జనమే…తీరు మారితే ఏ విధంగా తరిమి కొట్టారో బంగ్లాదేశ్‌, శ్రీలంక పరిణామాలు స్పష్టం చేశాయి. మన దేశంలో పాలక పార్టీలు వీటి నుంచి గుణపాఠాలు తీసుకుంటాయా?

-ఎం. కోటేశ్వరరావు

➡️