సంక్రాంతి తెలుగువారి పెద్ద పండగ. పండగ సందడితో పల్లెలు శోభాయమానంగా రూపుదిద్దుకుంటాయి. సంక్రాంతి అంటే రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగి మంటలు, పిండి వంటలు. సంక్రాంతి పండగ సంప్రదాయ కళలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, గ్రామీణ క్రీడలకు నెలవు. ఇటువంటి సరదాల పండగలో వేల కోట్ల రూపాయలు చేతులు మారే భయంకర జూదం ఏటికేడు కొత్త పుంతలు తొక్కుతూ స్థిరపడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ బాహుబలి గాంబ్లింగ్‌నకు ఏలికలు అండదండగా నిలవడం, పలువురు ప్రత్యక్షంగా పాల్గొనడం, నిర్వహించడం ఎవరు అధికారంలో ఉన్నా ఆనవాయితీ కావడం ఆవేదనకు గురి చేస్తుంది. కోర్టు ఆదేశాలు, చట్టాలు, పోలీస్ నిఘా ఇవేవీ భారీ జూదానికి అడ్డు కాకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. సంక్రాంతి అనగానే స్ఫురణకు వచ్చేవి కోడి పందేలు. అక్కడక్కడ ఎడ్ల, పొట్టేళ్ల, గుర్రాల ఇత్యాది పందేలూ నిర్వహిస్తారు. సంప్రదాయాల పేరిట నిర్వహించే ఈ పందేల కేంద్రంగా అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలే ప్రధానంగా నిలుస్తున్నాయి. చీట్ల పేక, గుండాట దగ్గర నుంచి అత్యాధునిక కేసినో వరకు జూద క్రీడలదే హవా. రెండు మూడు రోజుల్లో కోట్లు కొల్లగొట్టడానికి వాటంగా ఉన్నందునే వీటిపై నిర్వాహకులకు అధిక మక్కువ.
కోడి పందేలనగానే టక్కున గుర్తుకొచ్చేవి గోదావరి జిల్లాలు. కోడి పందేలకు రాజధానిగా భీమవరం విరాజిల్లుతుండగా ఆ సంప్రదాయాన్ని పుణిచిపుచ్చుకుంటున్నాయి రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలు. ఎక్కడో మారుమూలన రహస్యంగా జరిగే పందేలు రానురాను జాతీయ, రాష్ట్ర రహదారుల మీదికొచ్చేశాయి. కొన్ని చోట్ల నగర, పట్టణ నడుబొడ్డున ఎలాంటి భయం లేకుండా పందేలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే బరులు క్రికెట్ స్టేడియాలను తలపింపజేస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు ఎంత మాత్రం తీసిపోవడం లేదు. సినిమా సెట్టింగ్‌లను మించిన వైభోగం కోడి పందేల బరుల వద్ద కనిపిస్తోంది. ఎకరాలకు ఎకరాల్లో నిర్వహించే పందేల వీక్షకుల కోసం గ్యాలరీలు, ఎల్‌ఇడి స్క్రీన్లు, రాత్రిపూట పందేల నిర్వహణ కోసం మిరుమిట్లు గొల్పే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. పందెం రాయుళ్ల సౌకర్యార్ధం జిఎస్‌టి, ఇడి, ఐటి వంటి ఇబ్బందుల్లేకుండా స్పాట్ క్యాష్ విధానం, బ్లాక్ మనీ చెలామణి వంటి సదుపాయాలు పుష్కలంగా అమల్లో ఉన్నాయి. వైట్ మనీ చెలామణి కోసం డిజిటల్ పేమెంట్లు సైతం నడుస్తున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఆఫ్‌లైన్ ముందస్తు ఒప్పందాలు ఉండనే ఉన్నాయి. పందేల్లో పాల్గొనే వారు ఆస్తుల తనఖా, బంగారు ఆభరణాల తాకట్టు సౌలభ్యం కూడా ఉంది. ఇంత యధేచ్ఛగా జూదం బరితెగించినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు, ఐటికి మారుపేరుగా చెప్పుకునే ప్రభుత్వ దృష్టికి రాకపోవడం విడ్డూరమే!
ఈ మూడు రోజులూ రాష్ట్రంలో నిర్వహించే జూదం విలువెంతో ఊహించలేం. రూ. ఐదారు వేల కోట్లకు పైమాటేనన్నది ఆరి తేరిన కన్సల్టెన్సీల, ఆన్‌లైన్ బెట్టింగ్ ఏజెన్సీల మాట. ఆ అంచనా కూడా తక్కువేనని, అంతకు నాలుగైదు రెట్లని చెప్పేవారూ ఉన్నారు. అన్నేసి వేల కోట్ల జూదం జరిగిందంటే దానర్ధం అంత మేరకు వ్యసనపరులు పోగొట్టుకున్నారన్నమాట. సంక్రాంతి జూదంలో ఆస్తులు, డబ్బు పొగొట్టుకొని అప్పుల పాలైన, వీధిన పడ్డ కుటుంబాలనేకం. జూదంతోనే ఆగట్లేదు. మద్యం వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ ముసుగులో అక్రమ, నాసిరకం మద్యం వచ్చి పడుతోంది. సారాపై నిషేధం ఉన్నా కాపుసారా కోడి పందేల బరులను ముంచెత్తుతోంది. జిల్లాలు, రాష్ట్రాలు దాటి కార్లలో సైతం కోడి పందేల్లో పాల్గొంటున్నారంటే అది సరదా కాదు. జాక్ పాట్ తగులుతుందన్న ఆశ. తక్కువ సమయంలో అధిక మొత్తం చేజిక్కించుకోవాలన్న ఫోబియా. ఈ సంస్కృతి నయా-ఉదారవాదం నుంచి పుట్టుకొచ్చింది. ఈ వాదం తెలుగు పల్లెల్లో వేళ్లూనుకోవడం విషాదం. ఇటువంటి దారుణ పరిస్థితిని వెనక్కికొట్టి అందరికీ సంతోషాన్ని పంచే మన సంప్రదాయ సంస్కృతిని రక్షించుకుంటేనే తెలుగు వారికి నిజమైన సంక్రాంతి! అటువంటి సందడి కావాలి!