కాంట్రాక్టు కార్మికులను తొలగించడానికి వీల్లేదంటూ ఐక్యంగా పోరాడిన విశాఖ ఉక్కు కార్మికులు ఘన విజయం సాధించడం హర్షణీయం. ప్రైవేటీకరణలో భాగంగా కాంట్రాక్టు కార్మికులను భారీగా తగ్గించడానికి యాజమాన్యం చేసిన కుట్రను ఐక్య పోరాటం ద్వారా అడ్డుకున్నారు. వేలాదిమంది కాంట్రాక్టు సిబ్బందితో పాటు రెగ్యులర్ కార్మికులు రెండు రోజుల పాటు కదం తొక్కడం, వారికి మద్దతుగా వివిధ కార్మిక, ప్రజా సంఘాలు భుజం కలపడంతో ఈ విజయం సాకారమైంది. నినాదాలు, ఆందోళనలు, రాస్తారోకోలతో బుధవారం ఉద్యమించిన కార్మిక ప్రవాహాన్ని అదుపు చేయడానికి పోలీసుల సహాయంతో యాజమాన్యం చేసిన ప్రయత్నాలు విఫలం కాక తప్పలేదు. ఎట్టకేలకు దిగివచ్చిన యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ‘ఎవరినీ తొలగించం, అందరినీ విధుల్లో కొనసాగిస్తాం’ అని లేబర్ కమిషనర్ సమక్షంలో రాతపూర్వకంగా ఒప్పుకోవడంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం కావడమేగాక వారి ఆత్మ విశ్వాసమూ పెరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం కాంట్రాక్టు కార్మికులను ఎవరినీ తొలగించబోమని, ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో తొలగించిన 3,700 మంది కాంట్రాక్టు కార్మికుల లేబర్ పాస్‌లను, అలాగే సిస్టంలో బయోమెట్రిక్ డేటాబేస్‌ను కూడా పునరుద్ధరిస్తామని చెప్పింది. పాత పద్ధతిలోనే గేట్ పాస్‌లను కొనసాగించడానికి అంగీకరించక తప్పలేదు. కేంద్ర లేబర్ కమిషనర్ మహంతి మాట్లాడుతూ కార్మికుల ఉపాధి పరిరక్షణ, స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి పెంపుదల వంటి అంశాలపై యాజమాన్యం దృష్టి సారించాలని సలహా చెప్పింది కార్మికుల పోరాట శక్తిని ఆయన గుర్తించినందునేనని అవగతం చేసుకోవాలి. ఇదే స్ఫూర్తితో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, సెయిల్‌లో విలీనాన్ని సాధిస్తామని కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రకటించడం కార్మికవర్గ విజయోత్సాహానికి ప్రతిబింబం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రభుత్వ వాటాలు అమ్మేసి ప్రైవేటుకు అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ శాఖ (దీపమ్) కార్యదర్శి ప్రకటన వెలువడినప్పటి నుండి గడచిన మూడున్నరేళ్లకు పైగా ఉక్కు కార్మికులు నిలకడగా ఐక్యంగా పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండిగా తాను అనుకున్నట్టే ప్రైవేటీకరిస్తానంటోంది. ఉద్యోగులు, కార్మికుల జీతాలు చెల్లింపునకు కూడా ఇబ్బందులు పెడుతోంది. ఉత్పత్తిని కునారిల్లజేస్తోంది. మూడు ఫర్నేసులున్న ప్లాంటులో ఒక్క ఫర్నేస్ మాత్రమే ప్రస్తుతం పని చేస్తోంది. అది కూడా ఎన్ని రోజులు నడుస్తుందో చెప్పలేని పరిస్థితి. కోకింగ్ కోల్ నిల్వలు కూడా నిండుకుంటున్నాయి. అయితే, విశాఖతోపాటు రాష్ట్రంలోనూ ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో ప్లాంటు ప్రైవేటీకరణకు పాలకులు సాహసించలేక ముడి సరుకు చాలదనీ, వర్కింగ్ క్యాపిటల్ లేదనీ సాకులు చెప్పి ఉక్కు కర్మాగారం ఉసురు తియ్యాలని కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే తాజాగా నాలుగు వేలమంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు కూడా! బుధవారంనాటి విజయం ఐక్య పోరాటం వల్లనే సాధ్యమైంది. అలాగే పట్టువదలని విక్రమార్కుల్లా గట్టిగా నిలకడగా ఆందోళన చేయడంవల్లనే అటు యాజమాన్యం ఇటు ప్రభుత్వమూ లొంగివచ్చాయి. ఎన్నో ఆందోళనల్లో ‘పోరాట మార్గం- సరైన మార్గం’ అన్న నినాదాలు మార్మోగుతుంటాయి. అది ఎంత నిజమో బుధవారంనాడు ఉక్కు కార్మికులు మరోసారి రుజువు చేశారు. కనుక అదే మన ముందున్న మార్గం తప్ప పైరవీలు, తెరచాటు మాటలూ కాదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు మానుకోకపోతే కార్మికవర్గ ఐక్యతను, తెలుగోడి సత్తాను చూపుతామని కేంద్ర బిజెపి ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలి. అశేష త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవడం అందుకు ఐక్యంగా పట్టుదలగా పోరాడడమే రాష్ట్ర ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం. కార్మికోద్యమాన్ని, ప్రజల సంఘీభావ కార్యకలాపాలనూ మరింత ముమ్మరం గావించాలి. తద్వారా మాత్రమే ప్రభుత్వాలపై ఒత్తిడి నిర్మించగలం. ప్రైవేటీకరణను తిప్పిగొట్టగలం.
