ఎట్టకేలకు…

Mar 12,2025 05:59 #Articles, #edit page, #pranay

తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో దళిత యువకుడు ప్రణయ్ కులదురహంకార హత్య కేసులో నల్గొండ ఎస్‌సి, ఎస్‌టి కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అటువంటి దురాగతాలకు పాల్పడిన వారికి హెచ్చరికలాంటిది. ఒకరికి ఉరిశిక్ష, మిగతా ఆరుగురికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పు ప్రణయ్ భార్య అమృతకు, ఆయన కుటుంబానికి కొంత ఊరట. తెలుగునాట కమ్యూనిస్టులు, హేతువాదులు సమరశీల పోరాటాలతోపాటు కుల, మతాలకు అతీతంగా ఎన్నో ఆదర్శ వివాహాలు చేశారు. నాటి సమాజాన్ని ఎదిరించి బాల్య వివాహాల నివారణ, వితంతు పునర్వివాహాలు చేసిన కందుకూరి వీరేశలింగం లాంటి ఎందరో ఆదర్శనీయులు తెలుగు నాట వెలిశారు. అయితే ఇప్పుడు కొన్నిచోట్ల కులం తెగులు పొడసూపుతుండటం ఆందోళనకరం. 21వ శతాబ్దంలో సైతం మధ్య యుగాల నాటి హీన సంస్కృతిని కీర్తిస్తూ… కుల, మత, దురహంకార చర్యలను, దాడులను ప్రోత్సహించే, సమర్ధించే మనువాద పాలకులు దేశాన్ని ఏలుతుండటం కూడా ఇందుకు ఆజ్యం పోస్తోంది.

2018 నాటి ఘటన నేటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించిన భర్తను కోల్పోయి, గర్భంతో ఉన్న అమృతకు అభ్యుదయ శక్తులు అండగా నిలవగా, మనువాదులు లవ్‌ జీహాద్‌ పేరుతో నానాయాగీ చేసిన తీరు నేటికీ ఖండనార్హమే! ఇప్పుడు సైతం ఆమె వ్యక్తిగత జీవితంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుండటం అనాగరికం. కులం పరువు కాపాడటానికే హత్య చేయించానని అప్పట్లో ప్రకటించిన అమృత తండ్రి మారుతీరావు కరడుగట్టిన ఫ్యూడలిస్టు మనస్తత్వానికి ఓ నమూనా! నాటి నుంచి అలుపెరగకుండా పోరాడిన అమృత, ప్రణయ్ తల్లిదండ్రులు అభినందనీయులు. సామాజిక దురాచారాలు, ఫ్యూడలిస్టు సంస్కృతి, పితృస్వామ్య ఆధిపత్య భావజాలం కలిసికట్టుగా సాగించిన దాడిలో బలైన వారిలో అత్యధికులు దళితులు, అణగారిన వర్గాల వారే. దళితులపైన, ముస్లింలపైన దాడుల పరంపర సాగిస్తూ, విషం చిమ్మటం కులతత్వ, మతోన్మాద శక్తులకు నిత్యకృత్యంగా మారిపోయింది. భారత రాజ్యాంగం కుల, మత, లింగ ఆధారంగా వివక్షను నిషేధించింది. 1955 హిందూ వివాహ చట్టం కులాంతర వివాహాలను చట్టబద్ధం చేసింది. ఎన్ని చట్టాలున్నా… దేశవ్యాప్తంగా దాష్టీకాలు సాగిపోతూనే ఉన్నాయి. 2016లో తమిళనాడు దళిత యువకుడు గౌతమ్‌, ప్రియాంక జంట, 2018లో కర్ణాటక మండ్య జిల్లాలో దళిత యువకుడు కృష్ణప్ప, శ్రుతి, 2019లో హర్యానా హిస్సార్‌ జిల్లాలో దళిత యువకుడు అమర్‌, మనీష దారుణంగా హత్యకు గురై, ఆనవాళ్లు లేకుండా బుగ్గిపాలైనవారే. 2021లో గుంటూరు జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్నందుకు విగత జీవులుగా మారిన అమర్‌, ప్రియాంకలదీ ఇదే కథ. 2023లో తెలంగాణలో దళిత యువకుడు హోన్నప్ప హత్యకు గురయ్యాడు. అంతెందుకు ఈ వారంలోనే చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రేమవివాహం చేసుకున్న జంటపై కత్తితో దాడి చేసి అమ్మాయి తండ్రి తీవ్రంగా గాయపరిచాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో తమ మాట కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని కుటుంబమంతా కలిసి కూతుర్ని చంపేసి, ఇంటి సమీపంలోనే పూడ్చేసిన ఉదంతం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పద్మనాభసత్రంలో వెలుగుచూసింది. కుల దురహంకార హత్యలు జరిగినప్పుడల్లా దోషులను కఠినంగా శిక్షిస్తామంటూ ప్రకటిస్తున్నా, శిక్షలు పడటానికి చాలా సమయం పట్టడం, కొన్ని కేసుల్లో అసలు శిక్షలే లేకపోవడం సరికాదు. కుల దురహంకార హత్యలను ‘పరువు హత్యలు’ అని పాలకులు, మీడియా పిలవడం కూడా సరైనది కాదు. సామాజిక హోదా, సాంప్రదాయం, కులం లేదా మతపరమైన కట్టుబాట్లకు భిన్నంగా తల్లిదండ్రుల అనుమతి లేకపోయినా నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటే కుటుంబ పరువు ప్రతిష్టలకు నష్టం జరిగిపోతోందనే భావనే తప్పు. పరువు హత్యలు (హానర్‌ కిల్లింగ్స్‌) అనే పదాన్నే మార్చాలని ఐరాస మానవ హక్కుల కమిషన్‌ చాలాఏళ్ల క్రితమే చెప్పినా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు గాని, నేటి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి గానీ పట్టలేదు. ఈ కేసులో లాగానే… మిగతా కేసుల్లో కూడా శిక్ష పడుతుందన్న భయం మనువాద భావజాలం తలకెక్కిన ఉన్మాదులకు అర్థం కావాలి. ప్రజల్లో కుల, మత, ఛాందసవాద భావనలను తొలగించేందుకు ప్రజాతంత్ర, అభ్యుదయగాముకులు కృషి చేయాలి. సామాజిక చైతన్యం, న్యాయ వ్యవస్థ ఇందుకు తోడ్పాటునందించాలి.

➡️