ఆహారం వృథా అవుతోంది!

Apr 4,2024 04:05 #artical, #edite page

సకల జీవరాశుల మనుగడకు ఆహారం తప్పనిసరి. అటువంటి ఆహారాన్ని ప్రతిరోజూ టన్నుల కొద్దీ పారబోస్తున్నామట. ఇది నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద పర్యావరణ, ఆర్థిక సవాళ్లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఏటా ఆహారం వృథా కావడం మానవాళికి సిగ్గుచేటు. ఆహార వ్యర్థాలను తగ్గించి ఆకలితో ఉన్న వారికి అందజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1.05 బిలియన్‌ టన్నుల ఆహారం వృథా అయ్యింది. మరోవైపున ప్రపంచ వ్యాప్తంగా 783 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అంటే జనాభాలో మూడవ వంతు ఆహార అభద్రతతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది మొత్తం ఆహార పదార్థాలలో 19 శాతం. వినియోగదారులకు అందుబాటులో వున్న మొత్తం ఆహారంలో దాదాపు ఐదవ వంతు వృథా అవుతున్నది. సగటున ప్రతీ వ్యక్తీ 79 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఇందులో పావు శాతం ఆదా చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆకలితో నకనకలాడే కోట్లాది మందికి ఆహారాన్ని అందించవచ్చు. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ వేసిన అంచనా ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయిన ఆహారంలో దాదాపు 40 శాతం ఆహారం ప్రతి సంవత్సరం వృథా అవుతున్నది. దేశంలో దాదాపు 23 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. జనాభాలో 15 శాతం మంది ప్రతి రోజూ ఆకలితో అలమటిస్తున్నారు. నలుగురి పిల్లలలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దాదాపు 3000 మంది ప్రతిరోజు సరైన ఆహారం లేని కారణంగా అనారోగ్యంతో మరణిస్తున్నారు. అందుకే ఆహారం వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది. అవసరమైనప్పుడు మాత్రమే అవసరమైనంత వరకే ఆహారాన్ని కొనుగోలు చేయాలి. ఆహారాన్ని సరిగ్గా భద్రపరచాలి. మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి ఉపయోగించడం, అదనపు ఆహారాన్ని అవసరమైన వారికి అందించడం, ఫుడ్‌ బ్యాంకులకు పంపించడం మొదలైనవి చేయాలి. పండ్లు వంటి వాటిని నిల్వ చేయడానికి శీతల గిడ్డంగులును నెలకొల్పాలి. నిల్వకు శాస్త్రీయ పద్ధతులను పాటించాలి.
– జనక మోహనరావు దుంగ,
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌,

➡️