పారదర్శకతకు పాతర!

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్ని ఓట్లు పోలైనదీ వెబ్‌సైట్‌లో వెల్లడించడానికి భారత ఎన్నికల కమిషన్‌ (ఇసి) నిరాకరించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను, అందునా సాక్షాత్తూ ఇసి విశ్వసనీయతనూ ప్రశ్నార్ధకం చేస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పబడే భారత్‌లో ఆ ప్రజాస్వామ్య ప్రక్రియలో అతి కీలకమైన పోలింగ్‌ సమాచారాన్ని వెల్లడించడంలో ఇసి ఇలా మీనమేషాలు లెక్కించడం దేశ ప్రతిష్టకు కూడా భంగకరం. ఓటింగ్‌ శాతం వివరాలను వెల్లడించడానికి తొలి దశ పోలింగ్‌ ముగిశాక 11 రోజులు, రెండో దశ పూర్తయ్యాక నాలుగు రోజులూ పట్టడం విస్తుగొలుపుతోంది. అంతేగాక పోలింగ్‌ ముగిసిన తరువాత ప్రకటించిన దానికంటె నాలుగైదు శాతం అధికంగా జరిగిందని తుది ఓటింగ్‌ వివరాలు వెల్లడించడం సందేహాలను మరింత పెంచుతోంది. ఇసి డేటా విశ్వసనీయతపైనే నీలినీడలు ముసురుకుంటున్న పరిస్థితి. గత ఎన్నికలన్నిటా పోలింగ్‌ ముగిసిన 24 గంటల్లోనే తుది వివరాలు వెల్లడించిన కమిషన్‌ ఈ ఆధునిక ఇంటర్నెట్‌ యుగంలో ఇంత ఆలస్యం ఎందుకు చేస్తోందన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. మోడీ మాయాజాలంలో ఏం కిరికిరి జరుగుతుందోనన్న అనుమానాలెన్నో!
ఓటింగ్‌ నిర్దిష్ట వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని ప్రతిపక్ష పార్టీలు ఇసికి విన్నవించినా లక్ష్యపెట్టలేదు. మీడియాకు గానీ ఈ అంశాలపై ఆసక్తికలిగిన సంస్థలకు, వ్యక్తులకు కూడా మొహం చాటేసిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటింగ్‌ వివరాలను ఇసి తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని, దీనిపై ఇసికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌, కామన్‌ కాజ్‌ సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఎన్నికల కమిషన్‌ బుధవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన 225 పేజీల అఫిడవిట్‌లో పోలింగ్‌ కేంద్రాల వారీగా ఎన్ని ఓట్లు పోలైనదీ వెల్లడించాలన్న చట్టపరమైన ఆదేశాలేవీ లేవని పేర్కొనడం ఘోరమైన విషయం. పోలింగ్‌ కేంద్రంలో పోలైన ఓట్ల సంఖ్యను తెలియజేసే ఫారం-17సిని స్కాన్‌ చేసి, దానిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని చట్టంలో ఎలాంటి ఆదేశాలు లేవనడం తప్పించుకునే ప్రయత్నమే తప్ప న్యాయస్థానం ఎదుట నిజాలు చెప్పే విధానం కాదు. పైపెచ్చు ఆ వివరాలు వెల్లడించడం వల్ల గందరగోళానికి ఆస్కారం ఏర్పడుతుందని, ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉన్నదని ఇసి పేర్కొనడం హాస్యాస్పదం. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఫారం-17సి పోలింగ్‌ ఏజెంట్‌ పొందవచ్చునని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చింది. మొదటి, రెండవ విడత పోలింగ్‌ ముగిసిన తర్వాత ఇసి వెల్లడించిన పోలింగ్‌ శాతం కంటే ఆ తర్వాత విడుదల చేసిన ఓటింగ్‌ శాతం 5-6% ఎక్కువగా ఉన్నదని వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చడం బుకాయింపే! అలాగే ఇసి తన అఫిడవిట్‌లో పిటిషనర్లపై మండిపడుతూ కొన్ని శక్తులు తమ స్వప్రయోజనాల కోసం నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేయడం ఉడుకుమోత్తనం తప్ప వేరేమీ కాదు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఫారం-17సిపై ప్రిసైడింగ్‌ అధికారి సంతకం చేసి ఏజెంటుకు ఇస్తారు కనుక అది బహిరంగ సమాచారమేననీ, దాన్ని ఇసి తన వెబ్‌సైటులో ఉంచితే సమస్య ఏముంటుందన్న ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితి ఇసికి లేదు.
ఇటువంటి నేపథ్యంలో ఓటింగ్‌ వివరాల వెల్లడిపై ఇసిని ఆదేశించలేమని సర్వోన్నత న్యాయస్థానం సైతం చేతులెత్తేయడం ప్రజాస్వామిక శక్తులకు తీవ్ర నిరాశ కలిగించింది. భారత ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు, ప్రపంచానికీ విశ్వసనీయత కలగాలంటే ఎన్నికల కమిషన్‌ నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం కలగాలి. అది ఎంతో అవసరం. అంతేగాక సకల రాజ్యాంగ వ్యవస్థల్లోకి సంఫ్‌ుపరివార్‌ శక్తులను చొప్పించిన నరేంద్రమోడీ పాలనలో ఎక్కడ ఏవైనా అక్రమాలు, రాజ్యాంగ ఉల్లంఘనలూ చోటుచేసుకునే ప్రమాదముంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిందే!

➡️