రాయలసీమను ‘గ్రీన్ ఎనర్జీ హబ్’గా, ‘హర్టికల్చర్ హబ్’గా మారుస్తానని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పండే రకరకాల పళ్ళను అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించి రాయలసీమ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తానంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని చిత్రావతి ప్రాజెక్టు దగ్గర 600 మెగావాట్ల అదాని పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు నుండి 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రాయలసీమ జిల్లాల మీదుగా 250 కి.మీల ప్రత్యేక ట్రాన్స్‌మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా వెలుగులు నింపుతానంటున్నారు. గోదావరి జలాలను బనకచర్ల ద్వారా రాయలసీమకు తెచ్చి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామంటున్నారు. గతంలో బిజెపి వారు రాయలసీమ డిక్లరేషన్ ద్వారా రతనాల సీమగా మారుస్తామన్నారు. అధికార వికేంద్రీకరణ చేసి రాయలసీమను అభివృద్ధిలో పరుగులెత్తిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలోని కడప ఉక్కు, బెంగళూరు-హైదరాబాద్ కారిడార్, కేంద్ర పరిశ్రమలు ఇలా ఒక్కటేమిటి ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్నెన్ని మాటలు చెప్పారు! ఒక్క రాయలసీమకే కాదు. వెనుకబడిన ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ పార్టీల నేతలంతా పోటీలు పడి మాటల గారడీలు చేశారు. చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఎత్తుకున్న రాయలసీమ గ్రీన్ ఎనర్జీ వల్ల రాయలసీమ ఏ రంగంలో అభివృద్ధి చెందుతుందో పాలకులు చెప్పాలి. 12 శాతం సాగుభూమికి మాత్రమే నీరందే అవకాశమున్న రాయలసీమ జిల్లాలకు సాగునీరు వస్తుందా? పారిశ్రామిక, సేవా రంగాల్లో అథమ స్థానాల్లో వున్న ఈ జిల్లాలు పై స్థానాలకు చేరుతాయా? నిరుద్యోగం తగ్గుతుందా? వలసలు, ఆత్మహత్యలు ఆగుతాయా? ప్రజల బ్రతుకులు ఎలా మారతాయో పాలకులు చెప్పాలి. ఈ నెలలో కర్నూలు జిల్లా కోసగి మండలం పల్లెపాడు గ్రామంలో 1,500 కుటుంబాలకుగాను 1,100 కుటుంబాలు వలసలు వెళ్లినట్లు, ఆదోని, కోడుమూరు, ఎమ్మిగనూరు మండలాల నుండి 3,400 కుటుంబాలు పిల్లలను చదువులు మాన్పించి, ముసలివారిని ఒంటరిగా ఇంటిదగ్గర వదిలి పని కోసం పొట్ట చేతబట్టుకుని సుమారు 500 కి.మీటర్లు వెళ్ళినట్లు ఈ నెల 12వ తేదీ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అనంతపురం జిల్లాలో రైతులు పండించిన మిరప, పప్పుశెనగ, జొన్న ధరలు గత మూడు వారాల్లో సగానికి సగం తగ్గిపోవడంతో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా రేషన్‌కార్డు లబ్ధిదారుల్లో 25 శాతం మంది కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ఇప్పటికే వలసలు వెళ్ళారు. కడప, అన్నమయ్య జిల్లాల నుండి అరబ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతూనే వుంది. ఈ గ్రీన్ ఎనర్జీ ఈ సమస్యలను పరిష్కరిస్తుందా?
గ్రీన్ ఎనర్జీ పేరుతో భూముల లూటీ
ఈ జిల్లాల్లో అతి తక్కువ వర్షం వల్ల వేడి ఎక్కువగా వుంటుంది. దానికి తోడు రాత్రి, పగలు గాలులు ఎక్కువగా వుంటాయి. అందువల్ల సోలార్, గాలిమరల విద్యుత్ ఉత్పత్తి గత పది సంవత్సరాల్లో భారీగా పెరిగింది. 2022-23 నాటికి డిస్కమ్ (డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) పరిధిలో 3,755.26 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలాగే 3,693.55 మెగావాట్ల విద్యుత్ గాలిమరల ద్వారా ఉత్పత్తి జరుగుతుంది. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒక్క ‘ఇండోసోల్’ కంపెనీకి సోలార్ విద్యుత్ తయారీ కోసం 17,633 ఎకరాలు కేటాయించింది. ఇందులో 12,198 ఎకరాలు ఎకరం 31 వేల రూపాయలతో రైతులతో లీజు ఒప్పందాలు చేసుకునే ఏర్పాటు చేసింది. 2023లో విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో అదాని, అంబానీ తదితరుల కంపెనీలతో 38 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఒప్పందాలు చేసుకుంది. ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కనీసం ఐదెకరాల భూమి కావాలి. అంటే ఒక గిగావాట్‌కు 5 వేల ఎకరాలు కావాలి. 38 గిగావాట్లకు అవసరమైన 1,90,000 ఎకరాల భూమిని (కర్నూలు జిల్లాలో 31,450 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 29,983, కర్నూలు జిల్లాలో 29,549, ప్రకాశం జిల్లాలో 9,630 ఎకరాలు మొత్తం 1,00,612 ఎకరాలు) ఈ కంపెనీలకు ఇవ్వడానికి నాటి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మొత్తంగా అదాని కంపెనీకి 75,000 ఎకరాలు, అంబానీ కంపెనీకి 46,555 ఎకరాల భూమిని ఇవ్వడానికి గత ప్రభుత్వం అంగీకరించింది, ఈ ప్రభుత్వం ఆ ఒప్పందాలను కొనసాగిస్తున్నది.
కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, కడప జిల్లాలోని బద్వేల్ ప్రాంతాల్లో నాలుగు ‘పునరుత్పాదక ఇంధన కేంద్రాలు’ ఏర్పాటు చేయాలని, అందుకు లక్ష ఎకరాల భూమిని గుర్తించినట్లు ఇంధన శాఖ అధికారులు కేంద్ర విద్యుత్ అథారిటీకి లేఖలు పంపారు. ఎవరి సొమ్ము ఎవరు ఎవరికి దానం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వర్షాభావం వల్ల పంటలు పండక పోవడాన్ని అవకాశంగా తీసుకుని చౌకగా సోలార్ కంపెనీలకు లక్షల ఎకరాల భూములు కట్టబెడుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విధానం అమలవుతున్నది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఏకంగా 1478 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంటే 7,390 ఎకరాలను సోలార్, విండ్ ప్రాజెక్టులకు ఇస్తున్నారు. ఈ ఒప్పందాలు ఒకే డైరెక్టర్లు వున్న మూడు కంపెనీలతో (అనంతపురం రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్పిరి ప్రైవేట్ లిమిటెడ్, కడప రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్‌లు) కావడం మరో వింత! ఇలా లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నందుకు ఇక్కడ జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తిలో రాయలసీమకు వాటా ఇచ్చి వినియోగదారులకు చౌకగా ఇస్తారా? వీటిలో వచ్చే ఉద్యోగాల సంఖ్య అతి తక్కువ. ఆ ఉద్యోగాలు కూడా ఇతర రాష్ట్రాల వారికి ఇస్తున్నారు. రైతుల చేతుల్లో వుండాల్సిన భూమి ఇలా కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోయిన తర్వాత ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి జరుగుతుంది? భూమి, గాలి, నీరు, ఎండ, సహజ వనరులను దోచుకుని ఎక్కడో వున్న ముంబాయి, గుజరాత్ కంపెనీలు లాభపడుతూ…విద్యుత్ ఒప్పందాల పేరుతో రాష్ట్ర ప్రజలపై అదనపు భారాలు వేస్తున్న సత్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే గ్రీన్ ఎనర్జీ ద్వారా రాయలసీమను అభివృద్ధి చేస్తామనడం వంచన కాదా?
పేదలకు పంచేందుకు భూములు లేవా!
భూమి లేని నిరుపేదలకు, దళితులకు భూములు పంపిణీ చేయమంటే భూములు ఎక్కడున్నాయని పాలకులు, వారి అనుయాయులు ఎదురు ప్రశ్నలు వేస్తారు. కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి ఎక్కడి నుండి వచ్చాయి? కౌలు రైతుల సంక్షేమానికి తోడ్పడే చట్టం చేయడానికి చేతులు రాని పాలకులు ఈ కంపెనీలకు మాత్రం మధ్యవర్తిత్వం చేసి, భరోసా ఇచ్చి భూములను లీజుకు ఇప్పిస్తున్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం సాగు భూమిలో దళితుల దగ్గర వున్నది కేవలం 6.51 శాతం కాగా, గిరిజనుల దగ్గర వున్నది 2.2 శాతం భూమి మాత్రమే. దళిత, గిరిజనుల్లో అత్యధిక మంది భూమి లేని నిరుపేదలు. వృత్తుల మీద ఆధారపడిన వెనుకబడిన కులాల వారి పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా లేదు. గ్రీన్ ఎనర్జీ పేరుతో ఇప్పటి వరకు ఇచ్చిన, ప్రస్తుతం ఇస్తున్న సుమారు మూడు లక్షల ఎకరాల భూమి లేని నిరుపేదలకు ఐదెకరాల చొప్పున పంచితే 60 వేల కుటుంబాలకు భూమి దక్కుతుంది. తద్వారా వలసలు ఆగుతాయి. రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. ఇళ్ల స్థలాలు లేని పేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే శత్రుదేశాల మీద యుద్ధం చేసినట్లు వాటిని యంత్రాలతో తొలగించే గత, ప్రస్తుత ప్రభుత్వాలు టిడ్కో, జగనన్న ఇళ్ల పేర్లతో ప్రభుత్వ, శివాయి జమా భూములను స్వాధీనం చేసుకున్నాయే తప్ప ఇళ్ళను మాత్రం పూర్తి చేయలేదు. దళిత, గిరిజనుల చేతుల్లో వుండాల్సిన అసైన్డ్ భూములను అక్రమంగా, దౌర్జన్యంగా, ప్రలోభ పెట్టి స్వాధీనం చేసుకున్న పెత్తందారుల కోసం శాశ్వత భూ యాజమాన్య హక్కులు ఇవ్వడానికి గత వైసిపి ప్రభుత్వం ప్రీ హోల్డ్ భూముల చట్టం పేరుతో 2023 డిసెంబరు 19న జీవో నెం 596 విడుదల చేసి భూ చట్ట సవరణ చేసింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలో 39,398.07 ఎకరాల అసైన్డ్ భూములను నెల రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందులో ఒక్క నంద్యాల జిల్లాలో 15,497 ఎకరాలు, కర్నూలులో 4,862, శ్రీసత్యసాయి జిల్లాలో 5,000 ఎకరాల భూమి రిజిస్ట్రర్ అయ్యిందంటే గ్రామీణ పెత్తందారీ రాబందులు అసైన్డ్ భూమిని ఎలా అక్రమంగా అనుభవిస్తున్నారో అర్థమవుతుంది. అనంతపురం జిల్లాలో కేవలం ఒక్క నెలలో 26 వేల ఎకరాల అసైన్డ్ భూమిని ఫ్రీ హోల్డ్ భూమిగా మార్చుకోగలిగారు. ఈ విధానం మీద రంకెలు వేసి అధికారంలోకి వచ్చిన టిడిపి, జనసేన, బిజెపి ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా వుంటున్నాయి. తిరుపతి లడ్డు కల్తీ గురించి, సోషల్ మీడియా పోస్టుల మీద, రాజకీయ హత్య కేసు మీద వున్న శ్రద్ధలో ఒకటో వంతు కూడా ఈ భూముల పరాయీకరణ మీద లేకపోవడం పాలకుల స్వభావానికి నిదర్శనం. ప్రభుత్వ మద్దతుతో ఒకవైపు కార్పొరేట్ కంపెనీలు, మరోవైపు గ్రామ పెత్తందారులు ఇలా భూములను స్వాధీనం చేసుకుంటుంటే రాయలసీమ ఎలా అభివృద్ధి అవుతుంది?
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1,200 కిలోమీటర్ల ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్’ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్‌వర్క్‌కు మించి రాయలసీమలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నందున గ్రీన్ కారిడార్ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతున్నది. ఈ కారిడార్ కోసం రూ.17,000 కోట్లు అవసరమవుతుందని, ఇందులో 40 శాతం కేంద్రం సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రూ.పది వేల కోట్లు ఖర్చు చేసి గ్రీన్ కారిడార్ ఏర్పాటుకు సిద్ధపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రధాన సాగు నీటి వనరుగా వున్న తుంగభద్ర డ్యామ్‌కు కొత్త గేట్లు అమర్చడానికి, హంద్రీ నీవా కాలువ వెడల్పు చేయడానికి మాత్రం డబ్బులు లేవంటుంది. పాలకుల దృష్టిలో అభివృద్ధి అంటే కార్పొరేట్ కంపెనీల అభివృద్ధి అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
– వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్