వాటర్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఎవరి ప్రయోజనాల కోసం?

Dec 13,2024 05:45 #Articles, #edite page, #saguneru

రాష్ట్ర ప్రభుత్వం 2024 వాటర్‌ పాలసీ పత్రం విడుదల చేసింది. ఆ పత్రంలో రాష్ట్రంలో నీటి లభ్యత, నీటి వనరులు, నీటి అవసరాలు, నీటి వినియోగం ప్రాధాన్యతలు, నీటిని నిల్వ చేయడం, వృధాను అరికట్టడం, పొదుపు చేయడం గురించి వివరంగా పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని పేర్కొంది. సాగునీటి వనరులను ఆక్రమణల నుండి కాపాడాల్సిన అవసరాన్ని, సాగునీటిని పొదుపుగా వాడడాన్ని, అందుకు జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫామింగ్‌ అవసరాన్ని చెప్పింది. అంతిమంగా ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (ఎ.పి.డబ్ల్యు.ఆర్‌.ఆర్‌.సి) ఏర్పాటు చేయాలని పేర్కొంది.

అయితే పైన పేర్కొన్న విధానాలు కొత్తగా కనిపెట్టినవి కావు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో, సరళీకరణ విధానాలలో భాగంగా 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ నెంబర్‌ 12 / 1977 చేసింది. ఆ చట్టాన్ని అనుసరించి నీటి పారుదల రంగంలో మూడు చర్యలు చేపట్టింది.

1. సాగునీటి కాలువలకు మీటర్లు ఏర్పాటు చేసి, వాటర్‌ రీడింగ్‌ ప్రకారం నీటి చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. 2. భూగర్భ జలాలను పెంచడం కోసం ఇంకుడు గుంటలు, కాంటూర్‌ కందకాలు తవ్వడం, చెక్‌ డాములు నిర్మించడం. 3. సాగునీటి పర్యవేక్షణకు సాగునీటి సంఘాలు ఏర్పాటు చేయడం.

ఆనాటి అనుభవాలను ఒకసారి మననం చేసుకోవడం అవసరం. భూగర్భ జలాలను పెంపొందించాలని, అందుకుగాను ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంట తవ్వాలని, ప్రతి రైతు చేలో ఇంకుడు గుంటలు తవ్వాలని ఆదేశించింది. కొండలపై కురిసిన వర్షం నీరు సరాసరి కాంటూర్‌ కందకాల ద్వారా భూగర్భంలోకి పంపిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. కొండల చుట్టూ కోట్లాది ధనం ఖర్చు చేసి కాంటూర్‌ కందకాలు తవ్వించారు. అనుభవం ఏమి చెప్పింది? ప్రతి గ్రామాన్ని ఆనుకొని ఊర చెరువు లేదా ఊర కుంటలు ఉంటాయి. ఆ గ్రామంలో కురిసిన వర్షపు నీరు మొత్తం చెరువులలోకి చేరేవి. కొండల చుట్టూ ఉన్న వాగుల ఆధారంగా సాగునీటి చెరువుల నిర్మాణం జరిగేది. కొండలపై కురిసిన వానలకు ఆ చెరువులు ఏటా రెండు మూడుసార్లు నీటితో నిండేవి. ఇంకుడు గుంటలు, కాంటూర్‌ కందకాలు ఏర్పాటు చేయడంతో చెరువులకు నీరు చేరడం తగ్గిపోయింది. వందల కోట్లు ఖర్చు అయ్యింది కానీ సాగునీటి వ్యవస్థకు నష్టం కలిగింది.

కృష్ణా డెల్టాలో సాగునీటి కాలువలకు నీటి మీటర్లు ఏర్పాటు చేశారు. మీటర్ల రీడింగ్‌ ప్రకారం నీటి చార్జీలు వసూలు చేయాలని పేర్కొన్నారు. మీటర్ల తంతు చూడడానికి దేశ విదేశీ ప్రతినిధుల రాకపోకలు, ముఖ్యమంత్రికి మెచ్చుకోళ్ళు గొప్పగా సాగాయి. ఏ రైతుకు, ఎన్ని ఎకరాలకు, ఏ పంటకు ఎంత నీరు ఇచ్చారు? ఎలా లెక్కిస్తారనే ప్రశ్నలు ఉదయించాయి. రైతాంగంలో అలజడులు రావడంతో అంతటితో నీటి మీటర్ల కథ ముగిసిపోయింది.
సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే చాలా ఖర్చు చేశామని ఇంకా ఖర్చు చేయడం సాధ్యం కాదని, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. ఇకపై సాగునీటి ప్రాజెక్టును బిల్డ్‌, ఆపరేట్‌ అండ్‌ టాన్స్‌ఫర్‌ (బి.ఓ.టి) విధానంపై నిర్మిస్తామని పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టు కార్యాలయాన్ని మూసివేశారు. ఎక్కడ ఏ కాంట్రాక్టర్లూ ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయి. ఒక ప్రముఖ కాంట్రాక్టరును పులిచింతల ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టమని కోరగా ‘ట్రంక్‌ రోడ్లలో టోల్‌గేట్‌ కట్టి వసూలు చేసుకోవడం సులభం. సాగునీటి కాలువకు వసూలు చేయడం ఎలా సాధ్యం? ఇది మతి లేని పథకం’ అన్నారు.

ఈ కాలంలో సాగునీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలు ఏర్పరిచింది. మొత్తం సాగునీటి వ్యవస్థను ఈ కమిటీలు అజమాయిషీ చేస్తాయని చెప్పింది. సాగునీటి వ్యవస్థపై రైతులు అజమాయిషీ కల్పించడం మంచిదైనప్పటికీ, నిర్వహణ బాధ్యత అందుకు అవసరమైన నీటి చార్జీలు వసూలు చేయడం సరైంది కాదని తేలింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను సంఘాలకు అప్పగించింది. రైతులకు భారంగా తయారయ్యాయి. ఎక్కువ భాగం మూతపడ్డాయి.

ఇటీవల ఇంటర్నేషనల్‌ లా రీసెర్చ్‌ సెంటర్‌ వారు వీటిని పరిశీలించి అనేక విషయాలు చెప్పారు. నీటిని సాధారణ వస్తువుగా పరిగణించరాదని, ఆర్థికపరమైన వస్తువుగా పరిగణించాలని ప్రపంచ బ్యాంకు చెప్పింది. రైతులు వినియోగించుకునే నీటిపై సప్లరు కాస్ట్‌, ఎకనామిక్‌ కాస్ట్‌, ఫుల్‌ కాస్ట్‌ వసూలు చేయాలని చెప్పింది. అంటే ప్రాజెక్టు నిర్మాణ నిర్వహణ, అరుగుదల, నీటి సరఫరా వృధా తదితర మొత్తం ఖర్చు వసూలు చేయాలని సూచించింది. ఇవన్నీ సమగ్రంగా అమలు చేయాలంటే పూర్తి స్వతంత్ర బాధ్యతలు కలిగిన స్వతంత్ర సంస్థలు ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంక్‌ చెబుతుంది. ఈ సంస్థల్లో బ్యూరోక్రసీ పెరిగిపోయే అవకాశం ఉందని, నీటి వనరులు ధనవంతులు చేతిలోకి వెళ్లిపోతాయని పేద రైతులుకు భారంగా తయారవుతాయని ఇంటర్నేషనల్‌ లా రీసెర్స్‌ సెంటర్‌ నివేదిక చెప్పింది.

ఇప్పటికే విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ పని చేస్తున్నది. రెగ్యులేటరీ కమిషన్‌ వినియోగదారులపై ఎటువంటి భారాలు వేస్తుందో ప్రజలు చూస్తున్నారు. ఫిక్స్‌డ్‌ చార్జీలు, కస్టమర్‌ చార్జీలు, విద్యుత్‌ డ్యూటీ, ట్రూ అప్‌ చార్జీలు, సర్దుబాటు చార్జీలు వంటి పేర్లతో సామాన్య గృహ వినియోగదారులపై మోయలేని భారాలు మోపుతున్నది. రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ, గృహ, వ్యాపార వినియోగదారులందరికి స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు సిద్ధం చేసింది. స్మార్ట్‌ మీటర్ల భారం కూడా వినియోగదారులపైనే వేస్తుంది. ఇంకా ఎన్ని కొత్త కొత్త భారాలు పడతాయోనని వినియోగదారులు భయపడే పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రంలో వాటర్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. గత కాలంలో చేపట్టిన చర్యలన్నీ ప్రతిపాదించింది. జీరో బడ్జెట్‌ వ్యవసాయాన్ని చేపట్టాలని పేర్కొంది. వృద్ధులైన రైతులు దున్నకుండా పంట వేస్తే కొయ్యకుండా పండుతుందని నానుడిగా చెప్పేవారు. వ్యవసాయంలో కంపెనీ విత్తనాలు, రసాయన ఎరువులు, ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు ప్రవేశించిన తరువాత పెట్టుబడి లేని వ్యవసాయం అంటే ఆత్మవంచన మాత్రమే. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించింది. ఇది సాగునీటి రంగాన్ని కార్పోరేట్‌ శక్తులకు అప్పగించడానికి మార్గం. కొత్త రెగ్యులేటరీ కమిషన్‌ రైతులపైన, గృహ అవసరాల పైన, మంచినీటి కుళాయిల పైన ఎటువంటి భారాలు వేస్తుందో చూడాలి. భవిష్యత్తులో నీటి వ్యవస్థ ధనార్ధుల చేతుల్లోకి వెళ్లడం, పేద రైతులకు భారంగా మారడం తథ్యంగా వుంది. రైతులు, పేదలు మేల్కొనాల్సి ఉంది.

వ్యాసకర్త రైతుసంఘం సీనియర్‌ నాయకులు వై. కేశవరావు

➡️