బాల్య వివాహాలు చాలా పాతకాలం నాటి మాట. నేటికీ కొనసాగుతున్న తాజా అనాచారం. ఆడది అవనిలో సగం.. ఆకాశంలో సగం… అని నిరూపించుకుంటున్న ఈ రోజుల్లోనూ బాల్య వివాహాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి 18 ఏళ్ల లోపే వివాహం జరుగుతున్నట్లు ‘ది లాన్సెట్ జర్నల్’ వెల్లడించింది. అంతేకాదు…కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చదువులు చతికిలబడ్డాయి. పేదరికం పెరిగిపోయింది. ఫలితంగా వచ్చే దశాబ్ద కాలంలో కోటి మంది బాలికలు…వివాహ చట్రంలో ఇరుక్కుపోనున్నారు. ఏటా 1.2 కోట్ల మంది బాల్యంలోనే వివాహ వ్యవస్థలోకి నెట్టబడతారని లాన్సెట్ చెబుతోంది. బాల్య వివాహాలు ఆడపిల్లల ఆరోగ్యానికి, జీవితానికి ముప్పుగా మారతాయి. ఎదిగీ ఎదగని శరీరం, అవగాహనలేని వయసు, పరిపక్వతలేని మనసు, అమ్మపై ఆధారపడే వయస్సులో అమ్మగా మారడం ఆ చిన్నారి ఎదుగుదలకు ఆటంకం. ‘మాకు ఈడు లేదు ఇగురం లేదు ఓ ఎమ్మాలో/ ఇంతలోనే పెళ్లి అంటారా?.. మా ఎమ్మాలో/ సంసారమీద సత్తువ ఉందా?.. ఓ ఎమ్మాలో/ నా బాల్యమంత బందీ జేస్తారా?.. ఓ ఎమ్మాలో/ వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం బడి ఈడులోనే బండెడంత బాధ్యత భారం’ అంటారో కవి. బాల్య వివాహాలు నిరోధించడానికి రాజారామ్ మోహన్‌రారు, కందుకూరి వీరేశలింగం వంటివారు కృషి చేసినా… ఈ మూఢాచారం నేటికీ కొనసాగుతోంది.
తల్లి గర్భం నుంచే సమాజంతో నిత్యం పోరాటం చేయాల్సిన పరిస్థితి బాలికలది. సాధ్యమైనంత త్వరగా ఆడపిల్లకు పెళ్లి చేసి వదిలించుకోవాలన్న పురుషాధిక్య భావజాలం ఆడపిల్ల అందమైన కలలను, భవితను, జీవితాన్ని చిదిమేస్తోంది. ‘బాల్యంలో/ బొమ్మకు అమ్మనయ్యానని సంతోషించాను/ ఇప్పుడు/ అమ్మనూ నేనే, బొమ్మనూ నేనే’ అంటారు కవయిత్రి అంజన. చదువు, ఆటపాటలతో ఎదగాల్సిన బాలికలు… చిన్న వయసులో పెళ్లి వల్ల శారీరకంగా, మానసికంగా బలహీనులవుతారు. శారీరక, మానసిక పరిపక్వత లేని వయసులో గర్భం ధరించడం వల్ల మాతాశిశు మరణాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాల్య వివాహాల వల్ల చిన్నతనం నుంచే వారి హక్కులు ఉల్లంఘించబడుతూ, ఆర్థిక పరాధీనతను పెంచుతున్నాయి. ‘బాల్య వివాహాలు బానిసత్వం యొక్క ఒక రూపం. దానిని రద్దు చేయాలి’ అంటారు నెల్సన్ మండేలా. బాల్య వివాహాలు సామాజిక దురాచారం. వీటిని అరికట్టడం వలన మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు అత్యధికంగా జరుగుతున్న ఏడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దేశంలో దాదాపు 300 జిల్లాల్లో జాతీయ సగటుతో పోలిస్తే బాల్య వివాహాల రేటు ఎక్కువగా వుందని తాజాగా ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత దేశంలో మొట్టమొదటిగా 1929లో బాల్య వివాహాలు నిషేధించబడ్డాయి. ఆ తర్వాత క్రమంగా పరిస్థితి మరింత మెరుగుపడుతూ వచ్చింది. అయినా నేటికీ బాల్య వివాహాలు జరుగుతూనే వున్నాయి.
18 ఏళ్లలోపు బాలికలు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహాలు చేస్తే, తల్లిదండ్రులతోపాటు వివాహం చేసిన వారికి కూడా రెండేళ్లపాటు జైలుశిక్ష విధిస్తారని చట్టం చెబుతోంది. బాలలకు చట్టంలో సమానత్వం వుందని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యం రావాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం చేపట్టింది. 2030 నాటికి బాల్య వివాహ రహిత భారతదేశమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపున దేశవ్యాప్తంగా బాల్యవివాహాలు నిరాఘాటంగా జరుగుతున్నాయి. ‘ఆడదే ఆధారం/ మన కథ ఆడనే ఆరంభం/ ఆడదే సంతోషం/ మనిషికి ఆడదే సంతాపం’ అంటాడో సినీ కవి. మనిషి కథ ఆరంభమైన చోటనే… అంతం కాకూడదు, అది సంతాపంగా మారకూడదు. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు. బాల్య వివాహ వ్యవస్థను రూపుమాపేది, వారి జీవితాన్ని వెలుగు దివ్వెగా మార్చేది, పురుషాధిక్యతను ప్రశ్నించేది చదువు మాత్రమే. ఇది నిషిద్ధ స్వప్నం కాదు. ఈ పురుషాధిపత్య సంకెళ్లను ఛేదించి, తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునే సాధికారయత్నం. ‘ఇతిహాసపు చీకటి కోణం/ అట్టడుగున పడి కాన్పించని/కథలన్నీ కావాలిప్పుడు/ దాచేస్తే దాగని సత్యం’ అంటారు మహాకవి శ్రీశ్రీ. ఆడబిడ్డను బతకనిద్దాం… ఎదగనిద్దాం… చదవనిద్దాం… ఎగరనిద్దాం.