జులై 19న ప్రపంచ వ్యాప్తంగా ఐ.టి సర్వీసులు హఠాత్తుగా ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మైక్రోసాఫ్ట్ కంప్యూటర్లు పనిచేయడం మానేశాయి. విమానాలు, బ్యాంకులు, రైళ్లు, ప్రభుత్వ వ్యవహారాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. గ్రౌండ్ స్ట్రైక్ అనే సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ విడుదల చేసిన తప్పుడు అప్‌డేట్ వల్ల, మైక్రోసాఫ్ట్ విండోలు క్రాష్ అయి ‘బ్లూ స్క్రీన్ డెత్’ అనే ఒక సాంకేతిక సమస్యలో ఇరుక్కుపోయాయి. అయితే ఇవేవీ శత్రు హ్యాకర్లు చేసిన దాడులు కావు. ఏ సంస్థ అయితే సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలో… ఆ సంస్థ సృష్టించిన పరిస్థితే ఇది.
2010లో కూడా ఇలాగే జరిగింది. ఈ గ్రౌండ్ స్ట్రైక్ కంపెనీకి ఇప్పుడు సీఈఓ గా ఉన్న జార్జ్ కర్ట్జ్, అప్పుడు యాంటీ వైరస్ కంపెనీ ‘మెకాఫే’ సీటీవో గా ఉన్నాడు. మెకాఫే విడుదల చేసిన ఒక అప్‌డేట్ వల్ల మిలియన్ల సంఖ్యలో మైక్రోసాఫ్ట్ విండోలు ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయ్యాయి. చివరికి మెకాఫే ని అమ్మేయాల్సి వచ్చింది. అప్పుడు జార్జ్ కర్ట్జ్ రాజీనామా చేసి, ప్రారంభించిన మరో సైబర్ సెక్యూరిటీ కంపెనీనే ఈ క్రౌడ్ స్ట్రైక్. 2010 వైఫల్యాల నుండి ఈ కర్ట్జ్ గాని, మైక్రోసాఫ్ట్ కానీ, నియంత్రణ సంస్థలు గాని ఏమీ నేర్చుకున్నట్టు లేదు. తప్పులు చేసుకుంటూ పోయి నేటి సంక్షోభానికి కారణమయ్యారు.
క్లౌడ్ స్ట్రైక్‌కు రాజకీయ వర్గాల్లో, ఇంటెలిజెన్స్ వ్యవస్థలలో శక్తివంతులైన స్నేహితులు ఉన్నారు. రష్యా తమ ఈ మెయిళ్లను హ్యాక్ చేసి, అమెరికన్ ఎన్నికలలో జోక్యం చేసుకున్నదని…2016లో అమెరికా ఎన్నికల్లో పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ ఆరోపించగా అందుకు తమ దగ్గర రుజువులు ఉన్నాయని ‘క్లౌడ్ స్ట్రైక్’ ప్రకటించింది. కానీ ఈ ఆరోపణలు పూర్తిగా తప్పని తేలింది. అంతేకాక హిల్లరీ క్లింటన్ ఎన్నిక ప్రచార ధోరణులు, లిబియా ఆక్రమణలో ఆమె పాత్ర, వికీలీక్స్ ద్వారా బయటకు వచ్చి అపఖ్యాతి పాలైంది. క్లౌడ్ స్ట్రైక్ సీఈవో చైనా మీద కూడా హ్యాకింగ్ ఆరోపణలు చేశాడు. ఇజ్రాయిలీ సైబర్ సెక్యూరిటీ సంస్థలతో క్లౌడ్ స్ట్రైక్‌కు బలమైన సంబంధాలే ఉన్నాయని గమనించాలి. క్లౌడ్ స్ట్రైక్ నిర్లక్ష్యాన్ని, తప్పులను నియంత్రణ అధికారులు సహించి, రక్షించడానికి ఇటువంటి రాజకీయ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో వున్న సంబంధాలే కారణం కావొచ్చు. ఇంతటి విపత్తు జరిగినా, ఒప్పందం ప్రకారం, తీసుకున్న ఫీజులను వెనక్కి చెల్లిస్తే చాలు. ‘జులై 19 సంఘటన వల్ల చేయాల్సి వచ్చే అదనపు పనికి” ఉద్యోగులకు పది డాలర్ల ఉబర్ ఆహారపు గిఫ్ట్ కార్డులను ప్రకటించేంత తేలికగా దీన్ని తీసుకున్నారు.
తన సాఫ్ట్‌వేర్‌తో పునరావృతమవుతున్న ఈ సంఘటనలకు మైక్రోసాఫ్ట్ కూడా బాధ్యత నుంచి తప్పించుకోలేదు. ఈ క్రౌడ్ స్ట్రైక్ అప్‌డేట్ అనేది లైనెక్స్ సర్వర్లను దెబ్బ తీయలేకపోయింది. వ్యక్తిగత కంప్యూటర్లపై గుత్తాధిపత్యం కలిగిన ఖరీదైన మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ కంటే, ఉచితంగా లభించే లైనెక్స్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ సుస్థిరంగా, సురక్షితంగా ఉందని రుజువైంది. మైక్రోసాఫ్ట్‌లా కాకుండా, లైనెక్స్ ఎప్పటికప్పుడు బహిరంగంగా పరీక్షింపబడే ఓపెన్ సోర్స్‌గా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది.
సాఫ్ట్‌వేర్ క్లౌడ్ సర్వీసుల కోసం మనం అమెరికా గుత్తాధిపత్య కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ లపై దాదాపు పూర్తిగా ఆధారపడుతున్నాం. ఒకే ఒక తప్పుడు అప్‌డేట్ మొత్తం ప్రపంచాన్నే కుదిపివేసిన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, టెలి కమ్యూనికేషన్లు, ఆరోగ్యం, విద్యుత్ సరఫరా, విమానాలు, రైళ్లు … లాంటి కీలక రంగాలన్నీ కూడా ఈ కంపెనీలపై ఆధారపడి ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉన్న ఈ కంపెనీలు, దేశ సార్వభౌమత్వానికి కూడా ముప్పుగా మారగలవు.
అమెరికా నిఘా వ్యవస్థలైన అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, సిఐఏ…సాంకేతిక ఉత్పత్తులలోకి ఎంత విస్తృతంగా చొచ్చుకొని పోయి ఉన్నాయనేది వికీలీక్స్ 2013 లోనే బట్టబయలు చేసింది. బుల్‌రన్ అనే కోడ్ పేరుతో, ఎన్‌ఎస్‌ఏ ఒక ప్రోగ్రాం నడిపింది. సాంకేతిక ఉత్పత్తుల, భద్రతా వ్యవస్థలను ఛేదించడం దీని లక్ష్యం. దీనికోసం ఈ కంపెనీలతో కలసే, ‘బ్యాక్ డోర్’ అనే పేరుతో ఒక నిఘాను, దాదాపు ప్రతి సాంకేతిక ఉత్పత్తిలో చొప్పిస్తారు. కమ్యూనికేషన్ పరికరాలు, ఎంక్రిప్షన్ సాఫ్ట్‌వేర్‌లు, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ వ్యవస్థలు, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ లాంటి బహుళ ప్రాచుర్యంలో ఉన్న సేవలు…అన్నింటిలోనూ ఈ ‘బ్యాక్ డోర్’ ప్రవేశ పెట్టబడి ఉంటుంది. అమెరికా నిఘా వ్యవస్థల కోసం ఈ బ్యాక్ డోర్ పని చేస్తూ ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా సిఐఏ చేస్తున్న హ్యాకింగ్ విస్తృతిని వికీలీక్స్ 2017లో ‘వాల్ట్ 7’ పత్రంలో వెల్లడి చేసింది. వేల సంఖ్యలో ఉన్న సిఐఏ హ్యాకింగ్ వ్యవస్థలు, ట్రోజన్లు, వైరస్ లతో ఐఫోన్, ఆండ్రాయిడ్ లాంటి స్మార్ట్ ఫోన్లను, ఐపాడ్లను, స్మార్ట్ టీవీలను తమ నియంత్రణలోకి తీసుకొంటున్నాయి. మనం మాట్లాడేవన్నీ రహస్యంగా వినే ఆయుధాలుగా మారుతున్నాయి. కొత్తగా వస్తున్న కార్లు, ట్రక్కులలో ఉండే నియంత్రణా వ్యవస్థలలో కూడా వీటిని చొప్పించవచ్చు. సిఐఏ ఇంకొన్ని కొత్త పద్ధతులను కూడా అభివద్ధి చేసింది. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి…వాట్సాప్, సిగల్, టెలిగ్రామ్ లలో ఉన్నట్టు చెప్పబడుతున్న భద్రతా వ్యవస్థలను కూడా అధిగమించే కొత్త పద్ధతులు ఇవి. విండో ఆపరేటింగ్ సిస్టమ్‌ల మీద, ఇంటర్నెట్ రౌటర్ల పైన కూడా దాడి జరుగుతోంది.
ఈరోజు రష్యాపై అమెరికా విధించినట్టుగా చటుక్కున ఆర్థిక ఆంక్షలు, విధించడమే కాదు. డిజిటల్ వ్యవస్థలను కూడా స్తంభింపజేస్తోంది. తద్వారా దేశాలను లొంగదీసుకుంటున్నది. టెక్నాలజీకున్న కీలక ప్రాధాన్యత రీత్యా దేశాల స్వతంత్రత నిలబడాలంటే దేశీయంగా, స్థానికంగా టెక్నాలజీ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడం ఒకటే మార్గం.
బప్పా సిన్హా
(‘పీపుల్స్ డెమోక్రసీ’ నుండి స్వేచ్ఛానుసరణ)