వెలుగులు నిండాలి

Oct 31,2024 05:56 #Articles, #diwali festival, #edit page

దీపావళి అంటేనే వెలుగుల పండగ! చీకట్లను చీల్చుకుని వికసించే వెలుతురు కిరణాల పండగ. అజ్ఞానాన్ని అంతం చేసి అంతులేని విజ్ఞాన ప్రయాణంవైపు అడుగులు వేయించే పండగ! చుట్టూ చీకట్లు కమ్ముకున్న వేళ మిరిమిట్లు గొలిపే వెలుగు నుండి ప్రపంచాన్ని చూడటం ఎంత బాగుంటుంది! దీపావళి అంటే అందుకేనేమో ఆబాలగోపాలానికి అంత ఉత్సాహం! అంత ఆనందం! కానీ, ఆ దీపాలే లేకపోతే…! ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ! ఆదిమ మానవుడు తొలి అడుగులు వేసే క్రమంలో నిప్పును చూడకపోయి ఉంటే, చూసినా గుర్తించగలిగే జ్ఞానం లేకపోయి ఉంటే.. ఏం జరిగిఉండేది? తొలిసారి నిప్పును చూసిన క్షణం నుండి రాజేయడం, నూనెలతో దీపాన్ని వెలిగించడం … ఈ పరిణామ క్రమానికి ఎంత కాలం పట్టి ఉంటుంది? మానవ జీవన చరిత్రలో ఎన్ని శతాబ్దాలు, సహస్రాబ్దాలు గడిచిపోయి ఉంటాయి? అక్కడి నుండి విద్యుచ్ఛక్తిని కనుగొనేంత వరకు సాగిన మానవ ప్రయాణంలో మలుపులు ఎన్నో! విద్యుత్‌ను కనుగొనడమే ఒక అద్భుతమైతే, ఆ తరువాత నాగరికత పురోగమిస్తున్న తీరు, ఎదుర్కుంటున్న వైఫల్యాలు, సాధిస్తున్న విజయాలు మహాద్భుతాలు! మరో మాటలో చెప్పాలంటే దీపం లేనిదే నాగరికత లేదు. అభివృద్ధి లేదు! మానవ మేథస్సు సృష్టించే ఆవిష్కరణలే నవ జ్యోతులు… నూతన కాంతులు! మానవాళికి నిత్య దీపాల వెలుగులు!!
ఎప్పుడు మొదలైందో, ఎక్కడ మొదలైందో తెలియదు కానీ, వెలుగుల పండగ కాస్తా చెవులు పిక్కటిల్లే శబ్దాడంబరంగా మారిపోయింది. ఉత్సాహాల సంబరం కాస్తా కాలుష్య కాసారంగా మారుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రతి ఏడాది చోటుచేసుకుంటున్న ఉత్పాతమే దీనికి నిదర్శనం. అనేక ఇతర అంశాలతో పాటు, దీపావళి నాడు విడుదలయ్యే కాలుష్యం ఊపిరికూడా పీల్చుకోలేని దుస్థితికి ఢిల్లీ ప్రజలను చేరుస్తోంది. ఊపిరితిత్తులను కబళించే విషవాయువుల రక్కసిని అంతం చేయడానికి ఢల్లీీ ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. స్పందించి, సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది. దీపావళి కాలుష్యం గురించి కొన్ని దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు జరుగుతున్నాయి. వాటి సారాంశం ఒక్కటే! 1990వ దశకంతో పోలిస్తే బాణాసంచా తయారీలో ప్రస్తుతం ఎన్నో మార్పులు రావడంతోపాటు శబ్ద, వాయు కాలుష్యాలు గణనీయంగా పెరగుతున్నాయి. ఐఐటి ఢిల్లీ,ఐఐటి కాన్పూర్‌లతో పాటు డబ్య్లుహెచ్‌ఓ చేసిన అధ్యయనాలు సాధారణ రోజులతో పోలిస్తే దీపావళినాడు దేశ రాజధానిలో పది రెట్లు ఎక్కువగా వాయు, శబ్ద కాలుష్యాలు నమోదయ్యాయి. దీపావళి తరువాత మరికొన్ని రోజులు కూడా ఇదే దుస్థితి కొనసాగుతోంది. ఈ స్థాయిలో కాకపోయినా దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని సంవత్సరాల క్రితం ఎయిమ్స్‌ చేసిన అధ్యయనంలో దీపావళి సమయంలో శ్వాసకోస వ్యాధుల సమస్యలతో ఆస్పత్రులలో చేరుతున్న వారి సంఖ్య దేశ వ్యాప్తంగా సగటున 20 నుండి 30శాతానికి పెరుగుతోంది.
ప్రమోదం కాస్తా, ప్రమాదంగా మారతున్న తీరుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! సమస్య తీవ్రతను గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం ఒకటికి, రెండు సార్లు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలూ ఉన్నాయి. కానీ, వాటిని అమలు చేయాల్సిన ప్రభుత్వాల్లోనే చిత్తశుద్ధి కొరవడింది. మాములు బాణాసంచాల ధరలే సామాన్యులకు అందుబాటులో లేవు. గ్రీన్‌ క్రాకర్స్‌ వంటి ప్రత్యామ్నాయాల ధరల సంగతి చెప్పనవసరం లేదు. మరోవైపు పాలకులే బోడిగుండుకు, మోకాలుకు ముడిపెడుతూ మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వారిని వెనుక నుండి నడిపించే సంఘాలు, సంస్థలైతే మరింత బాహాటంగానే ఉన్మాదపు అంధకారాన్ని వెదజల్లుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలి. విజ్ఞానపు దివ్వెలను ప్రతి ఇంటా వెలిగించాలి. ప్రతి ఒక్కరి మస్తిష్కాలలో చైతన్యపు జ్వాలలు రగిలించాలి. ప్రతి మహిళా అభినవ సత్యభామలై తిమిరాసురులపై పోరుకు కదలాలి! అదే, మానవాళికి నిజమైన విజయం! దీపావళి అందించే సందేశం అదే! అప్పుడే భూగోళం నవకాంతులు వెదజల్లే దీపమాలగా నిలుస్తుంది. భావి తరాలకు భద్రతను ఇస్తుంది.

➡️