జిడిపి పతనం

కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యపస్థ గురించి ఒకవైపు ఊదరగొడుతూ, దేశ ప్రజలను భ్రమల్లో ముంచే ప్రయత్నం చేస్తుండగా మరోవైపు దానికి భిన్నమైన వాస్తవ దృశ్యాలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమౌతున్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు, ద్రవ్యోల్బణం, పాతాళానికి రూపాయి వంటి అంశాల తరువాత ఇప్పుడు స్థూల దేశీయోత్పత్తి (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్టు-జిడిపి) చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25)లో జిడిపి 6.4 శాతానికి పరిమితం కానుందని అంచనా వేస్తూ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీసు (ఎన్‌ఎస్‌ఓ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ అంచనాలు నిజమైతే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా విజృంభణ తరువాత గడిచిన నాలుగేళ్ల కాలంలో అతి తక్కువ పెరుగుదల అంచనా ఇదే రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సన్నద్ధమౌతున్న వేళ ఈ తాజా అంచనాలు విడుదల కావడం గమనార్హం.

నిజానికి గతంలోనే జిడిపి పతనానికి సంబంధించిన సంకేతాలు వెలువడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) 6.7 శాతం జిడిపి వృద్ధి మాత్రమే నమోదైంది. గత ఏడాది అదే సమయానికి జిడిపి 8.2 శాతంగా ఉండటం గమనార్హం. గత సంవత్సరం అన్ని త్రైమాసికాల్లోనూ సగటున 8 శాతం జిడిపి వృద్ధి నమోదు కావడంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 7.2 శాతం జిడిపి సాధించవచ్చని ఆర్‌బిఐ తొలుత అంచనా వేసింది. ఆ తరువాత దానిని సవరించి 7.1 శాతం వృద్ధి ఖాయమని పేర్కొంది. అయితే, తొలి త్రైమాసికంలో ఆ అంచనాను అందుకోలేదు. ఇక రెండవ త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్‌)లో వృద్ధి రేటు ఏకంగా 5.4 శాతానికి పడిపోయింది. ఇది రెండేళ్లలో కనిష్టం! మూడవ త్రైమాసికంలో రెండవ త్రైమాసికంతో పోలిస్తే కొంత పుంజుకున్నట్టు కనిపించినప్పటికీ తొలుత వేసిన అంచనాలతో పోలిస్తే దిగదుడుపే! మరోవైపు స్థూల విలువ జోడింపు (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌-జివిఎ) గణాంకాలు కూడా తగ్గుదలనే చూపుతున్నాయి. జివిఎ 8.3 శాతం నుండి 6.8 శాతానికి పడిపోయింది. తొమ్మిది నెలల పాటు వరుసగా ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న ఈ దిగజారుడును నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఎన్నికల కోడ్‌ కారణమని ప్రధానమంత్రితో పాటు ఆయన వందిమాగధులు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వృద్ధి రేటు నేల చూపులు చూస్తోందని స్పష్టమౌతోంది. ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆర్థిక పతనానికి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఏమని సంజాయిషి ఇస్తుందో వేచి చూడాల్సిందే!

అదాని, అంబాని వంటి కొద్దిమంది కార్పొరేట్లకు మేలు చేసే నయా ఉదారవాద ఆర్థిక విధానాలే ఈ పరిస్థితికి కారణం. ఈ కారణంగానే ప్రజల మధ్య అంతరాలు పెరుగుతున్నాయన్న సత్యాన్ని గుర్తించడానికి మోడీ ప్రభుత్వం నిరాకరిస్తోంది. దేశంలో పెరుగుతున్న పేదరికాన్ని, అకలి కేకలను, నిరుద్యోగం, ఉపాధి రహిత పరిస్థితులను అనేక జాతీయ, అంతర్జాతీయ నివేదికలు ఎత్తి చూపినా కేంద్ర సర్కారులో చలనం ఉండటం లేదు. ప్రభుత్వ ఖర్చును, ముఖ్యంగా పేదల కోసం చేసే ఖర్చును భారీగా పెంచాలని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎందరో నిపుణులు, ఆర్థిక వేత్తలు చేసిన సూచనలను ఉద్దేశపూర్వకంగానే పెడచెవిన పెడుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు నిధుల దిగ్గోతే దీనికి నిదర్శనం. కనీస మద్దతు ధర చట్టం కోసం ఏళ్ల తరబడి రైతాంగం చేస్తున్న ఆందోళనలను పట్టించుకోవడం లేదు. రూపాయి విలువ పతనం కారణంగా ఎరువుల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుతున్న అంతరాలే మోడీ ప్రభుత్వ విధానాల వైఫల్యానికి నిదర్శనం!

➡️