బెయిల్‌ పొందడం అసాధ్యం కాకూడదు

పౌరులు ఎటువంటి విచారణ లేకుండా, బెయిల్‌ తిరస్కరణకు గురికాకుండా జైళ్లలో ఏళ్ల తరబడి గడపాల్సిన పరిస్థితి రాకుండా చూడడం…రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల సంరక్షకులుగా, న్యాయస్థానాల ప్రధాన కర్తవ్యం. తరచుగా కోర్టులు ఈ విషయాన్ని తగినంత సీరియస్‌గా తీసుకోలేదు. అంతేగాక, చాలా కేసులలో భిన్నమైన తీర్పులు వచ్చాయి. అదే కోర్టులోని కొన్ని బెంచ్‌లు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా తీర్పులు ఇచ్చాయి. కొన్ని హైకోర్టులు కూడా ఇదే విధానాన్ని సమర్థించాయి. అయితే ఇటీవల సుప్రీంకోర్టు నుండి వచ్చిన కొన్ని క్లిష్టమైన తీర్పులు, పరిశీలనలు స్వాగతించదగినవి. అంతేగాక ఇవి న్యాయ వ్యవస్థపై ప్రజాస్వామ్య విశ్వాసుల ఆశను బలపరుస్తున్నాయి. ‘బెయిల్‌ అనేది వ్యవస్థ, అనివార్యమైన కేసుల్లో మాత్రమే జైలు’ అనే సూత్రానికి కోర్టులు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. విచారణకు ముందు నిర్బంధించడం శిక్షగా మారకూడదు. పైగా వ్యక్తిగత స్వేచ్ఛ ఏ చట్టానికైనా అతీతమని, బెయిల్‌ మంజూరు చేయకపోవడం రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 21 కింద హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడ మేనని కోర్టు చేసిన ప్రధాన పరిశీలనలు.
బెయిల్‌ పిటిషన్లను విచారించే హైకోర్టులు, ఇతర దిగువ కోర్టులు సుప్రీంకోర్టు బలమైన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మితిమీరిన అధికారాన్ని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించి, కిరాతక చట్టాలను, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ఏళ్ల తరబడి జైల్లో పెట్టే రాజ్య భీభత్సానికి వ్యతిరేకంగా ఇది హెచ్చరిక కూడా. దేశంలోని వివిధ కోర్టుల్లో అండర్‌ ట్రయళ్లుగా వున్న సుమారు 500,000 మంది బెయిల్‌ కోసం ఎదురుచూస్తున్నారు. సుశీల్‌ కుమార్‌ సేన్‌ (1975), కశ్మీరా సింగ్‌ (1977), రాణి కుసుమ్‌ (2005), పి. చిదంబరం (2020), సతేందర్‌ కుమార్‌ అంతిల్‌ (2022) కేసుల్లో సత్వర విచారణ జరిపే హక్కు నిందితుడికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అతను నేరానికి పాల్పడినట్లు నిర్ధారించబడటానికి ముందు విచారణ లేకుండా చట్టవిరుద్ధంగా ఎక్కువ కాలం జైలులో ఉంచకూడదు. విచారణ లేకుండానే నిందితుడిని నిరవధికంగా జైలులో నిర్బంధించడం రాజ్యాంగ ప్రజాస్వామ్యం కాదు. ఒకరిని ఒక కేసులో దోషిగా నిర్ధారించి శిక్షించే వ్యవస్థీకృత న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. 2014 నుండి కేంద్ర ఏజెన్సీలు నకిలీ సాక్ష్యాలను సృష్టించి, రాజకీయ పార్టీల నాయకులను, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను ప్రజా జీవితం, రాజకీయ కార్యకలాపాల నుండి జైలులో పెట్టడమనేది విస్తృతంగా వ్యాపించింది. దేశద్రోహం, యు.ఎ.పి.ఎ (ఉపా), మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పి.ఎం.ఎల్‌.ఎ) వంటి చట్టాలు విస్తృతంగా దుర్వినియోగం చేయబడ్డాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌, బి.ఆర్‌.ఎస్‌ నాయకురాలు కె.కవిత నుండి బెయిల్‌ లేకుండా మరణించిన స్టాన్‌స్వామి వరకు ఇందులో కొందరు మాత్రమే.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ట్రయల్‌ కోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు ఈ ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసేందుకు ప్రయత్నించింది. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పన వల్ల ఆర్థికంగా లబ్ధి పొందారనే ఆరోపణలతో మనీ లాండరింగ్‌ కేసులో సిసోడియాకు జైలు శిక్ష పడింది. పదిహేడు నెలల్లో ట్రయల్‌ కోర్టు నుంచి హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు బెయిల్‌ పిటిషన్లు వేస్తూనే వున్నారు. కేంద్ర సంస్థలు లేవనెత్తిన వాదనలను సమర్థిస్తూ న్యాయమూర్తులు బెయిల్‌ నిరాకరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం సిసోడియాకు సత్వర విచారణ హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమిక హక్కును నిరాకరించారని పేర్కొంటూ నెలన్నర క్రితం సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో కొన్ని పరిశీలనలు వ్యక్తి స్వేచ్ఛ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.
సహ నిందితుడి వాంగ్మూలం ఆధారంగా పి.ఎం.ఎల్‌.ఎ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి) ఒక వ్యక్తిపై నేరారోపణ చేయకూడదని జస్టిస్‌ భూషణ్‌ ఆర్‌ గవారు, జస్టిస్‌ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పి.ఎం.ఎల్‌.ఎ లోని సెక్షన్‌ 45 ‘రెండు షరతుల’కు లోబడి బెయిల్‌ మంజూరు చేయాలని చెప్తుంది. కానీ బెయిల్‌ చట్టం అనే సూత్రం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21కి వివరణ. ఇది పౌరులకు జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను వాగ్దానం చేస్తుంది.
పి.ఎం.ఎల్‌.ఎ లోని సెక్షన్‌ 45 కారణంగా ఆ హక్కును తిరస్కరించలేమని జస్టిస్‌ కె.వి. విశ్వనాథన్‌ తీర్పులో పేర్కొనడం గమనార్హం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బి.ఆర్‌.ఎస్‌ నేత కె.కవితకు బెయిల్‌ మంజూరు చేస్తూ సి.బి.ఐ, ఇ.డి భావించినట్లుగా వ్యక్తులను నిందితులుగా మార్చలేమని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసింది.
‘విచారణ ఎప్పుడూ న్యాయంగా ఉండాలి. స్వయంగా ఒప్పుకున్న నిందితుడిని ఈ కేసులో సాక్షిగా చేర్చారు. ఇదే జరిగితే, రేపు మీరు అనుకున్న వారినే నిందిస్తారు. అనుకునేవారు విడుదలవుతారు. అలాంటప్పుడు వ్యక్తులను ఎంపిక చేసి వారిని ప్రతివాదులుగా చేయడం ఏంట’ని కోర్టు ప్రశ్నించింది. గత పదేళ్లలో పి.ఎం.ఎల్‌.ఎ కింద నమోదైన 5,000 కేసుల్లో కేవలం 40 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయని ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. యు.ఎ.పి.ఎ వంటి తీవ్ర నేరాల కింద అరెస్టయిన వారికి కోర్టులు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయమూర్తులు అభరు ఎస్‌ ఓకా, అగస్టిన్‌ జార్జ్‌ మసీతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. 2015లో జైలుకెళ్లిన షేక్‌ జావేద్‌ ఇక్బాల్‌ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎ.టి.ఎస్‌ పరిష్కరించినప్పుడు ఈ సిఫార్సు వెలువడింది.
మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అరెస్టు చేసే అధికారం ఏకపక్షం కాదని, అరెస్టు చేసే ముందు పోలీసులు దాని అవసరాన్ని పరిశీలించాలని కోర్టు పేర్కొంది. ‘న్యూస్‌ క్లిక్‌’ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థ కేసులో, నిందితులకు అరెస్టుకు ముందు న్యాయ సలహా తీసుకునే హక్కు ఉందని, 24 గంటల్లో మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచే హక్కు ఉందని కూడా కోర్టు స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టు చేసిన ఇటువంటి పరిశీలనలు…బిజెపి పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థల పక్షపాతం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను బహిర్గతం చేస్తున్నాయి. దాదాపు అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలూ వ్యక్తులను కేసుల్లో ఇరికించి, విచారణ కూడా లేకుండా నెలల తరబడి జైలులో పెట్టే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఇ.డి తో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, సి.బి.ఐ, ఆదాయపు పన్ను శాఖ, యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ ప్రత్యర్థుల వేటలో ఒకే విధంగా ఉన్నాయి. కింది కోర్టులు తరచూ దర్యాప్తు సంస్థలతో కుమ్మక్కయ్యాయన్న ఆరోపణ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి కూడా చదవవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కులో న్యాయమైన, సత్వర విచారణ హక్కు అంతర్లీనంగా ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 141వ అధికరణం అన్ని న్యాయస్థానాలకు వర్తిస్తుందని న్యాయానికి, న్యాయపరమైన వివరణకు ఆఖరి మాట అయిన సుప్రీంకోర్టు చెప్పింది. దీన్ని అర్థం చేసుకుని ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు బెయిల్‌ పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటాయని ఆశించవచ్చు. మన రాజ్యాంగ లక్షణంగా పేర్కొనే వ్యక్తిగత స్వేచ్ఛను… ప్రాసిక్యూటర్‌ దయాదాక్షిణ్యాలకో లేక న్యాయ భావానికో తాకట్టు పెట్టకూడదు.

/ ‘దేశాభిమాని’ సౌజన్యంతో/

టి. చంద్రమోహన్‌

➡️