ఆకలి కేకలు

‘ప్రతిమల పెండ్లి సేయుటకు/ వందలు వేలు వ్యయించుగాని/ దు:ఖితమతులైన పేదల/ పకీరుల శూన్యములైన పాత్రలన్‌/ మెతుకు విదల్పదీ భరత మేదిని/ ముప్పది మూడు కోట్ల/ దేవత లెగవడ్డ దేశమున/ భాగ్యవిహీనుల క్షుత్తులాఱునే?’ అంటాడు జాషువా. లక్షలాది రూపాయలతో దేవుని పెళ్ళిళ్లు చేసే ఈ భూమిలో పేద వారి కడుపు నింపడానికి ఒక మెతుకు కూడా విదల్చని కఠినాత్ములపై తీవ్రంగా ధ్వజమెత్తుతాడు. ‘ఆ శిలావిగ్రహంబున కాహుతి యయి/ పోవుచున్నది నా పేద భోజనంబు’ అనటంలో రాళ్లకు దీపాలు, నైవేద్యాలు పెట్టటానికి అవసరమైన ఆహార ఉత్పత్తుల వినియోగం ఆ మేరకు పేదవాళ్ల భోజనాన్ని అపహరిస్తున్నదన్నది అని జాషువా ఆంతర్యం. ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ జనం ఆకలి మాత్రం తీర్చలేకపోతున్నారు. ముఖ్యంగా పేదలు గుప్పెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడాల్సిన దుస్థితి. మనిషి అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా నిత్యం పస్తులు, పసిబిడ్డల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ‘ఆకలికి అసలు కారణం ఆహారం కోసం చెల్లించలేని అసమర్థత’ అని ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ అంటారు.
పేద కుటుంబాలు ఒకటి రెండు ప్రధాన ఆహారాలపైనే ఆధార పడుతుండటంతో వారికి తగినంత విటమిన్లు, ప్రొటీన్లు అందడం లేదు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల్లో పోషకాహార లోపం కారణంగా అనేక దుష్ఫలితాలు తలెత్తుతాయి. అయిదేళ్లలోపు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో కీలకం. ఆకలి సమస్యతో బాధపడేవారు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌ వృద్ధి సాధిస్తోందని, పేదరికం తగ్గిపోయిందని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆకలి సూచీలో భారత్‌ స్థానం క్రమంగా దిగజారుతోంది. ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ‘సకల కష్టముల కంటె ఆకలి కష్టము మిక్కిలి ఎక్కువది’ అంటారు చిలకమర్తి. ఆరు నెలల నుంచి 23 నెలల వయసు గల పసిపిల్లల్లో సుమారు 67 లక్షల మంది 24గంటల పాటు పస్తుండే పరిస్థితి దేశంలో వుందని కేంద్ర ఆరోగ్యశాఖ జాతీయ కుటుంబ నమూనా సర్వే (2019-21) ఆధారంగా టెలిగ్రాఫ్‌ అధ్యయనం వెల్లడించింది. గ్లోబల్‌ హంగర్‌ సూచి-2023 వివరాల ప్రకారం-125 దేశాల్లో ఆకలి సూచికలో భారత్‌ స్థానం అట్టడుగున 111వ స్థానంలో ఉండడం విస్మయాన్ని కలిగిస్తున్నది. 2020లో 94, 2021లో 101, 2022లో 107వ స్థానానికి భారత్‌ దిగజారింది. దక్షిణ ఆసియాలోని పొరుగు దేశాల ఆకలి సూచికలతో పోల్చితే భారత్‌ ఏడాదికేడాది వెనుకబడి పోవడం విచారకరం.
ప్రపంచ దేశాలన్నింటిలో ఆహార ఉత్పత్తిలో రెండో స్థానంలో వున్న భారత్‌, పోషకాహార లోపంలో అగ్రస్థానంలోనూ ఆకలి కేకల్లో తొలి స్థానంలో నిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. చిన్నారులతో పాటు గిరిజనులు, గర్భిణులు, బాలింతలు, బాలికల్లో పోషకాహార లోపం ఎక్కువగా వుంది. చిన్నారులకు సరైన పోషకాహారం లభించకపోవడం, తల్లులు తమ పిల్లలకు అవసరమైన పాలను అందించకలేక పోవడం దీనికి కారణమని బాలల పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. 2022లో మృతి చెందిన బాలల్లో 65 శాతం మంది పేదరికం, పోషకాహార లోపం, ఆకలితో మరణించారని ఆక్స్‌ఫాం నివేదిక వెల్లడించింది. మరోవైపున పేద ప్రజల సంపద అదాని, అంబానీ జేబుల్లోకి యథేచ్ఛగా చేరుతోంది. కోవిడ్‌ తర్వాత వీరి సంపద రెట్టింపు అయ్యిందని అనేక లెక్కలు చెబుతున్నాయి. ‘ప్రతి మనుష్యునకు గర్భమందే జీర్ణకోశముండును, గాని పాపయ్యకు జీర్ణకోశము శరీరమంతటా గలదు’ అంటారు చిలకమర్తి. ఇలాంటి పాపయ్యల ధన దాహం చిన్నారుల పాలిట శాపంగా మారింది. వీరి ధన దాహం తీర్చడానికి దేశసంపదను నైవేద్యంగా పెడుతోంది కేంద్ర బిజెపి ప్రభుత్వం. ‘మీదే మీదే సమస్త విశ్వం/ మీరే లోకపు భాగ్యవిధాతలు/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చేనాళ్ల విభాప్రభాతములు’ అంటారు మహాకవి శ్రీశ్రీ. ఈ దేశ చిన్నారుల మోములో ఆరోగ్యకరమైన హాసం మెరవాలంటే… చిన్నారులందరికీ పౌష్టికాహారం అందాలి. ఆ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది.

➡️