ఈ మధ్య కార్పొరేట్ దిగ్గజాలు కొందరు పని గంటలు పెంచాలనే డిమాండును బలంగా ముందుకు తెస్తున్నారు. ఈ డిమాండు ఈనాటిది కాదు. పెట్టుబడిదారీ విధానం ప్రాణం పోసుకున్న దగ్గర నుండి పెట్టుబడిదారీ వర్గం నిరంతరం ఈ పని గంటలు పెంచే ప్రయత్నం చేస్తూనే వుంది. కార్మిక వర్గం దానిని అంతే బలంగా తిప్పికొట్టి వుండకపోతే, ఈపాటికి వాళ్లు పని దినాలను పూర్తిగా 24 గంటలకు పెంచి వుండేవాళ్లేమో! 24 గంటలా, అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, చరిత్రలో వాళ్లు పని గంటలను పెంచుకున్న తీరును చూస్తే, వాళ్ల దురాశకు హద్దులుండవని మనకు అర్థమౌతుంది.
ఇంగ్లండులో ఫాక్టరీ ఇన్‌స్పెక్టర్ల నివేదికలు చూస్తే, మార్క్స్‌కే ఆశ్చర్యం కలిగింది. అక్కడ పని గంటలు 13, 14, 15, అట్లా హనుమంతుని తోకలా 16, 17, 18 గంటల వరకు పెరుగుతూ పోయాయి. ఇంకా ముందుకు పోవాలనే వాళ్ల కోరిక. కాని పోలేకపోయారు. కారణం, వున్నది రోజుకు 24 గంటలే. వాటిలో 18 పోతే, ఇక మిగిలేది 6 గంటలు మాత్రమే. ఆ 6 గంటల్లో ఉదయాన్నే నెరవేర్చాల్సిన కాలకృత్యాలు, వంట, రెండు సార్లు తిండి, పిల్లలను సముదాయించటం, నిద్రపోవటం-ఇవన్నీ సాధ్యమా? అసాధ్యమనే, మనం అనుకుంటాం. అయినా, రాజు తల్చుకుంటే, దెబ్బలకు కొదవా, అన్నట్లు పెట్టుబడిదార్లు తలచుకుంటే జరగనిది ఏముంటుంది? వాళ్లు అనుకున్నారు. కార్మికులు అన్నిటినీ ఆ 6 గంటల్లోనే ముగించారు.
కార్మికులను ఫ్యాక్టరీలోనే వుండమన్నారు. అక్కడే తిండి, అక్కడే పడక, అక్కడే సంసారం. అక్కడే అన్నీ ఎట్లా? ఫ్యాక్టరీ ఆవరణలోనే గూళ్లు లాంటి చిన్న చిన్న గదులు కట్టారు. ఒక్కొక్క దాంట్లో, నలుగురైదుగురిని కుక్కారు. అక్కడే ఆడవాళ్లు, అక్కడే మగవాళ్లు, అక్కడే బాల కార్మికులలోని మగ పిల్లలు, ఆడ పిల్లలు. అందరూ కలిసే వుంటారు. కలిసే తింటారు. కలిసే నిద్రపోతారు. ఈ క్రమంలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో మనం వూహించగలమా? (ఇదంతా పూర్తిగా అర్థం కావాలంటే మార్క్స్ కాపిటల్ గ్రంథం చదవాల్సిందే.). ఆ పుట్టే బిడ్డల బాధ్యత ఎవరిది? ఇంత అమానుషత్వానికి, ఇంత దుర్మార్గానికి పాల్పడగలిగింది, ఒక్క పెట్టుబడిదారీ వర్గమే. వీళ్ల వారసులే ఇప్పటి మన కొర్పొరేట్ దిగ్గజాలు. ఆనాడు వాళ్లు ఎందుకు చేశారు ఈ దుర్మార్గమంతా? ఆ 18 గంటలు పని చేయించుకొని గరిష్ట లాభాలను గుంజటానికే. వారి సంపదులు పెంచుకోటానికే, కదా!
ఈ పరిస్థితిని ఇట్లాగే ఎల్లకాలం కొనసాగించాలని వారు కలలు కన్నారు. కాని, అది వారి పేరాశే అని తరువాత రుజువైంది. పని గంటల తగ్గింపు కోసం జరిగిన పోరాటం మొదట 1866లో చికాగో నగరంలో జరిగింది. దానిమీద ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆరుగురు కార్మికులు ఆ పోరాటంలో నేలకొరిగారు. వారి రక్తంతో తడిచిన బట్టే ఈనాటి మన ఎర్రజెండా. కార్మికవర్గ పోరాటాలకు అది శాశ్వత చిహ్నంగా నిలిచి పోయింది.
ఐరోపాలో జరిగిన పునరుజ్జీవనోద్యమం తరువాత పెట్టుబడిదారీ విధానం బాగా బలపడింది. ఇటు కార్మికవర్గం, అటు బూర్జువావర్గం రెండూ కూడా బలపడ్డాయి. కార్మికవర్గం ఆ రోజుల్లో వేతనాల పెంపు, పని గంటల తగ్గింపు కొరకు రాజీ లేని పోరాటాలు నిర్వహించింది. దానికి మార్క్సిస్టు సిద్ధాంతం తోడవడంతో అది మరింత బలపడింది. అనేక ఐరోపా దేశాల్లో జరిగిన కార్మికవర్గ పోరాటాలు తిరుగుబాటు రూపం కూడా తీసుకున్నాయి. సామ్రాజ్యవాదుల మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కార్మిక వర్గ నాయకత్వాన రష్యాలో సోషలిస్టు రాజ్యం యేర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అదే కార్మికవర్గాల నాయకత్వాన అనేక ఐరోపా దేశాల్లో సోషలిస్టు రాజ్యాలు యేర్పడ్డాయి. మరికొన్ని ఐరోపా దేశాల్లో సోషల్ డెమొక్రాట్ల నాయకత్వాన పురోగామి ప్రభుత్వాలు యేర్పడ్డాయి. ఈ కాలంలో పెట్టుబడిదారీ శక్తులు బలహీన పడటం, సోషలిస్టు శక్తులు బలపడటం మనం చూస్తాము. యీ పోరాటాల్లో, అంటే పని గంటలు, వేతనాల కోసం జరిగిన పోరాటాలతో పాటు జరిగిన తిరుగుబాట్లు, యుద్ధాలు, విప్లవాలలో కష్టజీవుల నెత్తురు ఏరులై పారింది. రష్యాలో సోషలిస్టు వ్యవస్థను కాపాడుకోటానికి ఫాసిస్టు జర్మనీ (హిట్లర్)కి వ్యతిరేకంగా జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక్క రష్యాలోనే నాలుగు కోట్ల మంది కష్ట జీవులు ప్రాణ త్యాగం చేశారు. ఇట్లా అనేక పోరాటాల్లో కోట్లాది మంది చిందించిన రక్తం ఫలితంగానే 18 గంటల పనిదినం క్రమ క్రమంగా తగ్గి, అది 8 గంటలకు చేరింది. ఈ పోరాటాల ఫలితంగానే బూర్జువా ప్రభుత్వాలు కూడ సంక్షేమ పథóకాలను అమలు జరపక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాంటి రాజ్యాల్నే సంక్షేమ రాజ్యాలంటున్నాము.
ఇన్ని త్యాగాలతో సాధించిన 8 గంటల పని దినాన్ని మన కష్టజీవులు అంత తేలిగ్గా వదులుకుంటారా? ఈ సందర్భంగా మరొక విషయం కూడా ప్రస్తావించాలి. మన కార్పొరేటు దిగ్గజాలు పని గంటలు పెంచమని ఎందుకు డిమాండు చేస్తున్నాయి? తమ సంపదలు పెంచుకోటానికే, కదా! దానధర్మాలు చేయటానికి కాదు, కదా! మన ప్రధాని నరేంద్ర మోడీ…అంబానీ, అదానీల లాంటి కార్పొరేట్ దిగ్గజాల బ్యాంకు అప్పులు 16 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశాడు. ఇది అప్పనంగా ప్రజాధనాన్ని వాళ్లకు దోచి పెట్టటమే కదా!
వారి ఆస్తులను ఒకసారి పరిశీలిద్దాం. అంబాని ఆస్తి = రూ.8,37,810 కోట్లు. ఆదాని ఆస్తి = రూ.7,02,960 కోట్లు. సాధారణ వ్యవసాయ కార్మికుని సగటు ఆస్తి = రూ.2 లక్షలు. వాళ్లేమో లక్షల కోట్లలో వుంటారు. వీళ్లేమో వట్టి లక్షల్లో మాత్రమే వుంటారు. ఈ దిగ్గజాల ఆస్తి వ్యవసాయ కార్మికుల ఆస్తుల కంటే 4 కోట్ల రెట్లు ఎక్కువ. ఆకాశానికి భూమికి వున్నంత తేడా. వీళ్ల వ్యవహారం ఇంకా బాగా అర్థం కావాలంటే, వాళ్ల దినసరి ఆదాయాలు కూడా పరిశీలించాలి.
అదానీ ఆదాయం రోజుకు 1600 కోట్ల రూపాయలు. వ్యవసాయ కార్మికుని దినసరి సగటు ఆదాయం కేవలం 33 రూపాయలు. దేశంలో ఇంత దరిద్రం వుంది కాబట్టే ఆకలి సూచీలో మన దేశం 107వ స్థానంలో వుంది (లెక్కలు తీసిన మొత్తం దేశాలు 121). మన చుట్టూ వున్న దేశాలు-చైనా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మన కంటే బాగా మెరుగైన స్థానాల్లోనే వున్నాయి. మనతోపాటు, మన స్థాయిలో వున్నది ఒక్క పాకిస్తాన్ మాత్రమే. ఆకలి సూచీ మాత్రమే కాదు. మన దేశంలో అవసరమైన పోషకాలందక పిల్లలు గిడసబారిపోతున్నారు. దేశంలో ఇంత దరిద్రం ఎందుకున్నట్లు? కారణం, సంపన్నుల దగ్గర మేరు పర్వతాల్లా సంపదలు పోగు పడడమే. వాళ్ల దగ్గర వున్న సంపదలను కొంతవరకు తగ్గిస్తే దానితో పేదలు కొంత వరకు తేరుకోగలుగుతారు.
సంపదలు పోగుపడటానికి కారణం దోపిడీ అని అందరికీ తెలిసిందే. బ్రిటీష్‌వాళ్లు మన దేశాన్ని పాలిస్తున్న కాలంలో అనేక కరువులు సంభవించాయి. కోట్లాది మంది కరువు వాత పడ్డారు. ఒక్క బెంగాల్ కరువులోనే 44 లక్షల మంది చనిపోయారు. బ్రిటీష్‌వాళ్ల దోపిడియే మన కరువులకు కారణమని ఆనాటి మన మేధావులు కరెక్టుగానే చెప్పారు. బ్రిటీష్‌వాళ్లు పరోక్షంగానైనా దానిని అంగీకరించారు. కాబట్టే వాళ్లు మన నదులకు ఆనకట్టలు కట్టి రైతులకు సాగునీరు అందించారు. ఆ విధంగా ధాన్యం ఉత్పత్తిని పెంచి కరువుల తీవ్రతను తగ్గించారు.
మన దేశంలో తాండవిస్తున్న దరిద్రానికి ఈ బడా కార్పొరేట్లే కారణం. కార్పొరేట్లు మరింతగా తమ ఆస్తులను పోగేసుకోటానికి పని గంటలు పెంచమని నిర్లజ్జగా డిమాండు చేస్తున్నారు. ఎంత దురాశ? ఎంత అమానుషం? అయినా కోట్లాది మంది కష్టజీవుల బలిదానంతో సిద్ధించిన ఈ 8 గంటల పని దినాన్ని నేటి కష్టజీవులు అంత తేలికగా వదులుకుంటారా? కనీస మద్దతు ధర కోసం లక్షలాది రైతాంగం సంవత్సరాల తరబడి ఎండనక వాననక చలనక సాగిస్తున్న సమరశీల పోరాటాన్ని మనం చూస్తూనే వున్నాం. 8 గంటల పని దినాన్ని కాపాడుకోటానికి ఇంతకుమించిన పట్టుదలతో ప్రతిఘటనను కష్టజీవులు చేపట్టాలని, చేపడతారని ఆశిద్దాం.
సి.సాంబిరెడ్డి